Business

ఆగష్టులో బ్యాంకు సెలవులు ఇవే-BusinessNews-July 29 2024

ఆగష్టులో బ్యాంకు సెలవులు ఇవే-BusinessNews-July 29 2024

* మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓ (Ola Electric IPO) ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఒక్కో షేరు ధరను రూ.72-76గా నిర్ణయించింది. ఈ ఐపీఓ (Ola Electric IPO) ఆగస్టు 2న ప్రారంభమై 6న ముగియనుంది. యాంకర్‌ మదుపర్లు ఆగస్టు 1న బిడ్లు దాఖలు చేయొచ్చు. ఇష్యూలో భాగంగా రూ.5,500 కోట్ల వరకు కొత్త షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 8.49 కోట్ల షేర్లను ప్రమోటర్లు, పెట్టుబడిదార్లు విక్రయించనున్నారు. ఐపీఓలో (IPO) అందుబాటులో ఉన్న షేర్లలో 75 శాతం అర్హత గల సంస్థాగత మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లను రిజర్వ్‌ చేశారు. మదుపర్లు గరిష్ఠ ధర వద్ద రూ.14,820తో కనీసం 195 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత గల కంపెనీ ఉద్యోగులు కూడా ఈ ఐపీఓలో (Ola Electric IPO) పాల్గొనవచ్చు. వారికి ఒక్కో షేరుపై రూ.7 రాయితీ లభిస్తుంది.

* నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసరాలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరింత భారం పడనుంది. పాదరక్షలకు సంబంధించి ఆగస్టు 1 నుంచి కొత్త నాణ్యతా ప్రమాణాలు (Quality Standard) అమల్లోకి రానున్నాయి. అప్పటి నుంచి తయారు చేసే షూస్‌, బూట్లు, స్లిప్పర్లు, సాండిల్స్‌ ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్‌ (BIS) స్పష్టం చేసింది. దీంతో వచ్చే నెల నుంచి పాదరక్షల ధరలు (Footwear Prices) పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (stock market) సోమవారం సరికొత్త రికార్డులను తాకి చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. బ్యాంకింగ్‌, ఎల్‌అండ్‌ టీ షేర్ల అండతో ఉదయం దూసుకెళ్లిన సూచీలు.. ఇంట్రాడేలో సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 81,908 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,999.75 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను తాకాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఫ్లాట్‌గా చివరికి ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,679 పాయింట్ల (క్రితం ముగింపు 81,332.72) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,135.91 – 81,908.43 మధ్య కదలాడింది. అంటే ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడింది. చివరికి 23.12 పాయింట్ల లాభంతో 81,355.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.25 పాయింట్స్‌ లాభపడి 24,836.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.74గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ షేర్లు లాభపడగా.. టైటాన్, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 81.26 డాలర్లు, బంగారం ఔన్సు 2391 డాలర్లు చొప్పున ట్రేడవుతున్నాయి.

* మధ్యతరగతి బడ్జెట్‌పై ప్రభావం చూపే కొన్ని ఆర్థిక పరమైన మార్పులు ఆగస్టు 1 (Changes from august 1st) నుంచి అమల్లోకి రానున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర, క్రెడిట్‌ కార్డు రూల్స్‌ వంటివి అందులో ఉన్నాయి. వీటితో పాటు వచ్చే నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు (Bank Holidays) రాబోతున్నాయో చూద్దాం..

ఎల్‌పీజీ ధర: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలను ప్రతినెలా ఒకటో తేదీన సవరిస్తూ ఉటారు. గత నెల 19 కేజీల కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించారు. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉండడంతో మరోసారి తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

క్రెడిట్‌ కార్డ్ రూల్స్: ప్రైవేటురంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై క్రెడ్‌, చెక్‌, మోబిక్విక్‌, ఫ్రీఛార్జ్‌ వంటి వేదికల ద్వారా అద్దె చెల్లిస్తే 1 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.15వేలు పైబడి చేసే ఫ్యూయల్‌ చెల్లింపులకూ 1 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్‌ కార్డు హోల్డర్లు ఇకపై టాటా న్యూ యూపీఐ ఐడీతో చేసే లావాదేవీలపై 1.5 శాతం కాయిన్లను అందుకుంటారు.

గూగుల్‌ మ్యాప్స్‌: గూగుల్‌ సంస్థ మ్యాప్స్‌ ఫీజు 70 శాతం మేర తగ్గించింది. ఈ తగ్గింపు డెవలపర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణ పౌరులకు ఈ తగ్గింపు వల్ల ప్రయోజనమేమీ ఉండదు. డాలర్‌ స్థానంలో రూపాయిలతో చెల్లించే విధానాన్నీ ఆగస్టు 1 నుంచి అమలు చేయబోతోంది. దేశీయంగా ఓలా సంస్థ మ్యాప్స్‌ను ఆవిష్కరించిన వేళ ఈ తగ్గింపు చేపట్టడం గమనార్హం.

బ్యాంకు సెలవులు: దేశవ్యాప్తంగా బ్యాంకులకు ఆగస్టులో 13 రోజులు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో వచ్చే సెలవులతో కలుపుకొంటే 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానునున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, కృష్ణాష్ణమి సందర్భంగా ఆగస్టు 26న బ్యాంకులు తెరుచుకోవు. రెండు, నాలుగో శని వారాలు, ఆదివారం బ్యాంకులకు ఎలానూ సెలవే. దాని బట్టి మీ బ్యాంకు పనులను ప్లాన్‌ చేసుకోండి.

* రుణ చెల్లింపుల్లో ఉపశమనాలు కల్పించిన నేపథ్యంలో భారత్‌కు మాల్దీవుల (India – Maldives) అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) ధన్యవాదాలు తెలిపారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాల బలోపేతంతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరాలని ఆకాంక్షించారు. మాల్దీవుల (Maldives) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ శుక్రవారం ఆయన భారత్‌ సహా చైనాకు కృతజ్ఞతలు తెలిపినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. దేశ రుణ చెల్లింపులను సులభతరం చేస్తూ మాల్దీవుల ఆర్థిక సార్వభౌమత్వానికి ఇరుదేశాలు సహకరిస్తున్నాయని వెల్లడించారు. అమెరికా డాలర్ల కొరత నేపథ్యంలో ఈ దేశాలతో ‘కరెన్సీ స్వాప్‌’ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు అండగా నిలుస్తున్నాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 366 పాయింట్లు లాభపడి 81,699 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 24,941 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.70 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటన్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z