* రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించేలా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
* నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం, జేడీయూ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వాలని బిహార్ డిమాండ్, అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఆచితూచి వ్యవహరించిన నేపథ్యంలో సంకీర్ణ ధర్మాన్ని పాటించిన మోదీ ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది.
* ఏపీ ప్రభుత్వం రెండు కీలక బిల్లులను శాసనసభ ముందుకు తీసుకొచ్చింది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించారు.
* రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగిందని, హు కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని సీఎం తెలిపారు.
* కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. విభజన చట్టం హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు.
* దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు తగవని మంత్రి సీతక్క అన్నారు. ఆ వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని.. దీని వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి చిట్‌చాట్ నిర్వహించారు.
* 2033 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రోస్కోస్మోస్ ప్రకటించింది. రష్యన్ ఆర్బిటల్ స్టేషన్(ROS) నిర్మాణానికి సంబంధించిన వివరాలను రోస్కోస్మోస్ అధిపతి యూరీ బొరిసోవ్ మంగళవారం వెల్లడించారు.
* వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం వైకాపాకు 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు.
* నీట్ (NEET UG 2024 Exam) ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు (Supreme Court) అభిప్రాయ పడింది. నీట్ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘‘ఝార్ఖండ్‌లోని హజారీబాగ్, బిహార్‌లోని పట్నాలోని కేంద్రాల్లో నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. ఈ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధరణకు రావడం ప్రస్తుత దశలో కష్టం. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారు. వారిలో అనేకమంది వందల కి.మీల దూరం ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
* శ్రీలంకతో త్వరలో జరగనున్న మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లకు భారత జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్ నేతృత్వంలో ఆటగాళ్లను ఎంపిక చేశారు. టీ20ల్లో సంజూ శాంసన్ (Sanju Samson)కు అవకాశం కల్పించగా.. వన్డే సిరీస్‌కు మాత్రం ఎంపిక చేయలేదు. శాంసన్‌ను వన్డేల్లోకి తీసుకోకపోవడంపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. సంజుకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే మొదటిసారి కాదని, ఇది చివరిసారి కూడా కాదని ఉతప్ప పేర్కొన్నాడు. టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడంతో నాయకత్వంలో మార్పు రావడమే ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు.
* ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించే చర్చ. ఇది నిత్య జీవితంలోనూ కీలకంగా మారింది. ఈ అధునాతన సాంకేతికత వైద్య రంగంలో కీలక మార్పులు తీసుకొస్తోంది. పలు వ్యాధుల నిర్ధరణలో వైద్యులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. క్యాన్సర్ నిర్ధరణలో ఇది డాక్టర్లను అధిగమిస్తోందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఏఐ టూల్ 84 శాతం కచ్చితత్వంతో గుర్తించిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తమ నివేదికలో వెల్లడించారు. దీన్ని 67 శాతం కచ్చితత్వంతో గుర్తించే వైద్యులను ఈ సాంకేతిక అధిగమించిందని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z