Business

భారీ లాభాల్లో మారుతీ-BusinessNews-July 31 2024

భారీ లాభాల్లో మారుతీ-BusinessNews-July 31 2024

* ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ (Swiggy) తాజా నివేదికలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చాలామంది మాంసాహారాన్ని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ, పలు నగరాల్లో శాకాహారాన్ని అత్యధికంగా ఆర్డర్‌ చేసుకుంటున్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. వీటిలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. ముంబయి, హైదరాబాద్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశ సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరును ‘వెజ్జీ వ్యాలీ’గా స్విగ్గీ పేర్కొంది. తమకు దేశవ్యాప్తంగా వచ్చిన శాకాహార ఆర్డర్లలో మూడింట్లో ఒకటి ఈ నగరం నుంచి వచ్చినట్లు తెలిపింది. మసాలా దోస, పన్నీర్‌ బిర్యానీ, పన్నీర్‌ బటర్‌ మసాలాను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. ఇక ముంబయి రెండో స్థానంలో నిలిచింది. దాల్‌ కిచిడీ, మార్గరీటా పిజ్జా, పావ్‌ భాజీని ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారు. మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ వాసులు మసాలా దోస, ఇడ్లీని ఆస్వాదిస్తున్నారట.

* ఆకర్షణీయమైన డిజైన్‌, ఫీచర్లతో నథింగ్‌ (Nothing) సరికొత్త మొబైల్‌ను భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది. నథింగ్‌ ఫోన్‌ 2ఏకు వచ్చిన ఆదరణతో నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్లస్‌ (Nothing Phone 2a Plus) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. రెండు వేరియంట్లలో లాంచ్‌ చేసిన ఈ మొబైల్‌ను 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో ప్రవేశపెట్టింది. నథింగ్‌ కొత్త ఫోన్‌ 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.27,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా పేర్కొంది. బ్లాక్‌, గ్రే రంగుల్లో ఈ మొబైళ్లు లభిస్తాయి. ఆగస్టు7 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌ 2.6తో పనిచేస్తుంది. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌ రేటు కలిగిఉంటుంది. ఇందులో ఆక్టాకోర్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7350 ప్రో 5జీ ప్రాసెసర్‌ను అమర్చారు.

* దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) త్రైమాసిక ఫలితాల్లో దూసుకెళ్లింది. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.3,650 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.2,485 కోట్లతో పోలిస్తే లాభం 47 శాతం వృద్ధి చెందింది. వ్యయ నియంత్రణ చర్యలు, విక్రయాల్లో వృద్ధి నమోదుకావడంతో కంపెనీ లాభాలు పెరగడానికి దోహదపడింది.

* మహారాష్ట్రలో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడితో సరికొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ బుధవారం వెల్లడించింది. ఛత్రపతి శంభాజీ నగర్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టయోటా ఒక ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలో ప్రధాన కార్యాలయంతో పాటు ఇప్పటికే బెంగళూరు సమీపంలోని బిదాడిలో రెండు తయారీ యూనిట్లను కలిగి ఉంది. కర్ణాటకలో ఉన్న ఈ ఆటోమేకర్‌ దాని గ్రూప్‌ కంపెనీలతో సహా రూ.16 వేల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది. టయోటాకు సంబంధించిన ఎగుమతులు విలువ పరంగా సుమారు రూ.32 వేల కోట్లుగా ఉన్నాయి. టయోటా ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లలో 3.42 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

* ప్రముఖ టెక్‌ కంపెనీ ఇంటెల్‌ (Intel) తన ఉద్యోగులను తొలగించే (Layoffs) యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా ఈ వారంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మార్కెట్‌ వాటాను పెంచుకొనే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్‌’ తన కథనంలో పేర్కొంది. ఇంటెల్‌ సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి, సెమీకండక్టర్‌ పరిశ్రమలో కంపెనీని అగ్రగామిగా నిలిపేందుకు చేయాల్సిన పరిశోధన, అభివృద్ధిపై భారీగా ఖర్చు చేయాలని కంపెనీ సీఈఓ పాట్‌ గెల్సింగర్‌ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టిసారించినట్లు స్పష్టమవుతోంది. ఇందులోభాగంగా ఉద్యోగుల తొలగింపు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంటెల్‌ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి షేర్ల అండతో సరికొత్త గరిష్ఠాల వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలూ కలిసొచ్చాయి. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ వడ్డీ రేట్లను పెంచగా.. అమెరికా ఫెడ్‌ నిర్ణయాలు ఈ రాత్రికి వెలువడనున్నాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,655.90 పాయింట్ల వద్ద లాభాల్లో (క్రితం ముగింపు 81,455.40) ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,828.04 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 285.94 పాయింట్ల లాభంతో 81,741.34 వద్ద ముగిసింది. నిఫ్టీ 93.85 పాయింట్ల లాభంతో 24,951.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.76గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. రిలయన్స్, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 80.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర మళ్లీ పుంజుకుని ఔన్సు 2466 డాలర్ల స్థాయికి చేరింది.

* ఆన్‌లైన్‌ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫస్ట్‌క్రై మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ (FirstCry IPO) ఐపీఓకు రానుంది. ఆగస్టు 6న ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 8తో బిడ్డింగ్‌ ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఆగస్టు 5న సబ్‌స్క్రప్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా బ్రెయిన్‌బీస్‌ సొల్యూషన్స్‌ రూ.1666 కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లను ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా జారీ చేయనుంది. 5.44 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు వదలుకోనున్నారు. ధరల శ్రేణి వివరాలు గురువారం వెల్లడి కానున్నాయి. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన ఎవీఎఫ్‌ ఫ్రాగ్‌ 2.03 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఆటో మొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా 28.06 లక్షల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం బ్రెయిన్‌బీస్‌ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు 25.55 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రాకు 10.98 శాతం వాటా ఉంది. సాఫ్ట్‌బ్యాంక్‌, మహీంద్రాతో పాటు పీఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌, టీపీజీ, న్యూక్వెస్ట్‌ ఆసియా ఇన్వెస్ట్‌మెంట్స్‌, యాప్రికాట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, స్క్రోడర్స్‌ క్యాపిటల్‌ సంస్థలు ఓఎఫ్‌ఎస్‌ ద్వారా షేర్లను విక్రయించనున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z