* శాసనసభ సమావేశాల్లో మంత్రి సీతక్క భారాసపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారాస నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు పత్రాన్ని కాంగ్రెస్‌లో గెలిచి భారాసలోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డితో ఇప్పించారని ఎద్దేవా చేశారు. భారాస వాళ్లు రాజీనామా చేయించి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారా అని ప్రశ్నించారు. ఈక్రమంలో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు తనను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని.. ఓ అక్కగా కాంగ్రెస్‌లోకి సంతోషంగా ఆహ్వానించినట్లు గుర్తుచేశారు. ‘‘రేవంత్‌రెడ్డికి నాపై ఎందుకు కక్ష?. ఆరోజు పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆశాకిరణం అవుతావని చెప్పాను. సీఎం అవుతావని కూడా చెప్పాను. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను’’ అని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సబితక్క నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవం. వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ సభలో చెప్పారు. సబిత సభలో ప్రస్తావించారు కాబట్టే.. అప్పుడు జరిగిన పరిణామాలు సభలో చెప్పాలి. 2019లో మల్కాజిగిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారు. కాంగ్రెస్ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆమె భారాసలో చేరారు. అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి భారాసలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. తమ్ముడిగా నన్ను మోసం చేశారు కాబట్టే ఆమెను నమ్మవద్దని కేటీఆర్‌కు చెప్పా. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నాదే అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. నేను చెప్పింది నిజమో.. కాదో.. సబితక్క గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి’’ అని రేవంత్ చెప్పారు.
* ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగువారి హృదయాలు గెలుచుకున్నారు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఆమె ప్రస్తుతం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తదుపరి చిత్రం ‘పూజా మేరీ జాన్’ (Pooja Meri Jaan) విశేషాలు పంచుకున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ రోల్ తనకెంతో నచ్చిందని, అలాంటి పాత్రనే ఎంతోకాలంగా పోషించాలనుకుంటున్నానని చెప్పారు.
* రాజ్ తరుణ్ (Raj Tharun), మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra), మన్నారా చోప్రా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’ (Thiragabadara Saami). ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తెరకెక్కించారు. మల్కాపురం శివకుమార్ నిర్మించారు. విభిన్న కథతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈ కథ విన్న వెంటనే చేస్తానని చెప్పా. దర్శకుడు కష్టపడి వర్క్ చేశారు. సినిమా బాగా వచ్చింది. మా నిర్మాత ప్రాణం పెట్టి తెరకెక్కించారు. మాల్వీ మల్హోత్ర గొప్ప నటి. తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం. ఈ వివాదాలు పక్కనపెట్టేసి ఆమెను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా. ఆమె ఎంతో చక్కగా వర్క్ చేసింది’’ అని రాజ్ తరుణ్ తెలిపారు.
* భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ పారిస్ ఒలింపిక్స్‌లో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. 75 కేజీల విభాగం రౌండ్ 16 మ్యాచ్‌లో తిరుగులేని విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. 5-0 తేడాతో సునీవా (నార్వే)పై అలవోకగా విజయం సాధించింది. ఆమె ఆగస్టు 4న మధ్యాహ్నం 3:02 గంటలకు క్వార్టర్స్‌లో లి కియాన్ (చైనా)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో లవ్లీనా నెగ్గితే భారత్‌కు మరో పతకం ఖాయమవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. అయితే, క్వార్టర్స్‌లో లి కియాన్ నుంచి లవ్లీనాకు కఠిన సవాలు ఎదురవనుంది. లి కియాన్ టోక్యో ఒలింపిక్స్‌లో రజతం, 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం పతకం సాధించింది.
* కొందరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయలేదా? అని ప్రశ్నించారు. ‘‘గతంలో కొన్ని సంప్రదాయాలు నెలకొల్పారు. నన్ను ఏ రోజూ అసెంబ్లీలో కూర్చోనివ్వలేదు. నా దగ్గరకు 10మంది భారాస ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ శాసనసభ గురువారానికి వాయిదా పడిన తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు.
* ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron) వివాదంలో ఇరుక్కున్నారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల సందర్భంగా ఓ మహిళా మంత్రి ఆయనకు ముద్దు పెట్టడమే ఇందుక్కారణం. ఆ ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో మేక్రాన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒలింపిక్స్ (Paris Olympics 2024) వేడుకలకు ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. గతవారం పారిస్‌లోని సెన్ నదిపై ఈ విశ్వ క్రీడా సంబరం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆ ఆరంభ వేడుకల్లో అధ్యక్షుడు మేక్రాన్ (Emmanuel Macron)తో పాటు ఇతర దేశాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఫ్రాన్స్ క్రీడల మంత్రి ఎమిలీ కాస్టెరా అధ్యక్షుడిని కౌగలించుకొని ఆయన చెంపపై గాఢంగా ముద్దు పెట్టారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియల్ అట్టాల్ కాస్త ఇబ్బందిపడుతూ పక్కకు చూస్తున్నట్లుగా కన్పించింది. ఈ దృశ్యాన్ని ఫ్రెంచ్ మ్యాగజైన్ మాడమ్ ఫిగారో క్లిక్ మనిపించింది.
