DailyDose

ఆమెది గ్యాంగ్ రేప్? – CrimeNews-Aug 14 2024

ఆమెది గ్యాంగ్ రేప్? – CrimeNews-Aug 14 2024

* పశ్చిమబెంగాల్‌ (West Bengal) రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder) సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక హత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతదేహంలో అధిక మొత్తంలో వీర్యాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్‌ వైద్యురాలు ఆసుపత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ కేసులో పోలీసు వాలంటీర్‌ అయిన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె రహస్య అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్‌ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇక, ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారట. తమ కుమార్తె మృతిపై ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి (Gang Rape) పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్‌లో ఆరోపించారు.

* జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని దోడా జిల్లాలో బుధవారం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 48వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఆర్మీ కెప్టెన్‌ (Army Captain) దీపక్‌ సింగ్‌ అమరుడయ్యారు. మరోవైపు, ఈ ఎన్‌కౌంటర్‌ (Encounter) పరిసరాల్లో దొరికిన వస్తువుల ఆధారంగా నలుగురు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు అంచనావేస్తున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపాయి. స్వాతంత్ర దినోత్సవం వేళ ఉదమ్‌పూర్‌లో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం గాలింపు చేపట్టిన భద్రతా దళాలపై తొలుత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో సాయుధులు దోడా జిల్లాలోని అడవుల్లోకి పారిపోయారు. దీంతో నిన్న రాత్రి నుంచి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు.

* కర్నూలు జిల్లాలో తెదేపా నేత దారుణహత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. తెదేపా నేత వాకిటి శ్రీనివాసులు (45) బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా దుండగులు ఆయన కళ్లలో కారం చల్లి దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ జయన్న ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. తెదేపా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. హత్య ఘటనకు దారితీసిన పరిస్థితులను డీఎస్పీతో మాట్లాడారు. నిందితులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యేకు శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. వైకాపాకు చెందిన వారే హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

* నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుమారుడు ఆన్‌లైన్‌ బెట్టింగులకు బానిసై అప్పులు చేశాడని భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహేశ్వర్‌రెడ్డి, శాంతి దంపతులు పురుగుల మందు తాగి చనిపోయారు. వెలుగోడు మండలం అబ్దుల్లాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* బహిరంగ ప్రదేశంలో మూత్రవిసర్జన చేయొద్దన్నందుకు క్యాబ్‌ డ్రైవర్‌పై రిజర్వుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమారుడు, అతడి స్నేహితులు కలిసి విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన హనుమకొండలోని కాజీపేట బస్టాప్‌ వద్ద మంగళవారం చోటుచేసుకొంది. కాజీపేట పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.సుధాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన రిజర్వుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమారుడు హర్షిత్, అతడి స్నేహితులు ఏడుగురు కారులో వేకువజామున 4.15 గంటలకు కాజీపేటకు వచ్చారు. ప్రధాన రహదారిలో బస్టాపు సమీపంలోని జీపు అడ్డా వద్ద కారు ఆపారు. వారిలో ఒకరు బస్టాపు వద్ద మూత్రం పోస్తుండగా.. ఇక్కడ పోయవద్దని రెడ్డికాలనీకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ పిండి రాజు వారించారు. దీంతో ఆయనను హర్షిత్‌ దూషిస్తూ.. చేతి కడియంతో దాడి చేశాడు. తల పగిలి రక్తం కారుతున్నా వదిలిపెట్టలేదు. అతడి స్నేహితులు కూడా రాజుపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతను భయంతో పక్కనే ఉన్న రైల్వే స్టేడియంలోకి పారిపోయాడు. అనంతరం హర్షిత్, అతడి స్నేహితులు అడ్డాలో నిలిపిఉన్న మూడు కార్ల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటన కాజీపేట పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పిండి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z