సాధారణంగా డబ్బును లక్ష్మిదేవితో పోలుస్తాం. లోకంలోని సమస్త ధనరాసికి దేవత ‘ఆమె’నే.. మరి అలాంటి లక్ష్మిదేవి పేరు మాత్రమే మహిళలకు మిగిలింది. దేశంలోని బ్యాంకు ఖాతాల్లో పురుషుల వద్దే అత్యధిక ధనం పోగుపడింది. ధన దేవత ‘లక్ష్మి’ పేరుండే మహిళల ఖాతాల్లో ఉన్నది కేవలం 21 శాతమే! నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన తాజా “మెన్ అండ్ విమెన్” నివేదిక ప్రకారం, దేశంలోని మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 20.8 శాతం లేదా దాదాపు ఐదవ వంతు మాత్రమే మహిళా ఖాతాదారులకు చెందినది. దేశంలో 91.77 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉంటే వీటిలో 36.4% మహిళల యాజమాన్యంలో ఉన్నాయి. దేశంలోని మొత్తం బ్యాంకు అకౌంట్లలో 187 లక్షల కోట్లు ఉండగా ఇందులో మహిళ ఖాతాల్లో ఉన్న మొత్తం కేవలం 39 లక్షల కోట్లు. దేశంలోని హిందూ అవిభాజ్య కుటుంబాలు, నివాసితులు, రైతులు, వ్యాపారులు, నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, వేతనజీవులు, ఇతరులు అందరి బ్యాంకు ఖాతాలను లెక్కలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. ఇక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విడివిడిగా గణాంకాలను పరిశీలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో మొత్తం డిపాజిట్లలో 16.5% లేదా 1.9 లక్షల కోట్లు మాత్రమే మహిళలకు చెందినవి. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఇది 30% లేదా రూ.5.91 లక్షల కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో జన్ ధన్ ఖాతాలు విస్తృతంగా విస్తరించడమే దీనికి కారణంగా చెప్పవచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z