ఒలింపిక్స్‌లో ఎప్పుడూ అమెరికాదే తిరుగులేని ఆధిపత్యం. అయితే ఆ దేశానికి ఒకప్పుడు రష్యా సవాలు విసిరేది. కానీ తర్వాత చైనా.. అమెరికా, రష్యాలకు దీటుగా ఎదిగింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ నుంచి చైనా జోరు మామూలుగా లేదు. ఆ ఏడాది 28 స్వర్ణాలతో.. అమెరికా (37), రష్యా (32)ల తర్వాతి స్థానాన్ని అలంకరించిన చైనా.. 2004లో రష్యా (28)ను వెనక్కి నెట్టి.. అమెరికా (36) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 2008లో సొంతగడ్డపై జరిగిన ఒలింపిక్స్‌లో ఏకంగా అమెరికానే దాటేసింది డ్రాగన్. బీజింగ్‌లో జరిగిన ఆ ఒలింపిక్స్‌లో చైనా 48 స్వర్ణాలు సహా 100 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. యుఎస్ మొత్తంగా 112 పతకాలతో పైచేయి సాధించినా.. స్వర్ణాల్లో (36) వెనుకబడి రెండో స్థానానికి పరిమితమైంది. అయితే సొంతగడ్డపై చూపించిన పట్టుదలను ఆ తర్వాతి రెండు ఒలింపిక్స్‌లో కొనసాగించలేకపోయింది చైనా. 2012లో అమెరికా 48 స్వర్ణాలతో తిరిగి అగ్రస్థానం సాధిస్తే.. చైనా 39 పసిడి పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. 2016లో చైనా 26 బంగారు పతకాలతో మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం. యుఎస్ 46 స్వర్ణాలతో ఎప్పట్లాగే అగ్రస్థానం సాధించింది. బ్రిటన్ 27 పసిడి పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. 2020 ఒలింపిక్స్ సమయానికి చైనా గొప్పగా పుంజుకుంది. అమెరికా (39 స్వర్ణాలు) కేవలం ఒక్క పతకం తేడాతో అగ్రస్థానం సాధించింది. చైనా 38 పసిడి పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. 2008 తర్వాత రష్యా ఒక్కసారీ టాప్-3లో చోటు సంపాదించలేదు. గత ఒలింపిక్స్‌లో డోపింగ్ కారణంగా, ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల ఒలింపిక్స్ నుంచి రష్యా నిషేధం ఎదుర్కొంది. ఆ దేశ అథ్లెట్లు ఈసారి నామమాత్రంగా 15 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. చైనా ఈసారి అమెరికాను అధిగమించి అగ్రస్థానం సాధించాలన్న పట్టుదలతో ఉంది. కానీ యుఎస్ అంత తేలిగ్గా లొంగుతుందా అన్నదే సందేహం.
ఎప్పట్లాగే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు అమెరికానే సాధిస్తుందనడంలో ఎవరికీ సందేహాల్లేవు. అత్యధిక స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలిచిన 2008లోనూ ఓవరాల్ పతకాల్లో అమెరికానే ఆధిపత్యం చలాయించింది. ఈసారి ఒక అధ్యయనం ప్రకారం యుఎస్ 112 పతకాలు గెలుస్తుందని అంచనా. చైనా మొత్తంగా 86 పతకాల దాకా సాధిస్తుందని అంటున్నారు. కానీ ఈ అధ్యయనం ప్రకారం స్వర్ణాల్లో మాత్రం రెండు దేశాల మధ్య అంతరం తక్కువే ఉండొచ్చని అంచనా. అమెరికా 39 పసిడి పతకాలు గెలిస్తే.. చైనా 34 బంగారు పతకాలు సాధిస్తుందట. అయితే అంతరం తక్కువే కాబట్టి కొన్ని క్రీడల్లో ఫలితాలు అటు ఇటు అయితే చైనా అగ్రస్థానంలో నిలిచినా ఆశ్చర్యం లేదు. చైనా ఒకప్పట్లా బ్యాడ్మింటన్‌లో ఆధిపత్యం చలాయించే పరిస్థితి లేకపోవడం ఆ దేశానికి ప్రతికూలత. కానీ టేబుల్ టెన్నిస్, డైవింగ్‌లో మెజారిటీ స్వర్ణాలు చైనా సొంతమవుతాయనడంలో సందేహం లేదు. ఇంకా వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్, సెయిలింగ్, కనోయింగ్ లాంటి క్రీడల్లోనూ చైనాకు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే స్వర్ణాలు వస్తాయి. అయితే అమెరికా ఆధిపత్యం చలాయించే క్రీడలు చైనాతో పోలిస్తే ఎక్కువ. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో యుఎస్‌కు చైనా దరిదాపుల్లో ఉండదు. స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్‌లో అమెరికాదే పైచేయి కావచ్చు. సిమోన్ బైల్స్ లాంటి స్టార్ అథ్లెట్లు ఉన్న జిమ్నాస్టిక్స్‌లో అమెరికా మెజారిటీ పసిడి పతకాలు సాధించే అవకాశాలున్నాయి. ఇంకా సైక్లింగ్, స్కేట్‌బోర్డ్, సర్ఫింగ్, తైక్వాండో, ఫెన్సింగ్, గోల్ఫ్, బ్రేకింగ్ లాంటి క్రీడల్లో అమెరికా స్వర్ణాలు సాధించే అవకాశాలున్నాయి. రష్యా లాంటి నుంచి ఈసారి ప్రాతినిధ్యం నామమాత్రం కావడంతో సాధారణంగా ఆ దేశ అథ్లెట్లు ఆధిపత్యం చలాయించే క్రీడల్లో పసిడి పతకాలను ఎవరు ఎక్కువగా తమ ఖాతాలో వేసుకుంటారన్న దాన్ని బట్టి అగ్రస్థానం ఎవరిదో నిర్ణయం కావచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z