DailyDose

రైల్వే ట్రాక్‌పై కూర్చుని పాటలు వింటూ ఇద్దరు మృతి-CrimeNews-July 22 2024

రైల్వే ట్రాక్‌పై కూర్చుని పాటలు వింటూ ఇద్దరు మృతి-CrimeNews-July 22 2024

* రైల్వే ట్రాక్‌పై కూర్చొని పాటలు వింటుండగా రైలు దూసుకురావడంతో ఇద్దరు బాలురు మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌దేపుర్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు సమీర్ (15), జాకీర్ అహ్మద్ (16) ఆదివారం సాయంత్రం ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని, రైల్వే ట్రాక్‌ మీద కూర్చొని పాటలు వింటున్నారు. అదే సమయంలో పట్టాలపై దూసుకొచ్చిన రైలు ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పట్టాలపై మృతదేహాలను గుర్తించిన సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇద్దరూ చెవుల్లో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకోవడం వల్ల వారికి రైలు శబ్దం వినిపించకపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.

* అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి దుర్మరణం చెందారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం ఐతానగర్‌లో ఉంటున్న దేవాదాయశాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు, నాగమణి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హారిక (24) గతేడాది పశువైద్యురాలిగా పట్టా అందుకున్నారు. అనంతరం అమెరికాలో పశువైద్య విభాగంలో ఎంఎస్‌ చేసి ఇక్కడి పాడి రైతులకు మెరుగైన సేవలు అందించాలన్న ఆలోచనతో గత ఆగస్టులో అక్కడకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఓక్లహామాలో ఎంఎస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆమె తన విధులు ముగించుకుని తోటి వారితో కలిసి కారులో ఇంటికి బయల్దేరారు. అందులో మొత్తం ఐదుగురు ఉన్నారు. హారిక వెనుక సీటులో కూర్చున్నారు.

* భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను, ఏడాది వయసు కూడా లేని బిడ్డను కడతేర్చి.. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించి బేగంపేట్‌ ఏసీపీ గోపాలకృష్ణ, బోయిన్‌పల్లి ఎస్సై శివశంకర్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని మార్టోలి తాలూకా డెగ్లూరుకు చెందిన కోల్‌నూరె గణేశ్‌ సంగ్రామ్‌ (35) వృత్తిరీత్యా డ్రైవరు. మూడేళ్లుగా అతను భార్య స్వప్న (30), ఆరేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు త్రివేణి, తనుశ్రీలతో కలిసి న్యూబోయిన్‌పల్లి పెద్దతోకట్టలో నివాసం ఉంటున్నాడు. 11 నెలల క్రితం వీరికి మరో కుమార్తె నక్షత్ర జన్మించింది. గణేశ్‌ సంగ్రామ్‌ కూరగాయలను తరలించే ఆటోను నడుపుతుండగా, స్వప్న ఇంటివద్దే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటోంది. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని గణేశ్‌ కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ అనుమానం మరింత ఎక్కువై.. ఆదివారం తెల్లవారుజామున నేలపై నిద్రిస్తున్న భార్యతోపాటు ఊయలలో నిద్రపోతున్న పసిపాప నక్షత్రను తాడుతో గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం గణేశ్‌ ‘100’కు ఫోన్‌చేసి తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నందున ఆమెతోపాటు కుమార్తెను హత్య చేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ చిరునామా చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. అనంతరం అమ్ముగూడ-సనత్‌నగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య సుచిత్ర ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఆ ఇంటికి చేరుకుని చూసేసరికి స్వప్న, నక్షత్రలు విగతజీవులుగా పడిఉన్నారు. తనుశ్రీ అప్పుడే నిద్రలేచి కూర్చొని ఉండగా, త్రివేణి ఇంకా నిద్రలోనే ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మృతుడి సోదరుడు సంజయ్‌కు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

* నేరస్థులు ఎంత తెలివిని ఉపయోగించినా ఒక్కోసారి సులువుగా దొరికిపోతుంటారు. ఎందుకంటే వాళ్లు చేసే ఏదో ఒక చిన్న పొరపాటు వాళ్లను పట్టిస్తుంది. తాజాగా మహారాష్ట్రలోని పుణె సిటీలో అలాంటి ఘటనే జరిగింది. పుణెలో రెండేళ్ల చిన్నారి హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. హంతకుడి హుడీపై రాసి ఉన్న మూడు పదాలు పోలీసులు ఈ కేసును ఛేదించడానికి తోడ్పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పుణెలో రెండేళ్ల బాలిక హత్యకు గురైంది. చిన్నారి తల్లి, ఆమె ప్రియుడు కలిసి చిన్నారిని హత్య చేశారు. తర్వాత తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని నిందితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. హత్య జరిగిన రోజు చిన్నారి ఇంట్లోకి ఓ వ్యక్తి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. అయితే అందులో ముఖం సరిగా కనిపించకపోవడంతో అతను ఎవరు అనేది గుర్తించడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. దాంతో నిందితుడు ధరించిన హుడీపైగల మూడు మరాఠీ పదాలపై పోలీసుల దృష్టి పడింది. ఆ మూడు పదాల ఆధారంగా కేసును విచారించారు. ఆ హుడీపై ‘సంఘర్ష్‌ గ్రూప్‌, ఖిర్‌పురి’ అని మరాఠీలో రాసి ఉంది. ఖిర్‌పురి గ్రామం అకోలా జిల్లాలో ఉన్నది. దాంతో పోలీసులు ఖిర్‌పురి గ్రామానికి వెళ్లి నిందితుడి గురించి ఆరా తీశారు. దాంతో నిందితుడు దొరికిపోయాడు. అతడిని పుణెకు తీసుకెళ్లి విచారించగా చిన్నారి తల్లితో తనకు వివాహేతర బంధం ఉన్నట్లు తెలిపాడు. ఆ బంధానికి అడ్డుగా ఉందనే ఇద్దరూ కలిసి చిన్నారిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దాంతో చిన్నారి తల్లిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

* పాత‌బ‌స్తీ శాలిబండ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని షంశీర్ గంజ్‌లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం భారీ ప్ర‌మాదం జ‌రిగింది. రోడ్డు ప‌క్క‌నే ఉన్న ఓ భారీ వృక్షం కుప్ప‌కూలిపోయింది. ఆ చెట్టు ప్ర‌ధాన ర‌హ‌దారిపై విరిగి ప‌డింది. దీంతో ఆ చెట్టు కింద ప‌లు వాహ‌నాలు ఇరుక్కుపోయాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆలోపే స్థానికులు చెట్టు కొమ్మ‌ల‌ను తొల‌గించి గాయాల‌పాలైన వారిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంలో మొత్తం 12 మంది గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప‌లు వాహ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. క్ష‌త‌గాత్రుల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. బాధితుల కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. చెట్టు కూల‌డంతో షంశీర్ గంజ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ట్రాఫిక్ పోలీసులు చెట్టును తొల‌గించి, ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z