* దేశీయంగా బంగారం ధర (Gold price) వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం మీద వెయ్యి రూపాయల మేర తగ్గింది. దేశీయంగా నగల వ్యాపారులు భారీగా బంగారం విక్రయిస్తుండడం, అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణం. దేశ రాజధాని దిల్లీలో బుధవారం 10 గ్రాములు పసిడి ధర రూ.71,650 పలకగా.. గురువారం రూ.70,650కి తగ్గింది. హైదరాబాద్‌లో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.70,400 మేర పలుకుతోంది. ఆర్నమెంట్‌కు వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.64వేలుగా ఉంది. వెండి ధర కూడా రూ.3,500 మేర క్షీణించి రూ.84 వేలుగా ఉంది. గడిచిన మూడు రోజుల్లో వెండి కిలోకు రూ.5 వేలు వరకు తగ్గడం గమనార్హం.
* దేశవ్యాప్తంగా ప్రస్తుతం 102 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (Vande Bharat Express) అందుబాటులో ఉన్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. ఇందులో 16 రైళ్లు మహారాష్ట్ర మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని అన్నారు. ‘ భవిష్యత్‌లో ఎన్ని వందే భారత్ రైళ్లను తీసుకురాబోతున్నారు? అందులో మహారాష్ట్రకు ఉపయోగపడేలా ఏమైనా ఉన్నాయా?’ అంటూ శివసేన (యూబీటీ) ఎంపీ ఓం ప్రకాశ్ భూపాల్ సిన్హా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. నిర్దిష్టమైన సంఖ్య ఏమీ లేదని ప్రజల అవసరాలు, రద్దీకి అనుగుణంగా మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 19 జులై 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 102 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు.
* కోటక్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్‌ను ఈ రోజు నుంచి సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 ఇండెక్స్‌ను ప్రతిబింబించే లేదా ట్రాక్ చేసే ఓపెన్ ఎండ్ పథకం. ఈ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ 2024 జులై 25న ప్రారంభమై ఆగస్టు 8న ముగుస్తుంది. ఈ పథకం ఆగస్ట్ 21 లేదా అంతకు ముందు విక్రయం/కొనుగోలు కోసం మళ్లీ తెరుస్తారు. NSEకి సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్‌లో వర్తకం చేసే కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రారంభ కొనుగోలు కోసం కనీస దరఖాస్తు మొత్తం రూ.100 సిప్ కొనుగోలుకు కనీస దరఖాస్తు మొత్తం రూ.100. ఈ ఫండ్ ద్వారా వచ్చే నిధులను ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 95-100% వరకు పెట్టుబడి పెడతారు. డెట్ సాధనాల్లో గరిష్ఠంగా 5% వరకు పెట్టుబడులు పెడతారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మూలధన లాభాలపై బడ్జెట్‌లో పన్ను ప్రతిపాదించడం వంటి కారణాలతో గురువారం ఉదయం భారీ నష్టాలతో సూచీలు ట్రేడింగ్‌ను ఆరంభించాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లో అమ్మకాలు సూచీలను పడేయగా.. టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ స్టాక్స్ దన్నుగా నిలిచాయి. దీంతో భారీ నష్టాల నుంచి సూచీలు గట్టెక్కాయి. నిఫ్టీ 24,400 స్థాయిని నిలుపుకొంది. సెన్సెక్స్ ఈ ఉదయం 79,542.11 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,148.88) నష్టాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం నష్టాల్లో కొనసాగినప్పటికీ.. నష్టాలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. చివరికి 109.08 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 80,039 వద్ద వద్ద స్థిరపడింది. నిఫ్టీ 7.40 పాయింట్ల నష్టంతో 24,406.10 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.17గా ఉంది.
* ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచంలో ఉన్న భయంకరమైన ఆర్థిక అసమానతలకు అద్దం పట్టింది. గత దశాబ్దకాలంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో తొలి 1 శాతం మంది 42 లక్షల కోట్ల డాలర్లు సంపాదించినట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని అట్టడుగున ఉన్న 50శాతం పేదల మొత్తం సంపద కంటే ఇది 34 రెట్లు అధికమని పేర్కొంది. బ్రెజిల్‌లో జీ20 కూటమి సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశానికి ముందు ఆక్స్‌ఫామ్ (Oxfam) ఈ నివేదికను విడుదల చేసింది. ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న తొలి ఒక శాతం మందిలో ఒక్కొక్కరి సంపద పదేళ్లలో సగటున నాలుగు లక్షల డాలర్ల చొప్పున పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ (Oxfam) నివేదిక తెలిపింది. అదే అట్టడుగున ఉన్న 50 శాతం మందిలో ఒక్కొక్కరు 335 డాలర్లు మాత్రమే సంపాదించినట్లు చెప్పింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z