* సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్ (Madhabi Puri Buch)పై అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలు ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయం దేశ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. సెబీ బాస్‌పై వస్తున్న ఆరోపణలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దిల్లీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. దాదాపు 60 మంది పార్టీ నేతలు హాజరై అదానీ స్కామ్‌కు సంబంధించి తాజా పరిణామాలపై చర్చించినట్లు వెల్లడించారు. సెబీ బాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలిపారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లోని ఈడీ కార్యాలయాలను ముట్టడిస్తాం అని ఆయన అన్నారు.
* వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాల్ చేస్తూ మెడికల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మెడికల్ సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాకూర్ వాదించారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) భారీ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో స్టాక్స్‌లో అమ్మకాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, ఎఫ్‌ఐఐల విక్రయాలు కూడా ఇందుకు తోడయ్యాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.5 శాతం మేర నష్టపోవడం సూచీల పతనాన్ని శాసించింది. ఆ బ్యాంకు వెయిటేజీని రెండు దశల్లో పెంచుతామంటూ MSCI ప్రకటించడమే దీనికి కారణం. మార్కెట్ అంచనాలకు భిన్నంగా ఈ నిర్ణయం వెలువడమే సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికితోడు ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కూడా ప్రభావం చూపాయి. దీంతో సెన్సెక్స్ 79 వేల మార్కు దిగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 79,552.51 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,648.92) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపు లాభాల్లోకి వచ్చినా.. వెంటనే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే బాటలో పయనించింది. ఇంట్రాడేలో 78,889.38 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 692.89 పాయింట్ల నష్టంతో 78,956.03 వద్ద ముగిసింది. నిఫ్టీ 208 పాయింట్లు కోల్పోయి 24,139 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.99గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 82.20 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,499 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
* స్పామ్ కాల్స్‌కు (Spam calls) సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కీలక ఆదేశాలు ఇచ్చింది. అన్ రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్, ప్రీ రికార్డెడ్ లేదా కంప్యూటర్ జనరేటెడ్ కాల్స్‌ను తక్షణమే నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలుచేయాలని సూచించింది. స్పామ్ కాల్స్‌పై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అన్‌రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్ల నుంచి వస్తున్న కాల్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయా అన్ రిజిస్టర్డ్ టెలీమార్కెటర్ల డేటాను సమర్పించాలంటూ టెల్కోలకు ట్రాయ్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలోనే మంగళవారం ఆతరహా కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలని సూచించింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఈతరహా కాల్స్ చేస్తే రెండేళ్ల పాటు యాక్సెస్‌ను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఆ సంస్థను రెండేళ్ల వరకు బ్లాక్ లిస్ట్‌లో పెడతామని పేర్కొంది.
* దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తిరిగి పెరుగుతున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.500 వృద్ధితో రూ.72,850లకు చేరుకున్నది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ బంగారానికి డిమాండ్ పెరిగింది. సోమవారం 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.72,350 వద్ద స్థిర పడింది. 99.5 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.500 పెరిగి రూ.72,500 వద్ద నిలిచింది. రిటైలర్లు, జ్యువెల్లర్ల నుంచి డిమాండ్ పెరగడం వల్లే బంగారం ధర పెరుగుదలకు కారణం అని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కిలో వెండి ధర మంగళవారం ఫ్లాట్ గా కొనసాగింది.
* వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 9వ తేదీన న్యూఢిల్లీలోని (New Delhi) విజ్ఞాన్ భవన్ (Vigyan Bhavan)లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వెల్లడించింది. ఈ భేటీలో రేట్ల హేతుబద్ధీకరణపై (rate rationalisation) చర్చించే అవకాశం ఉంది. జూన్ 22న 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లు, విశ్రాంతి గదులు, నెలకు రూ.20 వేల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేటు హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు వర్తింపు, అన్ని పాల క్యాన్లపై జీఎస్టీని 12 శాతంగా, కార్టన్ బాక్సులపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గింపు, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్ర, ఎరువులపై జీఎస్టీ మినహాయింపు వంటి వాటిపై నిర్ణయాలు తీసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z