* ‘నీది తక్కువ కులం.. నీకు మా చెల్లి కావాలా..? మళ్లీ తన జోలికొస్తే నీ అంతు చూస్తాం..’ అంటూ యువకుడిని కొట్టారు. అంతటితో ఆగకుండా మళ్లీ కాసేపటికి మూకుమ్మడిగా అతని ఇంటికెళ్లి కర్రలు, రాళ్లతో దాడి చేసి నానా యాగీ చేశారు. దీన్ని అవమానంగా భావించిన యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ కొత్తపల్లి ముత్తు, మృతుడి బంధువుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి షంషీగూడ పరిధి మహంకాళీనగర్‌కు చెందిన చిన్నా, మరియమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు కాకి సునీల్(22) డిగ్రీ చదివాడు. అతను, తన నివాసానికి సమీపంలో ఉండే యువతి(21) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ డిగ్రీ కలిసే చదువుకున్నారు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబసభ్యులు పలుమార్లు సునీల్‌తోపాటు అతని కుటుంబసభ్యులతో గొడవపడ్డారు. అయినా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే వచ్చింది. ఈ క్రమంలో గత శుక్రవారం ఇద్దరూ సినిమాకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న యువతి సోదరుడు వేణు కక్ష పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం సునీల్ తన మిత్రులతో కలిసి నిజాంపేట రోడ్డులోని ఓ మద్యం షాపులో ఉండగా.. వేణు, అతని బంధువు భరత్ మరికొంత మంది వెళ్లి అతనితో గొడవపడ్డారు. బీరు సీసాతో దాడి చేయడంతో సునీల్ తలపై గాయాలయ్యాయి.
* శ్రీకాకుళం జిల్లా పలాసలో గ్రామీణ నీటిపారుదల విభాగం పాత కార్యాలయంలో చోరీ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలు దస్త్రాలు చోరీకి గురైనట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. కార్యాలయం వెనుక ఉండే కిటికీ తొలగించి దుండగులు లోపలికి ప్రవేశించారు. దస్త్రాలను మూటలు కట్టి తుక్కు దుకాణంలో దొంగలు అమ్మేసినట్లు సమాచారం. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా తుక్కు దుకాణంలోని మూటలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
* ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం కేంద్రంగా సాగుతున్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తాజాగా బోర్డు తిప్పేసిందని వార్తలొచ్చాయి. అయితే కొందరు బాధితులు సుమ ఫొటోలు, యాడ్స్ ను చూసే ఫ్లాట్స్ కొన్నామంటూ రోడ్డెక్కడం, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సదరు బాధితుల్లో కొందరు సుమకు లీగల్ నోటీసులు కూడా పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ వివాదంపై సుమ కూడా స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేసింది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఒక యాడ్‌లో నేను గతంలో నటించాను. అయితే అది 2016-2018 వరకు మాత్రమే టెలికాస్ట్ చేసేలా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ తర్వాత ఆ ప్రకటనలు రద్దు చేసినట్లు తెలిసింది. కానీ ఇప్పుడు మా అనుమతి లేకుండా ఇంకా ఆ యాడ్‌ను ప్రదర్శించారు. దీనికి సంబంధించి కొందరు బాధితులు నాకు లీగల్ నోటీసులు పంపారు. వారికి నేను సమాధానమిచ్చాను. అలాగే ఆ సంస్థకు కూడా నోటీసులు పంపాను. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లేదా ప్రమోషన్ అలాగే వీడియోలు అఫీషియల్ చానల్స్ నుంచి వస్తే మాత్రమే నమ్మాలి. వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో నాకు అండగా నిలిచిన వారిందరికీ ధన్యవాదాలు’ అంటూ ఈ లేఖలో రాసుకొచ్చింది సుమ కనకాల. మరి సుమ వివరణతో ఈ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి.
