* స్వేచ్ఛగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించే మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోంది. ఫిన్‌టెక్ సంస్థలు విస్తరించడం, డిజిటల్ సాంకేతికత పెరగడం, సులువుగా పెట్టుబడులను నిర్వహించే వీలుండటం వీరికి కలిసివస్తోందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నివేదిక వెల్లడించింది. మార్చి 31, 2019 నుంచి డిసెంబరు 31, 2023 మధ్య తనకున్న కోటి మందికి పైగా ఉన్న మదుపరుల పెట్టుబడి తీరును విశ్లేషించి ‘మహిళల్లో పెట్టుబడి ధోరణుల నివేదిక 2024’ను రూపొందించింది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్న వారిలో 30% మంది మహిళలున్నారని యాక్సిస్ ఏఎంసీ ఎండీ, సీఈఓ బి.గోప్ కుమార్ నివేదిక విడుదల సందర్భంగా తెలిపారు. మొత్తం ఏయూఎంలో వారి వాటా 35 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 4.7 రెట్లు, తెలంగాణలో 3.1 రెట్ల మేరకు మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరిగింది. వీరి పెట్టుబడి మొత్తం(ఏయూఎం) ఏపీలో 4.1 రెట్లు, తెలంగాణలో 3 రెట్ల మేరకు పెరిగింది. పురుషులతో పోలిస్తే మహిళలు 25% అధికంగా మదుపు చేస్తున్నారు. సగటున 37% అధిక నిధి వారి దగ్గర ఉంటోంది. అయిదేళ్ల వ్యవధికి మించి పెట్టుబడులు కొనసాగిస్తున్న మహిళలు 22% వరకూ ఉంటున్నారు.
* ఛార్జింగ్ అయిపోతే, ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్లి వాహనం నిలిపి అరగంట, గంట సేపు కూర్చోవడం పెద్ద తలనొప్పి అవుతోంది. కొరియా పారిశ్రామిక దిగ్గజమైన శాంసంగ్ దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. ఒకసారి ఛార్జి చేస్తే ఏకంగా 600 మైళ్ల (సుమారు 965 కిలోమీటర్ల)కు పైగా ప్రయాణించే విద్యుత్తు వాహన(ఈవీ) బ్యాటరీని ఆవిష్కరించింది. భిన్న రూపాల్లో, అన్ని పరిమాణాల్లో లభించే ఈ బ్యాటరీని కారు/ఎస్‌యూవీ, ట్రక్కు, బస్సు.. ఇలా ఏ వాహనంలో అయినా ఉపయోగించొచ్చు. శాంసంగ్‌లోని బ్యాటరీ విభాగమైన శాంసంగ్ ఎస్‌డీఐ దీన్ని రూపొందించింది.
* గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రికార్డు స్థాయిలో 269 కేసులకు సంబంధించి దివాలా పరిష్కార ప్రణాళికలకు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది. 2022-23లో అనుమతినిచ్చిన 189 కేసులతో పోలిస్తే ఈ సంఖ్య 42% ఎక్కువ అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. 269 కేసుల్లోనూ 88% వరకు అంతకుముందు సంవత్సరాల్లో అనుమతి లభించి, పరిష్కార ప్రక్రియ కోసం తిరిగి అనుమతి ఇచ్చినవని పేర్కొంది. అనుమతి లభించిన దివాలా పరిష్కార ప్రణాళికల సంఖ్య ప్రకారం చూస్తే.. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల కొనుగోలుకు పెట్టుబడిదార్లు బాగానే ఆసక్తి చూపిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చని తెలిపింది. ఎన్‌సీఎల్‌టీల్లో కొత్త సభ్యుల నియామకం కూడా, అధిక సంఖ్యలో దివాలా కేసులు పరిష్కారం కావడానికి దోహదం చేస్తోంది. అయితే బకాయిల వసూల్లో పురోగతి మాత్రం నెమ్మదిగానే ఉందని నివేదిక తెలిపింది. 2023-24లో మొత్తం అనుమతినిచ్చిన దివాలా పరిష్కార ప్రణాళికల నుంచి బకాయిల వసూలు రేటు 27 శాతంగా ఉంది. 2022-23లో ఇది 36 శాతంగా ఉంది.
