Food

మొటిమల నివారణకు చేపలు

మొటిమల నివారణకు చేపలు

చేపలకు సంబంధించి మరో ఆరోగ్య ప్రయోజనం బయటపడింది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉండే సాల్మన్, సార్‌డైన్స్‌ వంటి చేపలు మొటిమల నివారణకు, త్వరగా తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. స్వల్పంగా, ఒక మాదిరిగా మొటిమలు గలవారిని పరిశోధకులు విశ్లేషించగా వీరిలో 98% మందిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు తేలింది. వీరికి ఈ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే మధ్యధరా ప్రాంత ఆహారం, మాత్రలను ఇవ్వగా మంచి ఫలితం కనిపించటం విశేషం. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఒంట్లో వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్‌) తగ్గిస్తాయి, చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఇవి వాపు ప్రక్రియను ప్రేరేపించే రసాయనాలను నిరోధించటం ద్వారా మొటిమలు తగ్గేలా చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కానీ కొందరు నిపుణులు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతరులతో పోల్చకపోవటం వల్ల మొటిమలు తగ్గటమనేది ఆహారం, పాల పదార్థాలు తగ్గించటం, ఒమేగా 3 మాత్రలు, ఇతర పద్ధతుల్లో ఏవి ప్రభావం చూపిస్తున్నాయో తెలియటం లేదంటున్నారు. అయినా కూడా పండ్లు, కూరగాయలు, నిండు ధాన్యాల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే మాట నిజం. చర్మ ఆరోగ్యానికివి బాగా ఉపయోగపడతాయి. చేపలు, గింజ పప్పుల్లో వాపును నిలువరించే గుణం ఉండటం గమనార్హం. ఇవి దురద, మొటిమల వంటి చర్మ సమస్యలు తగ్గటానికి దోహదం చేస్తాయి. ఆలివ్‌ నూనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. రక్తంలో త్వరగా గ్లూకోజు కలవకుండా చూసే పదార్థాలు సైతం చర్మానికి మేలు చేస్తాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z