DailyDose

నూజివీడులో పైశాచిక వికృత రాక్షస క్రీడ-CrimeNews-Aug 05 2024

నూజివీడులో పైశాచిక వికృత రాక్షస క్రీడ-CrimeNews-Aug 05 2024

* ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందారు. ఈ ఘటన కూకట్‌పల్లిలోని దేవినగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాచకొండ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్‌లో సీఐగా పనిచేస్తున్న శేఖర్‌ పుట్టినరోజు వేడుకకు హెడ్‌ కానిస్టేబుల్‌ డేవిడ్‌ సహా 30 మంది స్నేహితులు వెళ్లారు. ఆదివారం రాత్రి బర్త్‌డే పార్టీలో డిన్నర్‌ చేస్తున్న సమయంలో డేవిడ్‌ మూడో అంతస్తు నుంచి కిందికి పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో ఘటనాస్థలంలోనే ఆయన మృతిచెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు 194 బీఎన్‌ఎస్‌ఎస్‌ కింద కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

* బిహార్‌లోని హాజీపుర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల బృందం వెళ్తున్న వాహనానికి విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లు తగిలాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సుల్తాన్‌పుర్‌ ప్రాంతంలోని హరిహరనాథ్‌ ఆలయంలో పూజలు చేసేందుకు భక్తులు మినీ ట్రక్కులో వెళ్తుండగా ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు.

* స్నేహితులతో సంతోషంగా గడుపుదామని బయటకు వెళ్లిన యువకుల ప్రయాణాలు విషాదాంతమయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. బాధితులందరూ 22 నుంచి 28 ఏళ్లలోపు వారే. స్నేహితుల దినోత్సవం రోజే ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలో జరిగిన ప్రమాదంలో శ్రీశైలం జలాశయం చూసేందుకు బయల్దేరిన ముగ్గురు మృతిచెందగా, హైదరాబాద్‌లో పైవంతెన నుంచి కింద పడి ఇద్దరు విగతజీవులయ్యారు.. మరో ఘటనలో ద్విచక్రవాహనం నుంచి ఒకరు కింద పడిపోగా మీది నుంచి కంటెయినర్‌ ట్రక్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలన్నింటికీ అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమని పోలీసులు తెలిపారు.

* చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలానికి చెందిన వైకాపా కీలక నేత మామిడి తోటలో రూ.2 కోట్ల విలువ చేసే 42 ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వరకూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం.. శ్రీరంగరాజపురం మండలంలోని పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన విశ్రాంత సైనికోద్యోగి రవి తన మామిడి తోటలో ఎర్రచందనం చెట్లు పెంచారు. వాటిని విక్రయించేందుకు తిరుపతి జిల్లా పిచ్చాటూరుకు చెందిన లైసెన్స్‌డ్‌ ఎర్రచందనం వ్యాపారి రవినాయుడితో మాట్లాడారు. చెట్లు నరికించి, దుంగలుగా చేసి, వాటికి నంబర్లు వేసి అక్కడే ఓ గదిలో భద్రపరిచారు. జులై 23న కొన్ని దుంగలు చోరీ కాగా, మిగిలినవి అక్కడి నుంచి వైకాపా కీలక నేత మామిడి తోటలోకి తరలించారు. అక్కడి నుంచి అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులకు సమాచారమందింది. దుంగలను స్వాధీనం చేసుకుని, ఓ కూలీని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు అసలు నిందితులను వదిలేసి కూలీని అరెస్టు చేశారంటూ తెదేపా నాయకులు ఎస్సార్‌పురం ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సైని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్వేటినగరం సీఐ సత్యబాబు వచ్చి, వారితో చర్చించి ఆందోళన విరమింపజేశారు.

* ఏపీలో బాలికలపై అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో మరో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మధ్యలో నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు.. పామాయిల్‌ తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం పాపను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మధ్యలో నిద్రలేచిన తల్లిదండ్రులకు పాప కనిపించకపోవడంతో ఆ పరిసరాలు మొత్తం వెతికారు. ఇంతలో పామాయిల్‌ తోటలో ప్రాణాపాయ స్థితిలో పడివున్న బాలికను గుర్తించారు. వెంటనే బాలికను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగినట్లుగా నిర్ధారించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచర ఘటనపై ఏపీ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా స్పందించారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసు జాగిలాలను రంగంలోకి దించాలన్నారు. అలాగే బాలికకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z