* నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బేగంపేట్, మారేడుపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట్, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, మియాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, కోఠి, లక్డీకాపూల్, ఎల్బీనగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. డ్రైనేజీలు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* పశ్చిమ్ బెంగాల్‌లో వైద్యురాలిపై హత్యాచార ఘటన విషయంలో భాజపా రాజకీయ లబ్ధి చేకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం ఆయన స్వాతంత్ర్య సమరయోధురాలు మహారాణి అవంతీబాయి లోథీ జయంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
* టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్‌గా నియమితుడైన దక్షిణాఫ్రికా (South Africa) మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్‌పై (Morne Morkel).. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించిన సంగతి తెలిసిందే. మోర్కెల్ గతేడాది పాకిస్థాన్ క్రికెట్ టీమ్ బౌలింగ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో గతంలో ‘బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
* ప్రభుత్వం మారిన తర్వాత బదిలీ అయ్యి, పోస్టింగు లేకుండా వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులు వరుసగా సెలవులకు దరఖాస్తు చేసుకున్నారు. వెయిటింగ్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులు రోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ హాజరు పట్టీలో సంతకాలు చేయాలి. పనిగంటలు ముగిసేవరకూ కార్యాలయంలోనే ఉండి సంతకం చేశాకే మళ్లీ బయటకు రావాలని ఇటీవల డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారంతా మూకుమ్మడిగా సెలవు పెట్టారు. పోస్టింగ్‌ల కోసం నిరీక్షిస్తున్న ఐపీఎస్ అధికారులు ఇంకా వైకాపాకే మొగ్గు చూపుతున్నారని నిఘా వర్గాల సమాచారం. కేసులు బలహీన పరిచేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని తేలింది. దీంతో నిరీక్షణలో ఉన్న 16 మందిని డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
* ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రానికి జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని సినీ హీరో నిఖిల్ (Nikhil) తెలిపారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ‘కార్తికేయ 2’ను అవార్డు వరించింది. నిఖిల్- అనుపమ నటించిన ‘కార్తికేయ 2’ను చందు మొండేటి తెరకెక్కించారు. శ్రీకృష్ణుడి చరిత్ర చుట్టూ తిరిగే ఈ సినిమా ఆగస్టు 2022లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.
* వైకాపా నేత దేవినేని అవినాష్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నిస్తుండగా.. విమానాశ్రయ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. అనంతరం ఏపీలోని మంగళగిరి పోలీసులకు వారు సమాచారం అందించారు. ఆయనపై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారిని కోరారు. ఈక్రమంలో దేవినేని అవినాష్ ప్రయాణాన్ని అధికారులు అడ్డుకోవడంతో.. ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
* చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను మంగళగిరి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు గంటా నలభై నిమిషాల పాటు జోగి రమేశ్‌ను ప్రశ్నించారు. ఆ రోజు దాడికి సంబంధించిన వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని వాహనాల్లో వచ్చారు? ఎంత మంది దాడిలో పాల్గొన్నారు? ఎవరి ఆదేశంతో దాడికి పాల్పడ్డారు? దాడికి ముందస్తు ప్రణాళిక రచించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేశారు.
* రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేవలం 22.37 లక్షల మంది రైతులకు, రూ.17,934 కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారాస నేతల మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రుణమాఫీ 40 శాతం మాత్రమే పూర్తి చేశారని చెప్పారు.
* తెజస అధ్యక్షుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, పొన్నం తదితరులు పాల్గొన్నారు.
* హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తోన్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని ప్రభుత్వం పొడిగించింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌వోడీ, రాజ్‌భవన్ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి 2024 జూన్ 27 నుంచి వచ్చే ఏడాది జూన్26 వరకు ఉచిత వసతి వర్తిస్తుందని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z