* వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పొందేందుకు కాలుష్య నియంత్రణ (PUC) సర్టిఫికెట్ ఇకపై తప్పనిసరి కాదు. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కోసం కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తప్పనిసరి అన్న 2017 ఆగస్టు 10 నాటి ఆర్డర్ ద్వారా విధించిన షరతును సుప్రీంకోర్టు తొలగించింది. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ ఏఎస్ ఓకా, ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. 2017 ఆర్డర్‌కు సంబంధించి ఉన్న ఇబ్బందులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేవనెత్తారు. ప్రమాద బాధితులు నేరుగా వాహన యజమానుల నుంచి నష్టపరిహారం కోరుతున్నారని, కానీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవడంతో వాహన యజమానులు పరిహారాన్ని చెల్లించలేకపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాహన బీమా పాలసీ పునరుద్ధరణ కోసం పీయూసీ సర్టిఫికేట్ తప్పనిసరి అని మోటారు వాహనాల చట్టం, 1988 కానీ దాని కింద రూపొందించిన మరే ఇతర చట్టం కానీ నిబంధనలు విధించలేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాలుష్యాన్ని నియంత్రించేందుకు వాహనాలు ఎప్పటికప్పుడు పీయూసీ సర్టిఫికెట్లను కలిగి ఉండేలా ఈ షరతు విధించామని, దీనికి మరింత సమర్థవంతమైన పరిష్కారం అవసరమని కోర్టు నొక్కి చెప్పింది. కాగా ఢిల్లీ-ఎన్సీఆర్లో వాహనాలను ట్రాక్ చేయడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కోర్టు సూచించింది.
* దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ఈరోజు (జూలై 27) ఉన్నంటుండి ఎగిశాయి. దీంతో వరుస తగ్గింపులతో ఆనందంలో ఉన్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.250 పెరిగి రూ.63,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ. 69,000 వద్దకు ఎగిసింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇలాగే ధరలు ఊపందుకున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.250 హెచ్చి రూ.63,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ.69,150 వద్దకు ఎగిసింది. ఇక చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.64,650 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.550 పెరిగి రూ.70,530 వద్దకు హెచ్చింది.
* భారత వైమానిక దళం ‘సుదర్శన్ ఎస్-400’ రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసినట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. భారతదేశం తన వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి రష్యాతో కలిసి ‘సుదర్శన్ ఎస్-400’ను తయారుచేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ..‘సుదర్శన్ ఎస్-400 రక్షణ క్షిపణి పరీక్ష విజయవంతం అయింది. శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసింది. విమానాలపై అటాక్ చేసి అవి ముందుకు కదలకుండా నిరోధించింది. ఈ వ్యవస్థ వల్ల భారత వైమానిక రక్షణ దళం మరింత పురోగమించింది. రష్యా-భారత్ కలిసి వీటిని ఈ వ్యవస్థను రూపొందించాయి. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో రెండు స్క్వాడ్రన్లు సిద్ధం అవుతాయి’ అన్నారు.
* ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ భారత్‌లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యాక్సెస్ 125 అత్యధికంగా 2,63,788 యూనిట్లు, అవెనిస్ 125 మోడల్ 1,52,578 యూనిట్లు, బర్గ్మాన్ స్ట్రీట్ వాహనాలు 72,045 యూనిట్లను ఇగ్నిషన్ కాయిల్‌లోని హై-టెన్షన్ వైర్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ చేసింది. ఈ వాహనాలు 2022 ఏప్రిల్ 30 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్య కాలంలో తయారయ్యాయి. ఆయా మోడల్ స్కూటర్లు కొనుగోలు చేసినవారిని సంప్రదించే పనిలో కంపెనీ ఉంది. సమీపంలోని సర్వీస్ సెంటర్లో లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేసిస్తుంది.
* కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు రూ.37,000 కోట్ల ఎరువుల సబ్సిడీ అందించినట్లు రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్లో తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) విధానం ద్వారా రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి స్పందిస్తూ..‘రైతులకు తక్కువ ధరకు ఎరువులు లభ్యమయ్యేలా ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. కొన్ని ఎరువుల తయారీకి సంబంధించి కంపెనీలకు ఇప్పటికే 100 శాతం రాయితీలు అందించాం. రిటైల్ దుకాణంలో అమర్చిన పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల ద్వారా ఆధార్‌తో రైతులు సబ్సిడీపై ఎరువులు పొందుతున్నారు’ అని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z