* తప్పనిసరిగా నమోదు కావాలనే ఆంక్షల నుంచి బయటపడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)తో టాటా సన్స్ ఒక అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సంస్థకు ఉన్న బ్యాంకు రుణాల స్థాయి రీత్యా, టాటా సన్స్‌ను అప్పర్ లేయర్- నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా (ఎన్‌బీఎఫ్‌సీ- యూఎల్) 2022 అక్టోబరులో ఆర్‌బీఐ వర్గీకరించింది. ఎన్‌బీఎఫ్‌సీ-యూల్ విభాగంలో ఉన్న సంస్థ మూడేళ్లలోగా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావాల్సి ఉంటుంది. ఈ ప్రకారం.. 2025 సెప్టెంబరు కల్లా టాటా సన్స్ ఎక్స్ఛేంజీల్లో నమోదుకావాలి. అయితే తప్పనిసరిగా నమోదు కావడాన్ని తప్పించేందుకు, గత డిసెంబరు నుంచి ఆర్‌బీఐతో టాటా సన్స్ చర్చలు జరుపుతున్నట్లు ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు ఈ విషయంలో ఆర్‌బీఐతో టాటా సన్స్ ఒక పరిష్కార మార్గానికి వచ్చిందని వెల్లడించాయి. ఇందులో భాగంగా రుణాలను తగ్గించుకునేందుకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
* అస్సాంలో రూ.27,000 కోట్ల పెట్టుబడితో చిప్ అసెంబ్లింగ్ ప్లాంటును టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేస్తోంది. 2025 కల్లా ఈ ప్లాంటు కార్యకలాపాలు మొదలవుతాయని… దీని ద్వారా 27,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. శనివారం ఈ ప్లాంటు ఏర్పాటుకు నిర్వహించిన భూమి పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే అస్సాం నుంచి 1,000 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ‘ఈ ప్లాంటుకు 27,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే సామర్థ్యం ఉంది. ఇందులో 15,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కాగా.. 12,000 పరోక్ష ఉద్యోగాలు. ఈ ప్లాంటు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అనుకుంటున్నాం. 2025లో దీనిని పూర్తి చేయొచ్చని మేం భావిస్తున్నాం. ఆ వెంటనే కార్యకలాపాలనూ ప్రారంభిస్తామ’ని చంద్రశేఖరన్ తెలిపారు. ఇతర సెమీకండక్టర్ కంపెనీలు కూడా తొలుత సరఫరాదారుగా కార్యకలాపాలు ప్రారంభిస్తాయని, అయితే క్రమక్రమంగా అవి కూడా దేశంలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తాయని తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. ప్లాంటు ఏర్పాటు విషయంలో కంపెనీకి ఎటువంటి అవరోధాలు ఏర్పడవని ఆయన భరోసా ఇచ్చారు.
* గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థలు రూ.1,28,913.5 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. ఈక్విటీ మార్కెట్లలో బలహీన ధోరణుల నేపథ్యంలో ఐటీ మేజర్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. టీసీఎస్ రూ.37,971.83 కోట్లు నష్టపోయి రూ.15,49,626.88 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,811.88 కోట్ల పతనంతో రూ.7,56,250.47 కోట్లకు పరిమితమైంది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,619.51 కోట్ల నష్టంతో రూ.6,11,423.11 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.13,431.54 కోట్లు కోల్పోయి రూ.7,56,717.85 కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.13,125.49 కోట్ల నష్టంతో రూ.20,28,695.57 కోట్ల వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.11.821.5 కోట్ల పతనంతో రూ.8,50,389.88 కోట్లతో సరిపెట్టుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.7,843.75 కోట్ల నష్టంతో రూ.8,42,176.78 కోట్లకు పడిపోయింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.4,288 కోట్లు కోల్పోయి రూ.6,32,862.41 కోట్ల వద్ద స్థిర పడింది.
* నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఆరు నెలల్లోనే పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ హామీగానే మిగిలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడు నెలలైనా అడుగు ముందుకు పడలేదు. పునరుద్ధరణ కోసమంటూ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇది చుట్టపు చూపునకే పరిమితమైంది. శ్రీధర్‌బాబుతోపాటు ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఫ్యాక్టరీని సందర్శించారు. రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలు తీసుకున్నారు. చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతున్నదని చెప్పి మళ్లీ తిరిగి రాలేదు. చెరకు రైతులకు పర్చేస్ ట్యాక్స్, రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ట్రాన్స్‌పోర్టు రాయితీ, కొత్త వంగడాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఇక ఆ తరువాత అడుగు ముందుకు పడలేదు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌లోనూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సైతం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z