Sports

పారిస్ ఒలంపిక్స్ విలువిద్య పోటీల్లో భారత మహిళల శుభారంభం-NewsRoundup-July 25 2024

పారిస్ ఒలంపిక్స్ విలువిద్య పోటీల్లో భారత మహిళల శుభారంభం-NewsRoundup-July 25 2024

* పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics) సమరంలో భారత్‌కు శుభారంభం దక్కింది. అధికారిక ఆరంభోత్సవం కంటే ఒక రోజు ముందుగానే మన అథ్లెట్లు బరిలో దిగారు. గురువారం జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో భారత మహిళా ఆర్చర్లు అదరగొట్టారు. అంకిత భకత్ (11వ స్థానం, 666 పాయింట్లు), భజన్‌ కౌర్‌ (22వ స్థానం, 658 పాయింట్లు), దీపిక కుమారి (23వ స్థానం, 658 పాయింట్లు) సత్తా చాటారు. దీంతో టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ నాలుగో స్థానం (1983 పాయింట్లు) దక్కించుకుని నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ విభాగంలో దక్షిణాకొరియా (2046 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచింది. చైనా (1996 పాయింట్లు), మెక్సికో (1986 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటాయి. 5 నుంచి 12 స్థానాల్లో నిలిచిన టీమ్‌లు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ఆడతాయి. ఆర్చర్ల వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగానే టీమ్‌ సీడింగ్‌ కేటాయిస్తారన్న విషయం తెలిసిందే. జులై 28న జరగనున్న క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో భారత్‌.. ఫ్రాన్స్‌ లేదా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. క్వార్టర్స్‌లో గెలిస్తే సెమీ ఫైనల్‌లో టాప్‌ సీడ్‌, బలమైన దక్షిణాకొరియాతో తలపడే అవకాశముంది. దక్షిణాకొరియా ఒలింపిక్స్ చరిత్రలో ఆర్చరీలో 27 బంగారు పతకాలు సాధించింది.

* గూగుల్‌ మ్యాప్‌ (Google maps) పెట్టుకొని కార్లో వెళుతుంటాం. నేరుగా వెళ్లాలని మ్యాప్‌లో చూపిస్తుంటుంది. కానీ ఎదురుగా ఫ్లైఓవర్‌, దాని దిగువన సర్వీస్‌ రోడ్డు. అలాంటప్పుడు పై నుంచి వెళ్లాలా? కింది నుంచి వెళ్లాలా? అనే సందేహం చాలామందికి తలెత్తుతూ ఉంటుంది. దీనికి గూగుల్‌ మ్యాప్స్‌ పరిష్కారం చూపింది. ‘ఫ్లైఓవర్‌ కాల్‌ ఔట్‌’ పేరిట కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఎప్పటినుంచో కోరుతున్న ఈ ఫీచర్‌ ఈ వారంలోనే అందుబాటులోకి రానుంది. ఐఓఎస్‌ యూజర్లకు కాస్త ఆలస్యంగా లభించనుంది. వీటితో పాటు మరికొన్ని ఫీచర్లనూ గూగుల్‌ గురువారం ప్రకటించింది.

* విశ్వనగరంగా హైదరాబాద్‌ను (Hyderabad) తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి భారీగా రూ.10వేల కోట్లు కేటాయించారు. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు రూ.1500 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు, పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, మెట్రో వాటర్‌ వర్క్స్‌ రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు.

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

* ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై తెలంగాణ హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదును స్పీకర్‌ తీసుకోలేదని భాజపా శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌ తన ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను తీసుకోవాలని, పిటిషనర్‌కు ధ్రువీకరణ రశీదు ఇవ్వాలని స్పీకర్‌ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది.

* ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులతో కేంద్రం ఆక్సిజన్‌ అందించిందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన లోక్‌సభలో మాట్లాడారు. గతంలో ఏ బడ్జెట్‌లో జరగని విధంగా… ఏపీకి ఈ బడ్జెట్‌లో న్యాయం జరిగిందన్నారు. ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇస్తే.. రాష్ట్రం మొత్తాన్ని దోచేశాడని, ల్యాండ్‌, శాండ్‌మైనింగ్‌, భూములు, లిక్కర్‌ ఇలా అన్నింట్లో దోపిడీ జరిగిందని చెప్పారు.

* ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి లోయర్‌ మానేరు డ్యామ్‌ను కేటీఆర్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం కాంగ్రెస్‌ పార్టీ చేస్తోందని మండిపడ్డారు. గత ఎనిమిది నెలలుగా కాళేశ్వరం నుంచి నీరు లిఫ్ట్‌ చేయకుండా పంట పొలాలను ఎండబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

* శాంతిభద్రతల విషయంలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని, అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధమని ప్రకటించారు. శాసనసభలో ‘శాంతిభద్రతలపై శ్వేతపత్రం’ విడుదల సందర్భంగా సీఎం మాట్లాడారు. లా అండ్‌ ఆర్డర్‌పై మరింత లోతుగా చర్చించాలని, మరో సెషన్‌ నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కోరగా.. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఎన్డీయే సభ్యులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావొద్దని సీఎం సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామన్నారు. అధికారులు చట్టాన్ని గౌరవించినప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయన్నారు.

* టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) తనయుడు ఆకాశ్‌ పూరీ (Akash Puri) పేరు మార్చుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈవిషయాన్ని తెలియజేశారు. ఇకపై తన పేరు ఆకాశ్‌ పూరీ కాదని.. ఆకాశ్‌ జగన్నాథ్‌ అని ప్రకటించారు. ఈమేరకు ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కొత్త పేరు.. కెరీర్‌ పరంగా ఆయన నూతన విజయాలు అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆకాశ్‌ తన పేరు మార్చుకోవడానికి గల కారణం చెప్పలేదు.

* ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఒలింపిక్స్ పోటీల ఆరంభం రోజే ప్ర‌పంచ రికార్డు బ‌ద్ధ‌లైంది. ఆర్చ‌రీ ర్యాంకింగ్స్ రౌండ్‌లో ద‌క్షిణ కొరియా యువ‌కెర‌టం లిమ్ సిహైయ‌న్ (Lim Sihyeon) చ‌రిత్ర సృష్టించింది. మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త ఆర్చ‌రీ విభాగంలో ఐదేండ్ల రికార్డు బ్రేక్ చేసింది. గురువారం జ‌రిగిన పోటీల్లో 21 ఏండ్ల లిమ్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ 694 పాయింట్లు సాధించింది.

* లోక్‌స‌భ‌(Lok Sabha)లో ఇవాళ ఇద్ద‌రు పంజాబీ నేత‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. కాంగ్రెస్ ఎంపీ చ‌ర‌ణ్‌జీత్ చ‌న్ని, కేంద్ర మంత్రి, బీజేపీ నేత ర‌వ్‌నీత్ బిట్టు … వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగారు. దీంతో స‌భ‌కు 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. కేంద్ర బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌లో పాల్గొన్న స‌మ‌యంలో.. చ‌ర‌ణ్‌జీత్ చ‌న్ని మాట్లాడుతూ.. పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ వీర‌మ‌ర‌ణం పొందిన‌ట్లు కేంద్ర మంత్రి బిట్టుపై సెటైర్ వేశారు. బిట్టూజీ .. మీ తాత అమ‌రుడ‌ని, కానీ నువ్వు కాంగ్రెస్‌ను వీడిన‌ప్పుడు ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు ఆరోపించారు. మాజీ సీఎం బియాంత్ సింగ్ మ‌నువ‌డే .. కేంద్ర మంత్రి ర‌వ్‌నీత్ బిట్టు. కాంగ్రెస్ పార్టీని వీడిన బిట్టు.. ఇటీవ‌ల‌ బీజేపీలో చేరారు.

* రాష్ట్రాన్ని అప్పుల‌కుప్ప‌గా మార్చార‌ని గ‌త ప్ర‌భుత్వ పాల‌న మీద బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేశార‌ని మాజ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. భ‌ట్టి విక్ర‌మార్క చేసిన ఆరోప‌ణ‌లను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు హ‌రీశ్‌రావు తెలిపారు. భ‌ట్టి ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ఎల్పీలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 57 వేల కోట్ల అప్పులు తెచ్చుకుంటామ‌ని బ‌డ్జెట్‌లో భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌తిపాదించారు. గ‌త ప్ర‌భుత్వం కంటే రూ. 17 వేల కోట్ల అప్పులు ఎక్కువ‌గా తెచ్చుకుంటామ‌ని ప్ర‌తిపాదించారు. గ‌తంలో ఆర్థిక మంత్రిగా నేను ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో రూ. 40 వేల కోట్లు ఎఫ్ఆర్‌బీఎం కింద అప్పులు ప్ర‌తిపాదిస్తే, భ‌ట్టి విక్ర‌మార్క మాత్రం రూ. 57 వేల కోట్లు ప్ర‌తిపాదించారు. మా కంటే రూ. 17 వేల కోట్లు ఎక్కువ‌గా చూపించారు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

* తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్‌రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదని.. కనీసం చదవలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యానని.. 80ల్లో మంత్రి అయ్యానని.. అప్పట్నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. ఇప్పుడు దేశంలోనే సీనియర్‌ మోస్ట్‌ నాయకుడ్ని నేనే అని అన్నారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అంతా నా తర్వాత వచ్చారని అన్నారు. రాజకీయాల్లో ఉంటే చరిత్ర అంతా చూస్తుంటాం కదా.. కానీ దేశంలో జగన్‌లాంటి వ్యక్తి ఎవరూ తగల్లేదని అన్నారు.

* వైఎస్‌ జగన్‌ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ రైతులకు (AP Farmers) కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) హామీ ఇచ్చారు. గురువారం ఏపీ అసెంబ్లీ (Assembly) లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రైతు భరోసా ఇస్తామని అన్నారు. ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తామన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్‌ రుణాలు(Bank Loans), ప్రభుత్వ పరిహారం అందజేస్తామని వివరించారు. 2019లో జగన్‌ చేసిన చట్టాన్ని రద్దు చేసి 2016లో టీడీపీ తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం మెరుగైన ఇన్స్‌రెన్స్‌ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. 2016 నుంచి 2019 వరకు అందిన విధంగా ఇన్స్‌రెన్స్‌ ప్రయోజనన అమలు చేస్తామన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z