Business

UPI చెల్లింపుల పరిమితి పెంపు-BusinessNews-Aug 08 2024

UPI చెల్లింపుల పరిమితి పెంపు-BusinessNews-Aug 08 2024

* విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు ఎంతో ముఖ్యమన్న సంగతి మనందరికీ తెలిసిందే. విమానం ఎక్కేముందు పాస్ట్‌పోర్టు పత్రాల తనిఖీ కోసం కాస్త సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ ఇంటర్నెషనల్‌ విమానాశ్రయం (Zayed International Airport)లో కొత్త సాంకేతికతను అమల్లోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల ముఖ కవళికలను గుర్తించగల టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా ఇకపై పాస్‌పోర్టు, ఐడీ కార్డు అవసరం ఉండదని తెలుస్తోంది. ప్రయాణానికి ముందు క్యూలో నిలబడి ప్రతి సెక్యూరిటీ గేటు వద్ద పత్రాలను తనిఖీ చేసే పని ఇక ఉండదు. దీనికి బదులు ఫేషియల్‌ స్కానర్‌ టెక్నాలజీని వినియోగిస్తారు. దీని ద్వారా సమయం ఆదా కానుంది. ఒక వేళ ఇది అమలైతే.. ఫేషియల్‌ ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీని వినియోగించిన తొలి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా అవతరించనుంది.

* ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో (LIC Q1 results) రూ.10,461 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.9,544 కోట్లతో పోలిస్తే నికర లాభంలో 10శాతం వృద్ధి చెందింది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ.1,88,749 కోట్ల నుంచి రూ.2,10,910 కోట్లకు పెరిగినట్లు ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రీమియం వసూళ్లు రూ.7,470 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో వీటి మొత్తం రూ.6,811 కోట్లుగా ఉండేది. రెన్యువల్‌ ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయం రూ.53,638 కోట్ల నుంచి రూ.56,429 కోట్లకు పెరిగింది. పెట్టుబడుల ద్వారా వచ్చే నికర ఆదాయం రూ.96,183 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఆ మొత్తం రూ.90,309 కోట్లుగా ఉంది. సాల్వెన్సీ మార్జిన్‌ 1.89శాతం నుంచి 1.99శాతానికి పెరిగింది.

* JSW ఎనర్జీ తన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌ ద్వారా 230 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కోసం సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SECI) నుంచి అవార్డు లేఖను అందుకున్నట్లు గురువారం తెలిపింది. ఈ విద్యుత్‌ సరఫరా ఆర్డర్‌ను పూర్తిగా జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ టారిఫ్‌ ఆధారిత పోటీ బిడ్డింగ్‌ ప్రక్రియను అనుసరించి JSW NEO (JSW అనుబంధ సంస్థ) ఎనర్జీ లిమిటెడ్‌ పొందింది. JSW ఎనర్జీ.. దేశంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, కొనుగోలు/విక్రయానికి సంబంధించి అగ్రగామిగా నిలించింది. ఇప్పుడు పొందిన ఆర్డర్‌తో కంపెనీ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 16.40 GWకు చేరుకుంది.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల తర్వాత నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. గురువారం నాటి ట్రేడింగ్‌లో నష్టాలను చవిచూశాయి. అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడంతో కాసేపు సూచీలు స్వల్ప లాభాల్లోకి వచ్చినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,150 పాయింట్ల దిగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 79,420.49 పాయింట్ల (క్రితం ముగింపు 79,468.01) వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో ఇంట్రాడేలో 79,626.92 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 596 పాయింట్ల నష్టంతో 78,872 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 180 పాయింట్ల నష్టంతో 24,117 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.80గా ఉంది. సెన్సెక్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్ షేర్లు నష్టపోగా.. టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 77.89 డాలర్లు, బంగారం ఔన్సు 2437 డాలర్లు వద్ద ట్రేడవుతున్నాయి.

