* రాజమహేంద్రవరంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్‌ను అదుపులోకి తీసుకుని.. డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వివరాలను ఎస్పీ నర్సింహ కిశోర్ మీడియాకు వెల్లడించారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతోనే అతడు నగదు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి అశోక్ పరారైనట్లు తెలిపారు. ఫిర్యాదు అందగానే 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడి చోరీకి ప్లాన్ చేశాడని వివరించారు. ఏటీఎంలకు ఎప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయో ముందుగానే గుర్తించి చోరీకి తేదీని కూడా నిందితుడు ముందుగానే నిర్ణయించుకున్నాడని తెలిపారు. సాంకేతిక ఆధారాలు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.
* అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ హైదరాబాద్‌కు చెందిన పాలడుగు రఘురామ్, సునీత దంపతులు మోసానికి పాల్పడ్డారు. మాదాపూర్‌కి చెందిన బాధితుడు చాట్ల సంజీవ్ కుమార్ ఫిర్యాదు మేరకు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సంజీవ్ కుమారుడికి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అడ్మిషన్ ఇప్పిస్తామని నమ్మించిన నిందితులు.. అతడి నుంచి రూ.3.25 కోట్లు తీసుకున్నారు. అమెరికా వైట్ హౌస్‌లో తమకు తెలిసిన వ్యక్తి ఉన్నారని ఆయన్ని నమ్మించారు. ఎప్పటికీ ఈ ప్రక్రియలో పురోగతి లేకపోవడంతో సంజీవ్ వారిని నిలదీశాడు. అడ్మిషన్ గురించి మాట్లాడేందుకు అమెరికా వెళ్తున్నామని చెప్పి..మైసూర్‌కు వెళ్లిపోయారు. అమెరికాలో ఉన్నట్లుగా మైసూర్ నుంచి వాట్సాప్ కాల్ మాట్లాడారు. ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
* నగర పరిధిలోని జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీ(డీఎం)లో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. విజయనగరం జిల్లాకు చెందిన సాయి కార్తీక్ నాయుడు మూడో ఏడాది ఈసీఈ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం అధ్యాపకులు మందలించడంతో మనస్తాపానికి గురై శనివారం మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ భవనం 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించే లోపే విద్యార్థి మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వివరాలు బయటికి రాకుండా ఇద్దరు అధ్యాపకులు ప్రయత్నించినట్టు సమాచారం. ఘటనా స్థలిని వెంటనే శుభ్రం చేయడంతో విద్యార్థులు అధ్యాపకుల తీరుపై మండిపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు.
* బెంగళూరులోని పీజీ హాస్టల్‌లో ఓ యువతిని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఘటన జరిగిన మూడు రోజులకు మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని నగరానికి తీసుకున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా బిహార్‌కు చెందిన 24 ఏళ్ల యువతి కృతి కుమారిని ఓ దుండగుగు అర్థరాత్రి హాస్ట్‌లోకి చొరబడి కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. బెంగళూరులోని రద్దీగా ఉండే కోరమంగళలోని పీజీ హాస్టల్‌లో మంగళవారం రాత్రి 11గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. అయితే బాధితురాలికి నిందితుడు ముందుగానే పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఓ ప్రైవేటు కంపెనీ పనిచేస్తున్న కృతికి.. హాస్ట్‌లో తన రూమ్‌మెట్‌కు ప్రియుడు అని వెల్లడైంది. తన రూమ్‌మెట్, ఆమె ప్రియుడు ప్రతిసారి ఉద్యోగం విషయంలో గొడవపడేవారిని, వీరి విషయంలో కుమారి జోక్యం చేసుకోవడంతో గొడవలు పెద్దగా అయినట్లు సమాచారం. అయితే ప్రియుడికి దూరంగా ఉండాలని కృతి తన రూమ్‌మెట్‌కు సలహా ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు.. ఆవేశంతో ఆమెను చంపడానికి హాస్ట్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది.
* మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు అత్యంత కిరాతంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పోదల్లో పడేశాడు. నవీ ముంబై సమీపంలోని ఉరాన్ రైల్వే స్టేషన్ చుట్టూ ఉన్న పొదల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో ఈ ఉదంతం శనివారం వెలుగుచూసింది. యువతి శరీరంపై అనేక గాయలు, కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాలిని యశశ్రీ షిండేగా గుర్తించారు. ఉరాన్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు..యశశ్రీ షిండే కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇటీవల వీరి ప్రేమ వ్యవహారంలో గొడవలు తలెత్తడంతో యువకుడు ఆమెను హత్య చేసినట్లు తేలింది. మృతదేహాన్ని ఉరాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో పడేసి అతడు పరారయ్యాడు. మరోవైపు యువతి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. యువతి హత్యకు గురైన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు నవీ ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ పన్సారే తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z