WorldWonders

అవినీతి కేసులో ఏకంగా దేశ ప్రధానికే సమన్లు-NewsRoundup-July 22 2024

అవినీతి కేసులో ఏకంగా దేశ ప్రధానికే సమన్లు-NewsRoundup-July 22 2024

* అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పెద్దిరెడ్డి, స్థానిక వైకాపా నేతలపైనే అనుమానం ఉందన్నారు. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆర్డీవో, తహసీల్దార్‌, ఉద్యోగుల ఫోన్లు సీజ్‌ చేశామని, అన్ని రెవిన్యూ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

* ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైకాపా ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నలుపు కండువాలతో వస్తుండగా.. లోపలికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై వైకాపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగన్‌ అభ్యంతరం తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని చెప్పడంపై మండిపడ్డారు. పేపర్లు గుంజుకుని చింపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులపై వేలు చూపుతూ హెచ్చరించారు.

* చెత్త కుప్పలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.5 లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ దొరికిన ఘటన చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానికంగా ఉంటున్న దేవరాజ్ అనే వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం రూ.5 లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ చేయించారు. ఇటీవల చెత్తను పారవేసే క్రమంలో తన చేతిలో ఉన్న డైమండ్‌ నెక్లెస్‌ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. ఆ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన కుటుంబసభ్యులు చెన్నై కార్పొరేషన్‌ను సంప్రదించారు.

* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిన్‌ బ్యాంక్‌ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామి అని అన్నారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి మోసానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్‌ బ్యాంకు లేదని, ఆ బ్యాంకు గ్యారంటీలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కుంభకోణంలోని గుత్తేదారుల పేర్లు త్వరలోనే బయటపెడతానన్నారు.

* నీట్‌-యూజీ 2024 (NEET-UG 2024) పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్‌- యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న విషయంలో తీవ్ర చర్చ జరిగింది. ఒకే ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు మాత్రం ఒక్కదానికే వేశారంటూ పిటిషనర్లు వాదించారు. దానికి మార్కులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మెరిట్‌ లిస్టు మారే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

* అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు జైల్లో ఉన్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది తానేనని.. కానీ ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్‌ మళ్లీ మొదలుపెట్టారని విమర్శించారు.

* ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కూటమి శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా ఇంకా తనే సీఎం అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు.

* రాగల మూడు రోజులపాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

* ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పని గంటలు పెంచాలనే ప్రతిపాదన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోశ్‌ లాడ్‌ సోమవారం స్పందించారు. పని గంటలు పెంచాలంటూ ఐటీ పరిశ్రమలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని వెల్లడించారు.

* ప్రఖ్యాత నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams) తన సహోద్యోగులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో వీక్‌ ఆఫ్‌ను ఎంజాయ్‌ చేశారు. కాగా నాసా వ్యోమగాములకు వీక్‌ ఆఫ్‌ ప్రకటించడంతో వారు స్టార్‌లైనర్‌లోకి వెళ్లి సరదాగా గడిపారు. తమ కుటుంబానికి ఫోన్‌ చేసి మాట్లాడారు.

* అక్కడ పట్టెడన్నం తినాలన్నా మహిళలు భయానక అనుభవం చవిచూడాల్సిన పరిస్థితి. సైనికుల లైంగిక వాంఛలు తీరిస్తేనే వారికి ఆహారం లభిస్తుంది. ఆఫ్రికా దేశమైన సూడాన్‌ (Sudan)లోని ఒమ్దుర్‌మన్‌ పట్టణంలోని కొందరు మహిళల దుస్థితి ఇది. ది గార్డియన్‌ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది.

* టీమ్‌ఇండియా (Team India) ఇటీవల పొట్టి ప్రపంచకప్‌ నెగ్గి.. సుదీర్ఘ ఐసీసీ ట్రోఫీల కలను నెరవేర్చుకుంది. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలోనూ అదరగొట్టింది. ప్రస్తుతం శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు సిద్ధమైంది. ఈ పర్యటనతోనే హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ ప్రస్థానం ప్రారభం కానుంది. అతడి మార్గనిర్దేశంలో టీమ్‌ఇండియాలో గణనీయమైన మార్పులు రానున్నట్లు పలువురు క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌ గంభీర్‌ మొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌ పెట్టి తన విజన్‌ ఏంటో వెల్లడించాడు.

* నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 16 పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్‌, రవాణా, సాంకేతిక తదితర సమస్యలను కారణాలుగా పేర్కొంది. డీఎంకే ఎంపీ కనిమొళి అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్‌ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

* అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ అంశంపై ఓ సారి రివ్యూ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తు అంశాలపై పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దగ్ధమైన ఫైళ్లు ఏయే విభాగాలకు చెందినవో కనుక్కోవాలని ఆదేశించారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులు ఎవరనే అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిన అధికారుల ప్రమేయంపైనా దృష్టి పెట్టాలన్నారు.

* ఒక అవినీతి కేసులో ఏకంగా దేశ ప్రధానికే సమన్లు అందాయి. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో షాంచెజ్‌ సతీమణిపై ఆరోపణలు రావడంతో ఆయన సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..స్పెయిన్‌ (Spain) ప్రధాని పెడ్రో షాంచెజ్‌ (Pedro Sanchez) సతీమణి బెగొనా గోమెజ్‌ (Begona Gomez)పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాను నడుపుతోన్న యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ కోర్సుకు స్పాన్సర్ల కోసం ప్రధాని సతీమణి హోదాను ఉపయోగించుకున్నారంటూ గోమెజ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సాక్షిగా ప్రధానిని ప్రశ్నించేందుకు విచారణాధికారులు సమన్లు ఇచ్చారు. అధికారిక నివాసంలో జులై 30న ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించనున్నారు. ఆయన సాక్ష్యం ఈ కేసుకు కీలకం కానుందని పేర్కొన్నారు. ఇటీవల గోమెజ్‌ విచారణకు హాజరైనా.. జడ్జి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అలాగే తనపై వచ్చిన ఆరోపణలకు ఆమె ఇంతవరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. పెడ్రో మాత్రం విపక్షాల విమర్శల్ని తోసిపుచ్చుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణల కారణంగా ఏప్రిల్‌లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని భావించి, తన విధుల నుంచి ఐదు రోజులపాటు బ్రేక్ తీసుకున్నారు. కానీ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు.

* దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా శాంతి నియామకంపైనే ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుగుతోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్‌గా ఆయన మాట్లాడారు. ఆమె నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి నియామకం జరిగినప్పుడు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు ఏపీపీఎస్సీలో కీలకంగా ఉన్నారని, ఒక వేళ నియామకంలో తప్పులు జరిగితే ఆయన కూడా బాధ్యులవుతారని అన్నారు. శాఖాపరమైన విచారణ ముగిసి, తగిన ఆధారాలు సేకరించాక ఏపీపీఎస్సీని వివరణ కొరతామన్నారు.

* బిహార్‌ (Bihar)కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్రం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్‌-యునైటెడ్‌ (జేడీయూ).. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z