Health

ఊబకాయంలో ఏపీ నెం.3

ఊబకాయంలో ఏపీ నెం.3

దేశంలో పెరుగుతున్న స్థూలకాయంపై (obesity) ఆర్థిక సర్వేలో (Economic Survey) ఆందోళన వ్యక్తమైంది. అత్యధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల వినియోగంపై అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది. దేశంలో 54 శాతం అనారోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని సర్వే పేర్కొంది. పౌరులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకునేలా దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఒబెసిటీ అంశం ప్రస్తావనకు వచ్చింది.

దేశంలో ఒబెసిటీ ఆందోళనకరంగా మారిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ముఖ్యంగా పెద్దల్లో స్థూలకాయం ఆందోళనకరమని పేర్కొంది. దేశంలో యువ జనాభా నుంచి ప్రయోజనం పొందాలంటే వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతో పాటు వారిని ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు మళ్లించడం కీలకం అని అభిప్రాయపడింది. ఇటీవల ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్ రీసెర్చ్‌ వెలువరించిన నివేదికను ఉటంకిస్తూ.. అధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ వినియోగం కూడా విపరీతంగా పెరిగిందని సర్వే తెలిపింది. ఫిజికల్‌ యాక్టివిటీ తగ్గిపోవడం అధిక బరువు/ ఒబెసిటీకి కారణమవుతోందని విశ్లేషించింది. పెద్దల్లో స్థూలకాయం మూడింతలు పెరిగిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. చిన్నారుల్లోనూ ఈ సమస్య వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయంలో వియత్నాం, నమీబియా తర్వాత స్థానంలో భారత్‌ ఉందంటూ వరల్డ్‌ ఒబెసిటీ ఫెడరేషన్‌ నివేదికను ఆర్థిక సర్వే ఉటంకించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z