కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన ఉదయ్ శంకర్ పదిహేనేళ్ల వయసుకే కృత్రిమమేధ (ఏఐ) కంపెనీని ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటివరకు ఏడు ఏఐ యాప్‌లు, తొమ్మిది కంప్యూటర్ ప్రోగ్రామ్స్, సుమారు 15 రకాల గేమ్‌లను శంకర్ డిజైన్ చేశాడు. అతడి పేరు మీద మూడు పేటెంట్లు ఉన్నాయి. మరో నాలుగింటికి దరఖాస్తు చేశాడు. గతేడాది ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ చిల్డ్రన్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అవార్డు అందుకొన్నాడు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ కాన్పుర్‌ల నుంచి ఏఐ సర్టిఫికెట్ కోర్సులు చేశాడు. మరోవైపు.. దూరవిద్య ద్వారా టెన్త్ పూర్తి చేశాడు. ఉదయ్ శంకర్ నాలుగో తరగతిలోనే రోబోటిక్స్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆన్‌లైన్లో పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. టెక్నాలజీపై ఉన్న మక్కువతో 8వ తరగతిలో చదువును మధ్యలోనే ఆపేసి ఏఐకి సంబంధించిన పలు అంశాల్లో నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ఉరవ్ అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ స్థాపించి, దానికి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (సీటీవో)గా ఉన్నట్లు తెలిపాడు. ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, గేమ్ డెవలప్‌మెంట్ వంటి కోర్సుల్లో శంకర్ ఇప్పుడు ఇతరులకు శిక్షణ ఇస్తున్నాడు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z