Politics

గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు-NewsRoundup-Aug 13 2024

గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు-NewsRoundup-Aug 13 2024

* ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించాలంటే ఐక్యరాజ్య సమితి (United Nations) భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్‌ పునరుద్ఘాటించింది. ఈసందర్భంగా న్యూదిల్లీకి శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.

* రాజకీయంగా అడుగులు వేయడం మొదలుపెట్టిన తర్వాత అది తన సినీ కెరీర్‌పై ప్రభావం చూపుతోందని నటి, ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut News) అభిప్రాయపడ్డారు. ఆమె స్వీయ దర్శకత్వంలో రూపొందిన బయోగ్రాఫికల్‌ మూవీ ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie). గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబరు 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈసందర్భంగా కంగన మాట్లాడారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత బాధ్యతలు పెరిగాయన్నారు. పార్లమెంట్‌ సమావేశాలతో పాటు, సామాజిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా పాల్గొనాల్సి వస్తోందన్నారు. రాజకీయంగా ఉన్న విధులను నిర్వర్తించటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఆ ప్రభావం ఇప్పటికే ఒప్పుకొన్న సినిమాలపై పడిందని అన్నారు.

* తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

* ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త వాళ్లలో జోష్ నింపుతోంది. ఆగస్టు 23 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దీని హిందీ వెర్షన్‌ మాత్రం అదే తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

* పారిస్‌ ఒలింపిక్స్‌ (paris olympics 2024) జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌(Arshad Nadeem). దీంతో దేశవ్యాప్తంగా అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని ప్రజలు అతడికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కాగా నదీమ్‌ ఇంటికి క్రికెట్‌ అభిమానులు పెద్ద భారీ మొత్తంలో చేరుకొని అతడికి డబ్బులు అందజేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. నదీమ్‌ను కలవడానికి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున అతని ఇంటికి చేరుకుంటున్నారు. కాగా కొందరు వ్యక్తులు నగదు సహాయం అందజేశారు. ఓ వ్యక్తి మాట్లాడుతూ నదీమ్‌ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడని, తాను సాయం చేసినట్లే ప్రభుత్వం సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రతిసారి వాగ్దానాలు చేస్తుంది తప్ప.. ఆర్థిక సహాయం చేయట్లేదని ఆరోపించారు.

* పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లను ఈ నెల 15న ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవాన తొలి విడతగా 100 క్యాంటీన్‌లు అందుబాటులోకి రానున్నాయి. పంద్రాగస్టున కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. పట్టణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడినందున ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ కార్యక్రమం వాయిదా పడింది. మిగతా జిల్లాల్లో ఎంపిక చేసిన 33 పురపాలక, నగరపాలక సంస్థల్లో క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడెక్కడ, ఎన్నెన్ని ఏర్పాటు చేయాలన్న విషయంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. 16వ తేదీ నుంచి ఈ క్యాంటీన్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.

* హమాస్ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్యతో ఇజ్రాయెల్‌-ఇరాన్‌ (Israel-Iran)ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడైనా యుద్ధంగా మారొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇరాన్‌ లేక దానికి మద్దతిస్తున్న సంస్థలు ఇజ్రాయెల్‌పై దాడి చేసే అవకాశం గణనీయంగా పెరుగుతోందని వైట్‌హౌస్ హెచ్చరించింది. ఈ వారంలోనే దాడి జరగొచ్చని అప్రమత్తం చేసింది. నిఘా వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ వైట్‌హౌస్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ ఆమేరకు ప్రకటించారు. మరోవైపు ఈ ప్రతీకార దాడుల్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ పూర్తి సంసిద్ధతతో ఉందని తెలుస్తోంది.

* పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో అదరగొట్టిన యువ షూటర్‌ మను బాకర్‌ (Manu Bhaker) రానున్న ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున మరిన్ని పతకాలు సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా మను బాకర్‌ రికార్డు సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత మరో షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో శ్రీజేశ్‌తో కలిసి భారత పతాకధారిగానూ వ్యవహరించింది. స్వదేశానికి వచ్చిన అనంతరం మను బాకర్‌ జాతీయ మీడియాతో మాట్లాడింది. ‘‘ఈసారి ఒలింపిక్స్‌లో పతకాల కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. కానీ, ఒకే ఒలింపిక్స్‌లో రెండు అంతకంటే ఎక్కువ వ్యక్తిగత పతకాలు సాధించడం ఎంతో గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకోవడమే నా లక్ష్యం. నేను భారతదేశం కోసం మరిన్ని ఒలింపిక్ పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. పతాకధారిగా వ్యవహరించే అవకాశం అందరికీ రాదు. నాకు ఈ ఛాన్స్‌ వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. దీనిని జీవితాంతం గుర్తుంచుకుంటా. శ్రీజేష్ భయ్యాతో నాకు మంచి స్నేహపూర్వక బంధం ఉంది. అతను నాకు చిన్నప్పటినుంచి తెలుసు. దీంతో ముగింపు వేడుకలో నాకు ఇబ్బంది కలగలేదు’’ అని మను బాకర్‌ వివరించింది.

* ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించాలంటే ఐక్యరాజ్య సమితి (United Nations) భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్‌ పునరుద్ఘాటించింది. ఈసందర్భంగా న్యూదిల్లీకి శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. భద్రతా మండలిని విస్తరించాలని, అందులో ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్‌ దేశాలకు సభ్యత్వం కల్పించాలని సూచించింది. అయితే, దీన్ని చైనా (China), పాకిస్థాన్‌ (Pakistan)లు వ్యతిరేకించాయి.

* పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తర్వాత వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat)పై అనర్హత వేటు పడింది. ఊహించని ఈ పరిణామంతో వినేశ్‌తోపాటు ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తనపై వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ రెజ్లర్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ (కాస్‌)లో అప్పీల్ చేసింది. వాదనలు విన్న కాస్‌ మరికొన్ని గంటల్లో తీర్పు ఇవ్వనుంది. తీర్పు భారత్‌కు అనుకూలంగా వస్తే వినేశ్‌కు రజత పతకం ఇవ్వాల్సిఉంటుంది. ఈ కేసులో వినేశ్ తరఫున వాదించిన ఇద్దరు సీనియర్ న్యాయవాదులలో ఒకరైన విదుష్పత్ సింఘానియా మీడియాతో మాట్లాడారు.

* ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్‌ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద, శివానంద యోగ విద్యాపీఠం వ్యవస్థాపకులు స్వామి గోవిందానంద సరస్వతిల మధ్య వివాదం ముదిరింది. తనను దొంగబాబాగా అభివర్ణించడాన్ని తప్పు పడుతూ అవిముక్తేశ్వరానంద దిల్లీ కోర్టులో గోవిందానందపై పరువునష్టం దావా వేశారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ‘‘ఇది మంచి పద్దతి కాదు. ఆయన కొంచెం ఆవేశానికిలోనై ఉంటారు. దీనిలో పరువు నష్టం ఉందని అనుకోము’’ అని న్యాయమూర్తి నవీన్‌ చావ్లా వ్యాఖ్యానించారు. ‘‘మీరు సాధువు. ఈ విషయంపై ఎందుకు ఆందోళన చెందుతున్నారు. మీలాంటి వారు వీటిని పట్టించుకోకూడదు. ఇలాంటి వాటితో మిమ్మల్ని కించపర్చలేరు. సాధువులు తమ పనులతోనే గౌరవాన్ని పొందుతారు’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

* పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత షట్లర్లు కచ్చితంగా ఒకట్రెండు పతకాలైనా సాధిస్తారని భావించారు. కానీ, చివరకు ఒక్క పతకం కూడా రాలేదు. అగ్రశ్రేణి ఆటగాళ్లు కీలక మ్యాచ్‌ల్లో ఓడారు. సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ (Lakshya Sen) ఫైనల్‌కు మాత్రం చేరుకోలేకపోయాడు. కాంస్య పతక పోరులోనూ తడబడ్డాడు. దీంతో లక్ష్యసేన్‌ ప్రదర్శనపై లక్ష్య మెంటార్‌, బ్యాడ్మింటన్ దిగ్గజ ఆటగాడు ప్రకాశ్‌ పదుకొణె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు జవాబుదారీతనంతో ఉండి మరింత బాధ్యత తీసుకోవడం నేర్చుకోవాలన్నాడు. పదుకొణె చేసిన వ్యాఖ్యలను స్టార్‌ షట్లర్‌ అశ్విని పొన్నప్ప తప్పుబట్టారు.‘‘కోచ్‌లు ఎందుకు బాధ్యత తీసుకోరు? గెలిచినప్పుడు ముందు క్రెడిట్‌ తీసుకునేది వాళ్లే కదా..! అలా ఓడినప్పుడు కూడా బాధ్యత ఎందుకు తీసుకోరు?’’ అని ప్రశ్నించింది. అయితే, ఈ విషయంలో ప్రకాశ్‌ పదుకొణెకు భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) మద్దతుగా నిలిచాడు. ప్రకాశ్ అన్న మాటల్లో తప్పు లేదన్నాడు. లక్ష్యసేన్‌ సెమీస్‌, కాంస్య పతక మ్యాచ్‌ల్లో ఓ దశలో ఆధిక్యంలో నిలిచినా ఆఖరకు పరాజయం పాలయ్యాడని గావస్కర్ గుర్తు చేశాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z