* కుటుంబాలు చేసే పొదుపు ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లోకి వెళ్తున్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) తెలిపారు. అవి ఆకర్షణీయంగా కనిపించడమే అందుకు కారణమని వివరించారు. దీని వల్ల బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైల్‌ డిపాజిట్లను ఆకర్షించేందుకు వినూత్న ఉత్పత్తులతో ముందుకు రావాలని బ్యాంకులకు దాస్‌ (Shaktikanta Das) సూచించారు. లేదంటే డిపాజిట్ల తగ్గుదల వల్ల ద్రవ్యలభ్యత విషయంలో సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చని హెచ్చరించారు. దీన్ని అధిగమించేందుకు విస్తృత బ్రాంచింగ్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని కస్టమర్లను ఆకర్షించాలని హితవు పలికారు. క్రెడిట్‌ డిమాండ్‌ను అధిగమించేందుకు బ్యాంకులు స్వల్ప కాల రిటైల్‌యేతర డిపాజిట్లు, ఇతర సాధనాలపై ఆధారపడుతున్నాయని దాస్‌ గుర్తుచేశారు. దీని వల్ల బ్యాంకులు వ్యవస్థాగత ద్రవ్యలభ్యత సవాళ్లను ఎదుర్కొంటాయని హెచ్చరించారు. దీన్ని నివారించేందుకు వినూత్న ఉత్పత్తులు, నాణ్యమైన సర్వీసు ద్వారా కుటుంబాల పొదుపు ఆదాయాన్ని డిపాజిట్లలోకి రాబట్టే ప్రయత్నం చేయాలన్నారు.

* ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల వెల్లడి సందర్భంగా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం కీలక ప్రకటనలు చేశారు. యూపీఐ లావాదేవీల (UPI payments) విషయంలో ముఖ్యమైన ప్రతిపాదనలు వెల్లడించారు. యూపీఐ (UPI) ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని పెంచనున్నట్లు దాస్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ.1 లక్షను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఫలితంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంది. యూపీఐ చెల్లింపుల (UPI payments) పరిమితిని సవరించడం కొత్తేమీ కాదు. 2023 డిసెంబరులోనే వైద్య ఖర్చులు, విద్యాసంస్థల్లో ఫీజులను యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశాన్ని కల్పించింది. అంతకుముందు క్యాపిటల్‌ మార్కెట్లు, బీమా, విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌ల చెల్లింపుల పరిమితిని సైతం రూ.2 లక్షలు చేసింది. మరోవైపు ఐపీఓల్లో పెట్టుబడి, రిటైల్‌ డైరెక్ట్‌ స్కీముల్లోనూ ఒక్క లావాదేవీకి యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు రూ.లక్షకు మించి పన్ను చెల్లించాల్సి వచ్చినవారు క్రెడిట్, డెబిట్‌ కార్డులను వాడేవారు. లేదా బ్యాంకుకు వెళ్లి చేసేవారు. కార్డుల ద్వారా అయితే సీవీవీ, ఎక్స్‌పైరీ తేదీ సహా ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీతో ధ్రువీకరించాలి. పైగా కార్డులపై ఉన్న నిబంధనల ప్రకారం కొన్నిరకాల రుసుములు కూడా చెల్లించాల్సి వచ్చేది. యూపీఐ చెల్లింపుల వల్ల అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. కేవలం పిన్‌ ఎంటర్‌ చేసి పన్ను కట్టేయొచ్చు.

* డిజిటల్‌ యుగంలోనూ బ్యాంకింగ్‌ సేవల్లో ఏదైనా ఆలస్యం అవుతోందీ అంటే అది చెక్కుల క్లియరెన్సే (Cheque clearance). ఎవరైనా తమ పేరు మీద చెక్కు ఇస్తే దాన్ని నగదు రూపంలో మార్చుకోవడానికి ప్రస్తుతం రెండ్రోజుల సమయం పడుతోంది. ఇతర మార్గాల్లో సత్వరమే నగదు లభిస్తున్న ఈ రోజుల్లో చెక్కులు మాత్రం రోజుల గడువు తీసుకుంటున్న వేళ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) దీనిపై దృష్టిసారించింది. కొన్ని గంటల్లోనే చెక్కు క్లియరెన్స్‌ జరిగేలా సంబంధిత ప్రక్రియలో కీలక మార్పును ప్రకటించింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా చెక్కులకు సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ ప్రకటన చేశారు. చెక్కుల క్లియరెన్సుకు ప్రస్తుతం టీ+1 విధానం అమలవుతోందని చెప్పారు. దీన్ని కొన్ని గంటలకు తగ్గించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రస్తుతం అవలంబిస్తున్న చెక్‌ ట్రంకేషన్ సిస్టమ్‌ (CTS) విధానంలో మార్పులు చేయనున్నారు. బ్యాచ్‌ల వారీగా ప్రాసెసింగ్‌ కాకుండా.. ఇకపై ‘ఆన్‌ రియలైజేషన్‌ సెటిల్‌మెంట్‌’ విధానాన్ని అవలంబించనున్నట్లు చెప్పారు. బ్యాంకు పని గంటల్లో చెక్కును స్కాన్‌ చేసి, ప్రజెంట్‌ చేసి, కొన్ని గంటల్లోనే పాస్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల కొన్ని గంటల్లోనే చెక్కు క్లియరెన్స్‌ పూర్తవుతుందని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z