‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్‌కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. అలా కాకుండా బయట కూర్చొని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడతారా అని నిలదీశారు. జగన్ పాలనలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారని అధికారిక గణాంకాలతో తాము వెల్లడిస్తుంటే.. రూ.7.48 లక్షల కోట్లే అప్పు చేశామంటూ వైకాపా అధినేత అసత్యాలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగన్ చెబుతున్నట్లుగా రూ.2.71 లక్షల కోట్లే బటన్ నొక్కి పంపిణీ చేస్తే.. రూ.9.74 లక్షల కోట్ల అప్పు ఎందుకయ్యిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ఐదేళ్ల పాలనలో కొనసాగిన ఆర్థిక అరాచకం, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై శ్వేతపత్రాన్ని చంద్రబాబు శాసనసభలో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రసంగించారు.
‘మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. పదేళ్లపాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం (ఏఆర్ఈటీ) పేరిట రూ.14,275 కోట్లు, వ్యాట్‌ను పక్కన పెట్టేసి స్పెషల్ మార్జిన్ రూపంలో రూ.26,673 కోట్లు దారి మళ్లించారు. వీటికి జవాబు చెప్పకుండా ఆయన తప్పించుకుంటారా’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయటమంటే ఆ నగరంలోని విలువైన ఆస్తుల్ని తాకట్టు పెట్టటమా అని నిలదీశారు. ‘ఎన్డీయే అధికారం చేపట్టాక రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్మోహన్రెడ్డిలో ఏ మాత్రం నిజాయతీ, ధైర్యం, సిగ్గు ఉన్నా హత్యకు గురయినవారి పేర్లు వెల్లడించాలి. ఆ ఎఫ్ఐఆర్లు ఇవ్వాలి. వాటికి బాధ్యులెవరో గుర్తించి చర్యలు తీసుకుంటాం. అందుకు ఆయన సిద్ధమా?’ అని చంద్రబాబు సవాల్ విసిరారు. వైకాపా ఒక రాజకీయ పార్టీగా కొనసాగాలనుకుంటే తమ డిమాండును అంగీకరించాలన్నారు. ‘వైకాపా పాలనలో జరిగిన రాజకీయ హత్యల్లో చనిపోయినవారి పేర్లు, చంపినవారి పేర్లు మేం వెల్లడించాం. జగన్‌కు దమ్ముంటే ఆయన ఆరోపిస్తున్నట్లుగా హత్యకు గురైన 36 మంది పేర్లు ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు. వినుకొండలో హత్యకుగురైన రషీద్, హత్య చేసిన వ్యక్తి ఇద్దరూ మొన్నటి వరకూ వైకాపాలోనే ఉన్నారని, ఈ కేసులో నిందితుణ్ని అరెస్టు చేశామని తెలిపారు. వైకాపా పాలనలో జరిగిన రాజకీయ హత్యల కేసుల్ని తిరిగి తెరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z