* విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఓ యువతిపై హోంగార్డు అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బొండపల్లి పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తించే హోంగార్డు మొయిద సురేశ్ మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. దారిలో కొండకరకం సమీపంలో ఓ ప్రేమజంట కనిపించడంతో వారి వద్దకు వెళ్లి తాను ఎస్సైని అని, ఇక్కడ ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దీంతో ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సురేశ్ ఆ యువతిని సొంతూరెళ్లేందుకు బస్సెక్కిస్తానని నమ్మించి తన బైకుపై రామతీర్థం సమీపంలోని చంపావతి నది ఒడ్డునున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తిరిగి ఆమెను రామతీర్థం కూడలి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేశ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
* సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖ స్టేట్ ట్యాక్స్ అధికారి (డీసీటీవో) శ్రీధర్‌రెడ్డి అనిశా అధికారుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. అనిశా రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను మూడేళ్లకుగాను అసెస్‌మెంట్ (మదింపు) చేయించేందుకు అబిడ్స్‌లోని పంజాగుట్ట సర్కిల్-1కు చెందిన డీసీటీవో శ్రీధర్‌రెడ్డిని సంప్రదించి దరఖాస్తు చేసుకున్నారు. అసెస్‌మెంట్ చేయాలంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రూ.2 లక్షలిస్తానని శ్రీకాంత్ ఒప్పందం కుదుర్చుకుని, అనిశా అధికారులను సంప్రదించి అతడి వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అబిడ్స్‌లోని వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం శ్రీధర్‌రెడ్డి లంచం తీసుకుంటుండగా.. అనిశా అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. నిందితుడిని నాంపల్లిలోని ఒకటో అదనపు స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
* నిండు గర్భిణిని లారీ ఢీకొట్టడంతో గర్భస్థ శిశువు తల్లిపేగు తెంచుకొని కొంత దూరానపడి పోయింది. ఆ మహిళ కూడా దుర్మరణం చెందారు. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్‌లోని జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన పనేటీ రేణ(29) ఏడు నెలల గర్భిణి. బుధవారం ఓ వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై తూప్రాన్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్నారు. మనోహరాబాద్ వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ఆమెపై నుంచి వెళ్లడంతో గర్భస్థ శిశువు పది మీటర్ల దూరంలో పడింది. మహిళ అక్కడికక్కడే మరణించారు. జాతీయ రహదారిపై మృత గర్భస్థ శిశువును చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. మల్లుపల్లికి చెందిన పోచయ్య, రేణ దంపతులకు 9, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
* ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్ నగరంలో జరిగిన ట్రిపుల్ మర్డర్.. తీవ్ర హింసకు దారి తీసింది. ముగ్గురు బాలికలను ఓ టీనేర్ కత్తితో పొడిచి చంపిన ఘటన తర్వాత సౌత్‌పోర్ట్‌లో భీకర స్థాయిలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. సెంట్రల్ లండన్‌లో ఆందోళన చేస్తున్న సుమారు వంద మందికిపై అరెస్టు చేశారు. డౌనింగ్ స్ట్రీట్‌కు సమీపంలో ఉన్న వైట్‌హాల్ వద్ద నిరసనకారులు ఆందోళన చేపట్టారు. హార్ట్‌లీ పూల్ వద్ద కూడా ఆందోళన చేస్తున్న కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. అనేక మంది ఆఫీసర్లు గాయపడ్డారు. పోలీసు కారుకు నిప్పుపెట్టారు. ఈ కేసులో విచారణ చేపట్టేందుకు ప్రధాని సర్ కీర్ స్టార్మర్ పూర్తి మద్దతు ఇస్తున్నారు. కత్తితో దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడిని 17 ఏళ్ల అక్సెల్ ముగన్వా రుడాకుబనాగా గుర్తించారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బ్లేడ్ లాంటి ఆయుధం కలిగి ఉన్నట్లు కూడా అతనిపై కేసు బుక్ చేశారు. ఇవాళ లివర్‌పూల్ కోర్టులో ఆ టీనేజర్‌ను హాజరుపరిచారు. ప్రస్తుతం అతను కస్టడీలో ఉన్నాడు. అనుమానిత హంతకుడి పేరును ప్రకటించేందుకు బ్రిటీష్ పోలీసులు తీవ్ర కసరత్తు చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z