Health

కోవిద్ బారినపడి మృతిచెందిన భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ-NewsRoundup-July 20 2024

కోవిద్ బారినపడి మృతిచెందిన భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ-NewsRoundup-July 20 2024

* ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలోని నలుగురు అధికారులు పర్యవేక్షించాల్సిన శాఖలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు సీఎం కార్యాలయం, సాధారణ పరిపాలనశాఖ, హోమ్‌, ఆర్థిక, ఎక్సైజ్‌, రెవెన్యూ, దేవాదాయ శాఖలు కేటాయించారు. ఏవీ రాజమౌళికి జలవనరులు, విద్యుత్‌, గనులు, వ్యవసాయం, సీఎంఆర్‌ఎఫ్‌, ఫిర్యాదులు తదితర శాఖలు పర్యవేక్షించనున్నారు. ప్రద్యుమ్నకు రవాణా, పురపాలక, పంచాయతీరాజ్‌, ఆర్టీజీఎస్‌, అటవీ, పౌరసరఫరాలశాఖలు కేటాయించారు. కార్తికేయ మిశ్రాకు ఆర్థిక, ఐటీ, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, సమాచార పౌరసంబంధాలు, పరిశ్రమలు, సీఎం దిల్లీ, విదేశీ పర్యటనల సమన్వయం తదితర విభాగాలు చూడనున్నారు.

* ఏపీ అభివృద్ధే ప్రధాన అజెండాగా పోటీ పడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 22 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్రమంత్రులను కలవాలని ఆదేశించారు.

* దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాలని కొంతకాలంగా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కులగణనపై స్పందించిన కేంద్రమంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ (Chirag Paswan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కులగణన చేపట్టేందుకు మద్దతు తెలిపారు. కానీ, అది సమాజ విభజనకు దారి తీస్తుందన్నారు. అందుకే వాటి సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని హెచ్చరించారు.

* నాలుగేళ్ల క్రితం యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌ (Covid 19) మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లోనూ ఈ వైరస్‌ కారణంగా 5.3లక్షల మంది మృతిచెందారు. అయితే, కొవిడ్‌ సమయంలో భారత్‌లో మరణాల సంఖ్య (Covid Deaths) నివేదించిన దాని కన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లు ఓ అంతర్జాతీయ అధ్యయం తాజాగా వెల్లడించింది. 2020లో 11.9 లక్షల అధిక మరణాలు చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఈ అధ్యయనాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తప్పుదోవ పట్టించే నివేదిక అని కొట్టిపారేసింది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS)-5 నివేదికను విశ్లేషించి భారత్‌లో కరోనా విజృంభణ (CoronaVirus) సమయంలో అత్యధిక మరణాలు చోటుచేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కొన్ని మీడియా కథనాలు ఈ అధ్యయనాన్ని ప్రచురించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ (Health ministry) శాఖ దీన్ని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
* గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. జెండా ఊపి ఫ్లైఓవర్‌పైకి ఉమెన్‌ బైకర్‌ను అనుమతించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు.

* ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు చెందిన వెబ్‌సైట్లో (EPFO) నిత్యం సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. సాంకేతిక అవరోధాల కారణంగా నిత్యం యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇదే అంశంపై తాజాగా ఈపీఎఫ్‌వో ఆఫీసర్ల అసోసియేషన్‌ కేంద్రానికి లేఖ రాసింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఈనెల 25న శాసనసభలో ప్రవేశపెట్టనుంది. వాస్తవిక అంచనాలతో బడ్జెట్‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖకు సూచించింది. 25న ఉదయం 9గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ప్రతిపాదనలపై చర్చించి బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.

* నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్‌ మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్‌రెడ్డి జాబ్‌ క్యాలెండర్‌ విషయమే మరిచిపోయారని ఎద్దేవా చేశారు.

* భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను కలిశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

* తెలంగాణలో పాఠశాలల వేళలను మారుస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం 4.45కి బదులుగా 4.15 గంటలకు పని వేళలు ముగుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులోఉ న్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4గంటల వరకు కొనసాగనున్నాయి. ఈమేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశించారు.

* 2024 టీ20 ప్రపంచ కప్‌తో టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఈ మెగా టోర్నీతోనే పరాస్ మంబ్రే (బౌలింగ్ కోచ్‌), విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), ఫీల్డింగ్ కోచ్‌ (టి దిలీప్)ల పదవీకాలం కూడా పూర్తయింది. కొత్త ప్రధాన కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్‌ సహాయక కోచ్‌ల ఎంపిక దృష్టిపెట్టాడు. ఇదిలా ఉండగా.. మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్ రాథోడ్‌ (Vikram Rathour) సేవలను మరో రకంగా వాడుకోవాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. విక్రమ్‌ రాథోడ్‌ను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా నియమించాలని యోచనలో ఉన్నట్టు సమాచారం.

* తన సతీమణి అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. సింగపూర్‌లోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఆమె మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశారు. ఈ మేరకు జరిగిన గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో పట్టా అందుకున్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.పవన్‌కల్యాణ్‌ హీరోగా జయంత్‌ సి.పరాన్జీ తెరకెక్కించిన ‘తీన్‌మార్‌’లో అన్నా లెజినోవా యాక్ట్‌ చేశారు. ఆ సినిమా తర్వాత పవన్‌ – అన్నా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

* మహేశ్‌బాబు (Mahesh Babu) కుమార్తె సితార పుట్టినరోజు నేడు. ఈసందర్భంగా తన కుమార్తెకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా సితార ఫొటో షేర్‌ చేసిన ఆయన ‘హ్యాపీ 12 మై సన్‌షైన్‌’ అని పేర్కొన్నారు. మరోవైపు, నమ్రత సైతం ఇన్‌స్టా వేదికగా స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. సితార చిన్నప్పటి ఫొటోలు, వీడియోలతో దీనిని క్రియేట్‌ చేశారు. ‘‘నా చిట్టి ప్రయాణ సహచరురాలికి జన్మదిన శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. నువ్వు ఎల్లప్పుడూ నాకొక ట్రావెల్‌ గైడ్‌లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా. ఐ లవ్‌ యూ మై స్వీట్‌హార్ట్‌’’ అని క్యాప్షన్‌ జత చేశారు. ఈ పోస్టులపై పలువురు నెటిజన్లు స్పందించారు. సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z