* ఫ్రిజ్ ఓపెన్ చేయడం వల్ల ఎవరైనా చనిపోతారా? ఇది కాస్త వింతగా అనిపించవచ్చు కానీ అది జరిగింది. ఫ్రిజ్ తెరిచిన తర్వాత ఓ చిన్నారి మృతి చెందింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో ఆడుకుంటున్న బాలిక ఫ్రిజ్ తెరిచి ప్రాణాలు కోల్పోయింది. ఒకటో తరగతి చదువుతున్న ఆవడి నందవన్ మెట్టూరులో నివాసం ఉంటున్న గౌతమ్ 5 ఏళ్ల కుమార్తె రూపవతి. ఎప్పటిలాగే ఇంట్లో ఆడుకుంటోంది. ఇంతలో ఆడుకుంటుండగా ఫ్రిజ్ దగ్గరకు చేరుకుని డోర్ తెరవగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆవడి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అప్పటికే చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించారు. ఆస్పత్రికి తరలించేలోపే బాలిక మృతి చెందినట్లు వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు.
* కారుకు సైడ్ ఇవ్వలేదన్న కోపంతో సైకిల్‌పై వెళుతున్న ఓ విద్యార్దిని కత్తులతో దారుణంగా పొడిచి చంపేశారు.. బాపట్లజిల్లా చీరాలలో జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడింది చీరాల ప్రాంతంలో సెటిల్‌మెంట్లు, దౌర్జన్యాలు చేస్తూ కారులో తిరుగుతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్న యువకులుగా అనుమానిస్తున్నారు. ఒకవైపు హత్య చేసి, మరోవైపు ఈ చిన్న విషయాన్ని పెద్దది చేయకండి లేకుంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తామంటూ విద్యార్ధి తండ్రికి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన మృతుడి బంధువులు, ప్రజా సంఘాల నేతలు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి నిందితులను వెంటనే అరెస్ట్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. బాపట్లజిల్లా చీరాల మండలం అదినారాయణపురం దగ్గర డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న 18 ఏళ్ళ విద్యార్ది ఆరిఫ్‌ను కొంతమంది పోకిరిలు కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. ఆరిఫ్ తన స్నేహితుడు మనోజ్‌తో కలిసి సైకిల్‌పై వెళుతుండగా వెనుక నుంచి హారన్ కొడుతున్న కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంగా కారులో నుంచి దిగిన నలుగురు యువకులు వీరిపై దాడి చేశారు. మనోజ్‌ను చితక్కొట్టారు.. ఎందుకు కొడుతున్నారని అడ్డం తిరిగిన ఆరిఫ్‌ఫై కత్తులతో విచక్షణారహింగా విరుచుకుపడ్డారు. ఒంటిపై పలుచోట్ల గాయాలు కావడంతో ఆరిఫ్‌కు తీవ్ర రక్తశ్రావమైంది. వెంటనే అక్కడినుంచి నిందితులు కారులో పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆరిఫ్‌ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించేలోపే చనిపోయాడు.. మృతుడు ఆరిఫ్ చీరాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎవరితో గొడవలు పెట్టుకోని ఆరిఫ్‌ను కేవలం కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంగా నలుగురు యువకులు కత్తులతో పొడిచి చంపిన విషయాన్ని తెలుసుకుని చీరాల వాసులు భయాందోళన చెందుతున్నారు. నిందితులు గతంలో కూడా ఇలాగే దౌర్జన్యాలు చేసేవారని, సెటిల్‌మెంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటారని స్తానికులు చెబుతున్నారు. వీరి గురించి ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తారన్న భయంతో ఎవరికి చెప్పలేకపోతున్నామంటున్నారు.
* ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రోడ్డుపై ప్రమాదానికి గురైన పాల ట్యాంకర్‌ను స్థానికులు లూటీ చేశారు. ఏబీఈఎస్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని రహదారిపై పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్ ప్రేమ్ సింగ్ (45) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి మేరఠ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో లారీ నుజ్జనుజ్జవగా.. పాల ట్యాంకర్ సైతం దెబ్బతినడంతో పాలు బయటకు వచ్చాయి. రోడ్డుపై ఏరులై పారుతున్న పాలను చూసిన స్థానకులు డబ్బాలు, బాటిళ్లు నింపే పనిలో పడ్డారు. ప్రాణాలతో పోరాడుతున్న క్లీనర్‌ను గానీ, అక్కడే పడి ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని గానీ ఎవరూ పట్టించుకోలేదు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్తా వైరలైంది. స్థానికుల తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మనుషులనే విషయాన్ని మరిచిపోయారా అంటూ తిట్టిపోస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన క్లీనర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z