Business

ఇండియాలో లగ్జరీ కార్లకు భారీ డిమాండ్-BusinessNews-Aug 17 2024

ఇండియాలో లగ్జరీ కార్లకు భారీ డిమాండ్-BusinessNews-Aug 17 2024

* ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకుండా తామే చెడగొట్టామని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) అన్నారు. నాలుగు వారాలకే సినిమాను ఓటీటీలోకి తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోని పరిస్థితులను అంచనా వేస్తూ, అందుకు తగినట్లు సినిమాలు నిర్మించే వారిలో దిల్‌రాజు ఒకరు. తాజాగా ఓటీటీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ అయ్యాయి. ‘రేవు’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘‘కొత్తవాళ్లతో సినిమాలు తీసే ప్రక్రియ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ, 99శాతం ఫెయిల్‌ అవుతాయి. ఒకశాతం మాత్రమే సక్సెస్‌ రేట్‌. కెరీర్‌ తొలినాళ్లలో నేను సినిమాలు తీసేటప్పుడు నా సినిమాకు ఆడియన్స్‌ ఎలా వస్తారు? ఇంకా ఏమేం యాడ్‌ చేయాలి? అనుకుంటూ తీసేవాడిని. సినిమా తీయడం ఈ రోజుల్లో గొప్ప కాదు. ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి ఆ మూవీని చూడటమే బిగ్‌ ఛాలెంజ్‌. మేము తీసిన ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్ళు’ నెమ్మదిగా మౌత్‌ టాక్‌ ద్వారా ప్రేక్షకులకు చేరాయి. అదే సమయంలో సినిమా బాగుందని రివ్యూలు ఇవ్వడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అసలు ప్రేక్షకులను చెడగొట్టింది మేమేలెండీ.. ‘మీరు ఇంట్లో కూర్చోండి. నాలుగు వారాల్లో ఓటీటీకి తెస్తాం’ అని థియేటర్‌కు రాకుండా చేసుకున్నాం. ఈ సినిమా (రేవు) చూసి నేను కూడా రివ్యూ ఇస్తా (నవ్వులు). మంచి సినిమా.. అదీ చిన్న మూవీ అయితే, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి’’ అని దిల్‌రాజు అన్నారు.

* దేశంలో లగ్జరీ కార్ల విక్రయాలు ఊపందుకున్నాయి. లంబోర్గిని, ఫెరారీ కార్లు విక్రయాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. ఏటికేడు లగ్జరీ కార్లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయాలు వరుసగా మూడో ఏడాది కూడా మునుపటి రికార్డులను అధిగమించనున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లంబోర్గిని కంపెనీ.. హురాకాన్‌, ఉరుస్‌, రెవెల్టో వంటి లగ్జరీ కార్లను దేశీయంగా విక్రయిస్తోంది. వీటితోపాటు ఫెరారీ, మెక్‌లారెన్‌, మార్టిన్‌కు దేశీయంగా మంచి డిమాండ్‌ ఉంది. ఇక హై ఎండ్‌ మోడల్స్‌ అయిన మెర్సిడెజ్‌- బెంజ్‌, ఆడీల కొనుగోలుకు ఏడాది వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంది. దీంతో దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్‌కు ఉన్న డిమాండ్‌ స్పష్టంగా కనిపిస్తోంది.

* హోటళ్లు, లగ్జరీ బ్రాండ్‌ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్‌ క్లినిక్‌లు వంటి చోట్ల జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని దేశంలోని ప్రత్యక్ష పన్నుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను శాఖను కోరింది.అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెరుగుతున్న పన్ను బకాయిలను రికవరీ చేయడానికి సమష్టి ప్రయత్నాలు చేపట్టాలని ఐటీ శాఖను సీబీడీటీ కోరింది. ఈ మేరకు సీబీడీటీ ఇటీవల సెంట్రల్ యాక్షన్ ప్లాన్ (CAP) 2024-25 అనే వార్షిక కార్యాచరణ ప్రణాళిక పత్రాన్ని విడుదల చేసింది.రూ.2 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్ రూపంలో ఆర్థిక సంస్థలు రిపోర్ట్ చేయాల్సి ఉన్నా అది జరగడం లేదని సీనియర్ అధికారులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఆ రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నప్పుడు ఈ నిబంధనల అతిక్రమణ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించామని సీబీడీటీ ఐటీ శాఖకు తెలిపింది.అలాగే సెక్షన్ 139A ప్రకారం నిర్దిష్ట లావాదేవీలలో పాన్ కార్డు నంబర్‌ అందించడం లేదా తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ దీన్ని నిర్ధారించే వ్యవస్థ లేదని సీబీడీటీ పేర్కొంది. ఏదైనా అధిక మొత్తంలో వ్యయాన్ని పన్ను చెల్లింపుదారు సమాచారంతో ధ్రవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

* దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (ఆగస్టు 17) భారీగా పెరిగాయి. పసిడి ధరల్లో క్రితం రోజున స్వల్ప కదలిక కనిపించగా నేడు ఒక్కసారిగా ఎగిశాయి. వెండి ధరలు సైతం ఒక్కసారిగా దూసుకెళ్లి కొత్త మార్కును తాకాయి. దీంతో ఈరోజు ఆభరణాలు కొనాలనుకున్నవారికి నిరాశ తప్పలేదు.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరీశీలిస్తే.. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.1050 పెరిగి రూ.66,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.1150 ఎగిసి రూ. 72,770 లను తాకింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే రీతిలో ధరలు పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలో అయితే 22 క్యారెట్ల బంగారం రూ.1050 ఎగిసి రూ.66,850 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ. 1150 పెరిగి రూ.72,920 లకు చేరుకుంది.

* ఫాక్స్‌కాన్‌ కంపెనీ భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించింది. ఈమేరకు కంపెనీ సీఈఓ యంగ్‌ లియు కర్ణాటకలో మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ ప్రారంభించేందుకు సీఎం సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’ పేరుతో ఫాక్స్‌కాన్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. అనంతరం ఐటీఐఆర్‌ ఇండస్ట్రీ ఏరియాలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఫాక్స్‌కాన్‌కు కేటాయించింది. ఈమేరకు భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై తాజాగా చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ..‘ఫాక్స్‌కాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం జతకట్టడం సంతోషంగా ఉంది. ఈ సహకారంతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్‌డీఎం) రంగంలో కర్ణాటక దేశ ఎగుమతుల్లో భాగమైంది. రాష్ట్రంలో సమర్థవంతమైన లాజిస్టిక్స్, విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ ఉంది. కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని లాభాలు పొందాలి. దాంతోపాటు రాష్ట్రానికి మేలు చేయాలని భావిస్తున్నాం. ఫాక్స్‌కాన్ తన ప్రాజెక్ట్‌లను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, భారీ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z