* కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని విపక్ష ‘ఇండియా కూటమి’పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. ‘సాధారణ ఓబీసీ చాయ్‌వాలా మంచిగా దేశాన్ని నడిపించడం’ ఇండియా కూటమికి సమస్యగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్‌పై లోక్‌సభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆమెపై వ్యాఖ్యలు చేశారు. 2004-05 నుంచి కేంద్ర బడ్జెట్లలో రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అంత మాత్రానా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు సమకూర్చలేదని అర్థమా? అని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారన్న విపక్ష సభ్యుల విమర్శలను నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. ‘2004-05 బడ్జెట్ ప్రసంగంలో 17 రాష్ట్రాలు, 2005-06లో 18, 2006-07లో 16, 2009-10లో 26 రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదు. అంత మాత్రాన ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయించనట్లా? విపక్షాల ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉంది’ అని వ్యాఖ్యానించారు.
* దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను (LTCG) పన్ను వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు రూ.98,681 కోట్ల ఆదాయం లభించింది. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభలో ఈ సంగతి ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకూ ఎల్టీసీజీ టాక్స్ ద్వారా వచ్చిన ఆదాయం వివరాలను సభ్యులకు వెల్లడించారు. ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను విధానాన్ని 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. రూ.లక్ష వరకూ ఆదాయంపై పన్ను రాయితీ, మిగతా పెట్టుబడులపై 10 శాతం ఎల్టీసీజీ పన్ను విధిస్తారు. 2021-22లో రూ.86,075.49 కోట్ల ఎల్టీసీజీ పన్ను వసూలైందని పంకజ్ చౌదరి చెప్పారు. 2022-23లో 15 శాతం పుంజుకుని రూ.98,681.34 కోట్ల ఎల్టీసీజీ పన్ను వసూలైందన్నారు. 2018-19లో రూ.29,220 కోట్లు, 2019-20లో రూ.26,008 కోట్లు, 2020-21లో రూ.38,589 కోట్ల ఎల్టీసీజీ పన్ను వసూలైందని పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈక్విటీలు లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులపై ఎల్టీసీజీ పన్ను విధానాన్ని ఎప్పటి నుంచి రద్దు చేస్తారన్న సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన పంకజ్ చౌదరి.. అటువంటి ప్రతిపాదనేదీ లేదని చెప్పారు. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులపై ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 10 నుంచి 12.5 శాతం వరకూ ఈక్విటీలు, ఈక్విటీల ఆధారిత ఎల్టీసీజీ పన్ను పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలిపారు. అలాగే రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకూ ఎల్టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి పెంచినట్లు తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల (ఎల్టీసీజీ) కిందకు 12 నెలలకు పైగా గడువుతో మదుపు చేసిన పెట్టుబడులను దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలు (ఎల్టీసీజీ) అంటారు.
* భారత బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సూచీలు మంగళవారం పొద్దంతా అస్థిరతకు గురయ్యాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,349.28 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కోలుకొని.. కొద్దిసేపటికే మళ్లీ పతనమయ్యాయి. ఇలా పొద్దంతా పడుతూ లేస్తూ వచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒక దశలో 81,230.44 పాయింట్ల కనిష్ఠానికి చేరుగా.. గరిష్ఠంగా 81,815.27 పాయింట్లకు పెరిగింది. చివరకు 99.55 పాయింట్ల లాభంతో 81,455.40 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 21.22 పాయింట్ల వద్ద 24,857.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,074 షేర్లు పెరగ్గా.. 1,378 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. సిప్లా, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు పవర్, రియాల్టీ, ఆటో 0.5-1 శాతం వృద్ధితో లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
* ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గ్లోబల్ గోల్డ్ డిమాండ్ 4.16శాతం పెరిగి 1,258.2 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) వెల్లడించింది. గోల్డ్ కౌన్సిల్ సెకండ్ క్వార్టర్-2024 2024 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం.. 2023 రెండవ త్రైమాసికంలో మొత్తం డిమాండ్ 1,207.9 టన్నులుగా నమోదైంది. 2020లో డిమాండ్ 1,258.2 టన్నులకు పెరిగింది. సమీక్షలో ఉన్న త్రైమాసికంలో బంగారం ధరలు సంవత్సరానికి 18శాతం పెరిగాయి. సగటున ఔన్స్ 2,338 డాలర్లు ఉండగా.. ఈ త్రైమాసికంలో ఔన్సు రికార్డు స్థాయిలో 2,427 డాలర్లకు చేరిందని నివేదిక పేర్కొంది. ఓటీసీ డిమాండ్ పెరగడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లను కొనసాగించడం, ఈటీఎఫ్ అవుట్‌ఫ్లో తగ్గడం తదితర కారణాలతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) సమీక్షా త్రైమాసికంలో స్వల్పంగా ఏడు టన్నుల ఉపసంహరణలు నమోదయ్యాయి. సెంట్రల్ బ్యాంకులు, ఓటీసీ మార్కెట్ నుంచి బలమైన డిమాండ్ కారణంగా బంగారం ధరలు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ లూయిస్ స్ట్రీట్ తెలిపారు. భవిష్యత్తులో బంగారానికి పలు సవాళ్లు ఉన్నాయని.. కానీ ప్రపంచ మార్కెట్లో కూడా మార్పులు జరుగుతున్నాయన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z