Fashion

ఒడిశాలో మహిళ ఉద్యోగినులకు నెలసరి సెలవు-NewsRoundup-Aug 15 2024

ఒడిశాలో మహిళ ఉద్యోగినులకు నెలసరి సెలవు-NewsRoundup-Aug 15 2024

* స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఎగురవేశారు. అక్కడకు పవన్‌తోపాటు ఆయన తనయ ఆద్య కూడా వెళ్లారు. ఆమెతో కలిసి పవన్‌ తీసుకున్న సెల్ఫీ నెట్టింట వైరల్‌గా మారింది. కుమార్తెతో డిప్యూటీ సీఎం సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యాలు షేర్‌ చేస్తూ రేణూ దేశాయ్‌ (Renu Desai) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.

* పాములు పట్టేందుకో పోటీ ఉంది. ఎక్కువ లేక పొడవైన పాములు పట్టినవారికి రూ.లక్షల్లో ప్రైజ్‌మనీ కూడా ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి 10 రోజుల పాటు వీటిల్లో పాల్గొనే వీలుంది. వినడానికి కాస్త చిత్రంగానే ఉన్నా.. ‘ఫ్లోరిడా పైతాన్ ఛాలెంజ్’ పేరిట నిర్వహించే ఈ పోటీల వెనక ఓ ఉద్దేశమూ ఉంది. ఫ్లోరిడా ఫిష్‌ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌ (FWC) ఏటా ఆగస్టులో ఈ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. ఈసారి ఆగస్టు 9న మొదలైన ఈ పోటీలు ఆగస్టు 18తో ముగియనున్నాయి. దీనిలోభాగంగా హంటర్స్‌.. ఎవర్‌గ్లేడ్స్‌ ప్రాంతంలోని బర్మీస్‌ పైతాన్‌లను పట్టుకోవాలి. అవి 18 అడుగుల పొడవు, 200 పౌండ్ల వరకు బరువూ ఉంటాయి. 2000 సంవత్సరంలో ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో మొదటిసారి వీటిని గుర్తించారు. అయితే అవి అక్కడికి ఎలా చేరాయనే దానిపై స్పష్టత లేదు. ఇక అప్పటినుంచి అక్కడ వాటి సంతతి భారీగా పెరిగింది. ఒక ఆడ పైతాన్‌ ఒకేసారి 100 గుడ్లు పెట్టగలదు. ఎవర్‌గ్లేడ్స్‌లోని తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతం వాటి వృద్ధికి దోహదం చేస్తోంది. దాంతో అవి దక్షిణ ఫ్లోరిడాకు విస్తరించాయి. వాటి తాకిడి వల్ల స్థానిక జీవివైవిధ్యంపై ప్రభావం పడింది. ఈ పర్యావరణ సంక్షోభం నుంచి ఆ ప్రాంతాన్ని బయటపడేసేందుకు అధికారులు ‘ఫ్లోరిడా పైతాన్ ఛాలెంజ్‌’ను తీసుకువచ్చారు. ఆ పాముల జాతిని తగ్గించేందుకు ఈ పోటీల ద్వారా ప్రజలను భాగస్వాముల్ని చేస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు వాటిని హింసించకుండా చంపివేయాలి. ఈవిషయమై శిక్షణ కూడా ఉంటుంది. ఫ్లోరిడాలో జీవహింస వ్యతిరేక చట్టాలు ఉన్నప్పటికీ.. కొన్నేళ్లుగా ఈ పోటీలు నడుస్తుండటం గమనార్హం.

* పేదలకు పట్టెడన్నం పెట్టే మంచి కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గుడివాడ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు అన్న క్యాంటీన్లకు డిజిటల్‌ విరాళాలివ్వొచ్చని చంద్రబాబు చెప్పారు. విరాళాలు అందజేసేందుకు ఏర్పాటు చేసిన బ్యాంక్‌ ఖాతా నెంబరు, ఇతర వివరాలను ఆయన వెల్లడించారు. అవి ఈ కింది విధంగా ఉన్నాయి. SBI Bank Name-ANNA CANTEENS A/C – 37818165097 IFSC – SBIN0020541 Branch – Chandramouli Nagar City – Guntur

