* ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తమ యూజర్లకు ‘జీవితకాల ఉచిత స్క్రీన్ అప్‌గ్రేడ్’ ఆఫర్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8టీ, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ఆర్ వినియోగిస్తున్నవారికి ఇది వర్తిస్తుంది. వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఉచితంగా స్క్రీన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే క్లీనింగ్, మెయింటెనెన్స్ వంటి సేవలు కూడా పొందొచ్చు. అప్‌డేట్ చేసిన తర్వాత కొన్ని వన్‌ప్లస్ ఫోన్లలో గ్రీన్ లైన్, బ్లూ లైన్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించడానికి గత ఏడాది నుంచి వన్‌ప్లస్ 10ఆర్ మొబైళ్లపై కంపెనీ వోచర్‌ను అందిస్తోంది. ఇప్పుడు కంపెనీ లైఫ్‌టైమ్ ఫ్రీ స్క్రీన్ అప్‌గ్రేడ్ ఆప్షన్‌ను ఇస్తోంది. ఇది చాలా మంది యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది.
* ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) త్రైమాసిక ఫలితాల్లో దూసుకెళ్లింది. జూన్‌లో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.5,566 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.3,203 కోట్లతో పోలిస్తే 74శాతం వృద్ధి చెందింది. కంపెనీ ఆదాయం సైతం పెరిగిందని టాటా మోటార్స్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,03,597 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈ ఏడాదిలో రూ.1,09,623 కోట్లకు చేరినట్లు తెలిపింది. స్టాండలోన్ పద్ధతిలో రూ.2,190 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో రూ.64 కోట్ల నికర నష్టం నమోదు కావడం గమనార్హం. కంపెనీ మొత్తం ఆదాయం రూ.16,132 కోట్ల నుంచి రూ.18,851 కోట్లకు చేరినట్లు తెలిపింది. కంపెనీ మొత్తం 71,996 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయించిన 80,633 వాహనాలతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు విలువ బీఎస్‌ఈలో 1.02శాతం పెరిగి రూ.1,144.60 వద్ద స్థిరపడింది.
* ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.253 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 74 శాతం పెరిగి రూ.4,206 కోట్లకు చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎబిటా రూ.299 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.194 కోట్లుగా ఉంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలూ రాణించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 82,129 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25,078 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. గరిష్ఠాల వద్ద అమ్మకాలతో సెన్సెక్స్ 82వేల దిగువకు చేరగా.. నిఫ్టీ మాత్రం తొలిసారి 25 వేల ఎగువన ముగియడం గమనార్హం. సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గింపు ఉంటుందని అమెరికా ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో జోష్‌కు కారణమయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 81,949.68 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,741.34) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలోనే సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ 82వేల మార్కును దాటింది. ఇంట్రాడేలో 81,700.21- 82,129.49 మధ్య కదలాడిన సూచీ చివరికి 126 పాయింట్ల లాభపడి 81,867 వద్ద ముగిసింది. నిఫ్టీ 59.75 పాయింట్లు లాభపడి 25010 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.89గా ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z