Business

రైల్వేలో చిన్నారులకు ప్రత్యేక బెర్తులు-BusinessNews-Aug 02 2024

రైల్వేలో చిన్నారులకు ప్రత్యేక బెర్తులు-BusinessNews-Aug 02 2024

* ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ ఎండీగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీలో మెట్రోరైల్‌ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మెట్రో రైల్‌కు కొత్త ఎండీని ప్రభుత్వం నియమించింది.

* నూతన మద్యం విధానం రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్‌ పాలసీ, మద్యం షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్‌ పేమెంట్‌ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. ట్రాక్ అండ్ ట్రేస్, డీఅడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాల పైనా దృష్టి సారించనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి. ఈ నెల 12 లోగా నివేదికలు సమర్పించాలని నాలుగు అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబరు 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.

* ప్రముఖ నిర్మాణసంస్థ లైకా పెట్టిన కేసు విచారణలో విశాల్‌ (Vishal) తీరుపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాదనను వినిపించేందుకు గురువారం న్యాయస్థానానికి వెళ్లిన ఆయన్ని ప్రశ్నించింది. ఇందులోభాగంగా లైకాతో జరిగిన ఒప్పందం గురించి న్యాయమూర్తి ప్రశ్నించగా.. అది తన దృష్టికి రాలేదని.. తాను కేవలం ఒక ఖాళీ కాగితంపై సంతకం చేశానని బదులిచ్చారు. దీనిపై జడ్జ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఖాళీ పేపర్‌పై మీరెలా సంతకం చేశారు? తెలివిగా సమాధానం చెబుతున్నాననుకుంటున్నారా? ఇదేమీ సినిమా షూటింగ్‌ కాదు.. కాస్త జాగ్రత్తగా బదులివ్వండి’’ అని ఆదేశించారు. ‘‘పందెంకోడి 2’ విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చారా?’’ అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు ఆయన ఆసక్తి చూపించలేదు. ‘‘ఇలా ప్రవర్తిస్తే కుదరదు. అవును, లేదా కాదు అని సమాధానం చెప్పండి’’ అని మరోసారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన తాను లైకా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నట్లు అంగీకరించారు. ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. విశాల్‌, కోలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions)కు మధ్య కొన్నాళ్లకిత్రం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. సినిమా తీస్తాన‌ని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నార‌ని, ఆ డ‌బ్బు తిరిగి చెల్లించ‌లేద‌ంటూ 2022లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. తొలిసారి జరిగిన వాదనల అనంతరం లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్‌ రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని, తన ఆస్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అప్పటివరకూ ఆయన నటించి, నిర్మించిన సినిమాలేవీ థియేటర్లలో గానీ, ఓటీటీల్లో గానీ విడుదల చేయకూడదంటూ స్టే విధించింది. అయితే, కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించార‌ని, త‌మ‌కు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించ‌కుండానే ఆయ‌న న‌టించి, నిర్మించిన ప‌లు సినిమాల‌ని విడుద‌ల చేశార‌ని విశాల్‌పై లైకా సంస్థ జూన్‌ నెలలో కోర్టు ధిక్క‌ర‌ణ కేసు ఫైల్ చేసింది. కానీ, అప్పుడు సంబంధిత ఆధారాలను ఆ సంస్థ కోర్టుకు చూపించలేకపోయింది. దాంతో, న్యాయస్థానం విచారణను గతంలో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది.

* ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు పిల్లల కోసం బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. ట్రైన్‌ కోచ్‌లలో బేబీబెర్త్‌లను అమర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా..? అని భాజపా ఎంపీ సమర్ సింగ్ సోలంకీ ప్రశ్నించారు. దానికి మంత్రి స్పందిస్తూ.. ‘‘లఖ్‌నవూ మెయిల్‌లో రెండు బేబీ బెర్త్‌లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చాం. లఖ్‌నవూ మెయిల్‌లోని ఒక కోచ్‌లో రెండు దిగువ బెర్త్‌లకు వాటిని అమర్చాం. దీనిపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో ప్రశంసలు అందాయి. అయితే సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గడం వంటి సమస్యలు మా దృష్టి వచ్చాయి. ప్యాసింజర్ కోచ్‌లలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. అది నిరంతర ప్రక్రియ’’ అని మంత్రి వెల్లడించారు.

* ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) తన నెట్‌వర్క్‌ సేవల్ని విస్తరిస్తోంది. ఇప్పటికే 4జీ నెట్‌వర్క్‌ సేవల్ని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన టెలికాం సంస్థ.. తాజాగా తన 5జీ సేవల ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ నెట్‌వర్క్‌ సేవల్ని పరీక్షించారు కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia). దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z