* అమెరికాలో ఓ విమాన పైలట్‌ ఇటీవల ప్రయాణికులకు భారీ షాక్‌ ఇచ్చాడు. ఫలితంగా విమానాన్ని మార్గం మళ్లించాల్సి వచ్చింది. ఇటీవల స్కైవెస్ట్‌ నిర్వహించే 3491 విమానం వొమింగ్‌లోని జాక్సన్‌ హోల్‌ ఎయిర్‌ పోర్టుకు బయల్దేరింది. తీరా విమానాశ్రయం చేరుకొనేసరికి అక్కడ ల్యాండ్‌ చేయడానికి తనకు సరైన అర్హత లేదని ఇంటర్‌కమ్‌లో ప్రయాణికులకు వెల్లడించాడు. ఓవైపు విమాన సిబ్బంది ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇంటర్‌కమ్‌లో పైలట్‌ ‘హాయ్‌.. నన్న క్షమించండి. జాక్సన్‌ హోల్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేయడానికి నాకు సరైన అర్హత లేదు. ఇప్పుడు మనం ఉటాలోని సాల్ట్‌ లేక్‌ సిటీకి వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తాను’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విమాన ప్రయాణికుడు ఒకరు రెడిట్‌లో పోస్టు చేశారు. ఆ తర్వాత విమానం సాల్ట్‌లేక్‌ సిటీలో ల్యాండ్‌ అయింది. ఆ సమయంలో తీవ్రంగా కుదుపులకు లోనైనట్లు ప్రయాణికులు వెల్లడించారు. అక్కడే దాదాపు గంటన్నర సేపు ఉండిపోయింది. తర్వాత మరో పైలట్‌ వచ్చి విమానం బాధ్యతలు తీసుకొన్నాడు. తిరిగి అది జాక్సన్‌హోల్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకొంది. ఇక దీనిపై స్కైవెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ.. సరైన పత్రాలు లేకపోవడంతో మళ్లించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.

* ఇజ్రాయెల్‌ (Israel)పై ప్రతీకారం తీర్చుకొనే విషయంలో ఎవరైనా వెనక్కి తగ్గినా.. రాజీపడినా దైవాగ్రహానికి గురికాక తప్పదని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతొల్లా అలీ ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. హమాస్‌ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్‌ హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకొనేందుకు ఇరాన్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్న వార్తలు వస్తున్నవేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

* అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను ఎలాంటి ఫోన్‌ సంభాషణ జరపలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల వంటి అంశాలపై నెతన్యాహు-ట్రంప్ చర్చించుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేలా ఇజ్రాయెల్‌ను ప్రోత్సహించేందుకు ట్రంప్ ఈ ఫోన్‌ కాల్‌ చేసినట్లు ఆ వార్తల సారాంశం. దీనిపై నెతన్యాహు ఆఫీస్‌ నుంచి తాజాగా స్పందన వచ్చింది. ‘‘మీడియాలో వార్తలు వచ్చినట్టుగా ట్రంప్‌తో నెతన్యాహు ఎలాంటి సంభాషణ జరపలేదు’’ అని స్పష్టం చేసింది.

* ‘రుణమాఫీ చేయలేరని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్‌ చేశారు. రుణమాఫీ అమలు చేశాం.. హరీశ్‌రావు రాజీనామా చేయాలి లేదంటే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. తాను విసిరిన సవాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు హరీశ్‌రావు చెప్పాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మూడో విడత రైతు రుణమాఫీ సందర్భంగా.. ‘సాగుకు జీవం.. రైతుకు ఊతం’ పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.

* సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి తనపై చేసిన విమర్శలను హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా తిప్పికొట్టారు. ‘‘దేవుళ్లపై ఒట్టు పెట్టుకొని మాట మీద నిలబడక పోగా.. నిస్సిగ్గుగా భారాస, నాపై విమర్శలు చేస్తున్నారు. సోనియాగాంధీ పుట్టిన రోజు కానుగా డిసెంబరు 9 నాటికి రూ.40వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి చెప్పారు. అది నెరవేర్చలేక పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మరో నాటకానికి తెరలేపారు.

* పార్టీకి ద్రోహం చేసిన వారికి నాలుగేళ్ల తర్వాత ప్రజలు బుద్ధి చెబుతారని, త్వరలో స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక వస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఉప ఎన్నికలో భారాస నుంచి రాజయ్య గెలుపు ఖాయమన్నారు. హైకోర్టులో తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని, మిగతా వాళ్లపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. సభాపతి రాజకీయ పక్షపాతం చూపిస్తూ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ మారుపాక రవి, మాజీ ఎంపీపీ బుచ్చయ్య, ఇతర నేతలు తిరిగి భారాసలో చేరారు. కండువా కప్పి కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

* పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతోషాన్ని కలిగిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘గుడివాడకు తెదేపా ఎప్పుడూ రుణపడి ఉంటుంది. గత ప్రభుత్వ దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించుకోవాల్సి వచ్చింది. గుడివాడలో మూడు అన్న క్యాంటీన్లను పెడుతున్నాం. ఎన్టీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గమిది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తిరుమలకు వెళ్లిన ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుట్టారు.

* ప్రజా సంపద దుర్వినియోగం చేసిన వారిలో ఎవరినీ వదిలిపెట్టమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీసు పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని పేర్కొన్నారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం కర్ణాటకలో అమ్ముకున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ పేరు.. పేదల ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసే క్యాంటీన్లకు ఎన్టీఆర్‌ పేరు పెట్టామని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

* స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఒడిశా (Odisha) ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు (Menstrual Leave) పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల (Women Employees)కు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కటక్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పార్వతి పరీదా ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా ఉద్యోగులు ప్రతినెలా తమ రుతుక్రమంలో తొలి లేదా రెండో రోజు ఈ సెలవు (Period Leave)ను తీసుకునేలా దీన్ని రూపొందించినట్లు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

* తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అక్కడక్కడా కురుస్తుందని పేర్కొంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం, శనివారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z