DailyDose

130మంది ఆచూకీ గల్లంతు-CrimeNews-Aug 12 2024

130మంది ఆచూకీ గల్లంతు-CrimeNews-Aug 12 2024

* ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, మాజీ కోచ్ గ్రాహమ్‌ థోర్ప్‌ (55) ఆగస్టు 5న కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే, తన భర్తది సహజ మరణం కాదని గ్రాహమ్‌ థోర్ప్‌ భార్య అమందా వెల్లడించారు. రెండేళ్లుగా మానసిక, అనారోగ్య సమస్యలతో బాధపడి డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె తెలిపారు. 2022 మేలో కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వెల్లడించారు. అప్పుడు పరిస్థితి విషమంగా మారడంతో చాలా రోజులు ఐసీయూలోనే ఉన్నాడని పేర్కొన్నారు.

* వరంగల్ జిల్లాలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. రాయపర్తి మండల కేంద్రంలోని రామచంద్రుని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతులు హన్మకొండ జిల్లా పైడిపల్లి మధ్యగూడెంకు చెందిన దిలీప్ (30), అంజలి (25)గా గుర్తించారు. వీరి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

* వయనాడ్‌లో ఇంకా విషాదకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 200లకు పైగా మృతదేహాలను గుర్తించగా.. అనేక మంది జాడ ఇంకా లభించలేదు. దీంతో రెండు వారాలుగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. సుమారు 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు పేర్కొన్నారు. వీరి కోసం చలియార్‌ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

* కోల్‌కతాలోని ఆర్జీకార్‌ మెడికల్‌ కళాశాలలో వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫోర్డా (ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌) తెలిపింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. ఆస్పత్రిలో వైద్యులకు రక్షణ కల్పించాలని వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. నిరసన నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రధానంగా ఆరు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.

* నగరంలోని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బైక్‌ అదుపు తప్పడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులను శ్రీహరి (48), సందీప్‌ (20), అభిలాష్‌ (20)గా గుర్తించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z