* గాజాలోని మిలిటెంట్ సంస్థ హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ పొలిటికల్ హెడ్ ఇస్మాయిల్ హనియా (Ismail Haniyeh) నేడు ఓ క్షిపణి దాడిలో మరణించాడు. ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికితోడు ఈ ఘటన తమ భూభాగంలో జరగడంతో ప్రతీకారం తప్పదని ఇరాన్ చెబుతోంది. హనియా టెహ్రాన్‌లోని ఇంటి వద్ద ఉండగా క్షిపణితో దాడి జరిగినట్లు ఇజ్రాయెల్ పత్రికలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడి బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటుచేసుకొన్నట్లు పేర్కొన్నాయి.
* తన భర్త తనకు కావాలని, కొందరు వ్యక్తులు అతడిని కలవనీయకుండా అడ్డుకుంటున్నారని సినీ నటుడు రాజ్ తరుణ్ (Raj Tarun) మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించారు. బుధవారం ‘తిరగబడరసామీ’ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్ర సహా చిత్ర బృందం ఈ ఈవెంట్లో పాల్గొంది. మరోవైపు ఈవెంట్ బయట లావణ్య విలేకరులతో మాట్లాడింది. ‘‘రాజ్‌తరుణ్‌ను సపోర్ట్ చేసే వాళ్లందరూ కలవనీయకుండా చేస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుని వెళ్లిపోతున్నాడో సమాధానం చెప్పాలి. మేమిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నాం. గుడిలో నా మెడలో తాళికట్టాడు. అప్పుడు మేమిద్దరం కలిసి సెల్ఫీ తీసుకున్న ఫొటోలు ఉన్నాయి. వాటిని కోర్టులో సమర్పించాం. అప్పుడే పిల్లలు వద్దని రెండుసార్లు అబార్షన్ చేయించాడు. పదేళ్లు కలిసి జీవించిన తర్వాత చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. నా దగ్గరకు వచ్చి ‘మనం విడిపోదాం’ అని కనీసం చెప్పలేదు. నన్ను మోసం చేసి, పోలీస్ కేసులో ఇరికించి పారిపోయాడు. ఈ రోజు తప్పించుకోవచ్చు. రేపు తప్పకుండా దొరుకుతాడు. ఎప్పటికైనా నాకు సమాధానం చెప్పి తీరాలి’’
* గత వైకాపా పాలనలో సహకార సంఘాల్లో అక్రమాలు చేసి మెక్కినదంతా కక్కిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అవినీతి సొమ్మును రికవరీ చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సహకార వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. ఒక్కరోజులో రైతుకు రుణం వచ్చేలా సహకార సంఘాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. సహకార సంఘాల ద్వారా రూ.38.7వేల కోట్ల మంజూరుకు ప్రణాళిక వేస్తున్నామని.. సహకార సంఘాలను పూర్తిగా ఆన్లైన్ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి జిల్లాలో ఆప్కాబ్, డీసీసీబీ బ్రాంచ్‌ల ద్వారా రైతులకు సేవలందిస్తామని మంత్రి తెలిపారు.
* ఇటీవల దిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం కారణంగా బేస్మెంట్లో వరదనీరు రావడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రావూస్ అకాడమీ తొలిసారి స్పందించింది. మృతులకు నివాళులర్పిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘వారి కలలు, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా విద్యార్థులను కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి కొనసాగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తాం’ అని పేర్కొంది.
* మైనింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై సమీక్షించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం వృద్ధి సాధిస్తే.. 2019-24 మధ్య 7 శాతం మాత్రమే ఉందని అధికారులు నిర్ధారించారు. ఐదేళ్లలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సమీక్షలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ.1,025 కోట్లు చెల్లించలేదని అధికారులు తేల్చారు.
* సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో ఉన్న స్కిల్ కేసుకు సంబంధించి సంజయ్, పొన్నవోలు మీడియా సమావేశం పెట్టడంపై ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ యునైటెడ్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మీడియా సమావేశం పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిల్‌ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, పొన్నవోలుకు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబరు 9కి వాయిదా పడింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z