Business

16వేల కోట్లకు పైగా లాభాన్ని నమోదు చేసిన HDFC-BusinessNews-July 20 2024

16వేల కోట్లకు పైగా లాభాన్ని నమోదు చేసిన HDFC-BusinessNews-July 20 2024

* HDFC Bank Q1 results | ముంబయి: ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC bank) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో 33.17 శాతం వృద్ధితో రూ.16,674.85 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.12,370 కోట్లుగా ఉంది. స్టాండలోన్‌ పద్ధతిలో రూ.16,174 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్లు బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.57,816 కోట్ల నుంచి రూ.83,701 కోట్లకు పెరిగింది. ప్రొవిజన్లు రూ.2,860కోట్ల నుంచి రూ.2602 కోట్లకు తగ్గాయి. నిరర్థక ఆస్తులు 1.24 శాతం నుంచి 1.33 శాతానికి పెరిగాయి.

* సినీ ప్రియులకు కర్ణాటక (Karnataka) ప్రభుత్వం త్వరలో షాకివ్వనుంది. సినిమా టికెట్లు (Cinema Tickets), ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై 2శాతం సెస్‌ (Cess) వసూలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. సినిమా, సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల (సంక్షేమం) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ (OTT subscriptions) ధరలతో పాటు సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై సెస్‌ విధించే ప్రణాళికల అంశాన్ని ప్రతిపాదించింది. వీటిపై 1-2 శాతం సెస్‌ వసూలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రతి మూడేళ్లకోసారి ఈ సెస్‌ రేటును సమీక్షించనున్నట్లు తెలిపింది.

* ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పని గంటలు పెంచే ప్రతిపాదనపై కర్ణాటక ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం కర్ణాటక షాప్స్‌ అండ్‌ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1961లో కొన్ని మార్పులు చేయాల్సిఉంటుంది. ఈ ప్రతిపాదనపై ట్రేడ్‌ యూనియన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈమేరకు కర్ణాటక స్టేట్‌ ఐటీ/ ఐటీ ఆధారిత సేవలు అందించే ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) ప్రతినిధులు కార్మిక శాఖ మంత్రి సంతోష్‌లాడ్‌ను కలిసి తమ వ్యతిరేకతను తెలియజేశారు.

* ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో రూ.2.57లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. 2023-24 ఇదే త్రైమాసిక ఆదాయం రూ.2.31 లక్షల కోట్లతో పోలిస్తే, ఇది 11.5% అధికం. అయితే మార్చి త్రైమాసిక ఆదాయం రూ.2,64,834 కోట్లతో పోల్చితే ఇది 2.7% తక్కువ. సమీక్షా త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.15,138 కోట్ల (షేరుకు రూ.22.37)కు పరిమితమైంది. 2023 ఏప్రిల్‌-జూన్‌లో లాభం రూ.16,011 కోట్ల (షేరుకు రూ.23.66)తో పోలిస్తే ఇది 5% తక్కువ. జనవరి-మార్చిలోని రూ.18,951 కోట్లతో పోలిస్తే 20% తగ్గిందని చెప్పాలి.

* తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నాబార్డ్‌ కీలకపాత్ర పోషించిందని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డ్‌) తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ చింతల సుశీల్‌ అన్నారు. 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పథకాలలో నాబార్డ్‌ భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందన్నారు. నాబార్డు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడంతోపాటు ఇంక్యూబేషన్‌ సెంటర్‌లతో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి పలు చర్యలు తీసుకుంటున్నదన్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్‌ పడింది. రికార్డు స్థాయి గరిష్ఠాల్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. మరోవైపు మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది. ఈ పరిణామం భారతీయ మార్కెట్ల నష్టాలను మరింత పెంచింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 738.81 పాయింట్లు లేదా 0.91 శాతం పడిపోయి 81 వేల మార్కుకు దిగువన 80,604.65 వద్ద ముగిసింది. నిజానికి తీవ్ర ఒడిదొడుకుల్లోనే ట్రేడింగ్‌ సాగింది. ఒకానొక దశలో గురువారం ముగింపుతో చూస్తే 244 పాయింట్లకుపైగా ఎగిసి ఆల్‌టైమ్‌ హైని తాకుతూ 81,587.76 వద్దకు సూచీ వెళ్లింది. అయితే ఈ ఉత్సాహం ఎంతోసేపు నిలబడలేకపోయింది. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవడంతో 844.36 పాయింట్ల నష్టాన్ని సెన్సెక్స్‌ మూటగట్టుకోవడం గమనార్హం. చివరకు కొంతమేర కోలుకున్నా.. నష్టతీవ్రత ఎక్కువగానే ఉన్నది. అలాగే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 269.95 పాయింట్లు లేదా 1.09 శాతం దిగజారి 24,530.90 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో మునుపెన్నడూ లేనివిధంగా 24,854.80 స్థాయికి చేరినా.. నిలదొక్కుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే 292.7 పాయింట్ల మేర నష్టపోయింది. అయితే ఆఖర్లో కాస్త కోలుకున్నది. అంతకుముందు 4 రోజులపాటు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లోనే కదలాడిన విషయం తెలిసిందే. సెన్సెక్స్‌ 1,446.12 పాయింట్లు లేదా 1.80 శాతం పుంజుకున్నది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z