Politics

యుక్రెయిన్ పర్యటనకు మోడి-NewsRoundup-Aug 19 2024

యుక్రెయిన్ పర్యటనకు మోడి-NewsRoundup-Aug 19 2024

* గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు. భూరికార్డులను తారుమారు చేశారని మండిపడ్డారు. ఎక్కడ చూసినా భూ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయని, త్వరలోనే గ్రామాలకు రెవెన్యూ అధికారులను పంపి వాటిని గ్రామసభల్లో పెడతామని చెప్పారు.తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రవాణా శాఖలో దోపిడీ కోసం 5 జోన్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. వాటిపై విచారణ చేపడతామన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండబోవని స్పష్టం చేశారు.

* రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో రైతుల అరెస్టు హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజాపాలన అంటూ అప్రజాస్వామిక విధానాలు పాటిస్తారా అని నిలదీశారు.

* ఝార్ఖండ్ ముక్తి మోర్చా నేత చంపాయీ సోరెన్‌ (Champai Soren) భాజపాలో చేరుతున్నారంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి జీతన్‌రామ్‌ మాంఝీ(Jitan Ram Manjhi) చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆయన్ను పులితో పోలుస్తూ కొనియాడారు. ‘‘చంపాయీ సోరెన్‌.. మీరు పులి. మీరు ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎన్డీయే ఫ్యామిలీలోకి స్వాగతం.’’ అని ఎక్స్ వేదికగా ఆ ఊహాగానాలకు బలం చేకూర్చేలా స్పందించారు.

* పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీసిటీలోని బిజినెస్‌ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, ఈ సంపద సంక్షేమానికి దోహదం చేస్తుందని చెప్పారు. ‘‘ 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను. భారత్‌ను ఐటీ.. ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పాను. గతంలో పీపీపీ విధానంలో హైటెక్‌ సిటీ చేపట్టాను. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు. ఇందులోని ప్రతి నలుగురిలో ఒక ఏపీ వ్యక్తి ఉంటారు. శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. సెజ్‌, డొమెస్టిక్‌ జోన్‌, ఫ్రీట్రేడ్‌ జోన్‌లు వచ్చాయి. 220 కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం ఉంది. ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యాం. ఆటోమేటివ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. 4.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, 4 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు సాధించడం చాలా గొప్ప విషయం’’ అని చంద్రబాబు తెలిపారు.

* కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ పాల్గొన్నారు.

* తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్‌ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. అక్టోబర్‌ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం వాహన సేవలు ఉంటాయని తెలిపింది.

వాహన సేవల వివరాలు :
04/10/2024 – సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

05/10/2024 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.

06/10/2024 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.

07/10/2024 – ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం.

08/10/2024 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం.

09/10/2024 – ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం.

10/10/2024 – ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం.

11/10/2024 – ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం.

12/10/2024 – ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ధ్వజావరోహణం.

* రష్యా దండయాత్రతో గత రెండేళ్లకు పైగా యుద్ధ భూమిలో నలిగిపోతున్న ఉక్రెయిన్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Ukraine Visit) పర్యటన ఖరారైంది. ఆగస్టు 23న ఆయన కీవ్‌ను సందర్శిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన పర్యటన అని తెలిపింది. ఉక్రెయిన్‌లో వివాదం పరిష్కరించేందుకు భారత్‌ ఎల్లప్పుడూ దౌత్యం, చర్చలను సమర్థిస్తుందని స్పష్టం చేసింది. ఆగస్టు 23న ప్రధాని మోదీ (PM Modi) ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ (Volodymyr Zelensky)తో భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం అంశంపైనా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఉక్రెయిన్‌ కంటే ముందు ప్రధాని పోలండ్‌లో పర్యటించనున్నారు.

* ఏపీలో భారీగా పెట్టుబడులకు ఫాక్స్‌కాన్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు మధ్య సూత్రప్రాయ ఒప్పందం జరిగింది. ఉండవల్లిలోని నివాసానికి వచ్చిన ఫాక్స్‌కాన్‌ బృందానికి లోకేశ్‌ స్వాగతం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను మంత్రి లోకేశ్‌ వారికి వివరించారు. త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్‌ పాలసీలు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమలకు రాయితీలు కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. ఏపీలో ఫాక్స్‌కాన్‌ మెగా మ్యానుఫ్యాక్చరింగ్‌ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేశ్‌ కోరారు. ఏపీలో ఎలక్ట్రానిక్‌ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్‌ హెల్త్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపోనెంట్స్‌ తయారీకి సంబంధించిన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.

* తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్‌ గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసినట్లేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాఖీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో అధికారం, పదవులు శాశ్వతం కాదన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్నిచాటేలా కేసీఆర్ సచివాలయాన్ని కడితే.. కాంగ్రెస్‌ సర్కారు రాజీవ్‌ విగ్రహం చేయడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు, రాజీవ్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. వందలమంది ప్రాణాలు తీసిన నాయకుడి విగ్రహం పెడతారా ? నిలదీశారు.

* ఐపీఎల్‌లో, టీమిండియాలో ఈమ‌ధ్య‌ ఎక్కువ‌గా మార్మోగిన పేరు రింకూ సింగ్ (Rinku Singh). ప‌ద‌హారో సీజ‌న్‌(IPL 2023)లో సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో ఈ చిచ్చ‌ర‌పిడుగు భార‌త జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. ఫినిష‌ర్‌గా త‌న మార్క్ ఇన్నింగ్స్‌లతో అల‌రించిన రింకూ.. శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న‌లో బంతితోనూ మ్యాజిక్ చేశాడు. దాంతో, 18వ సీజ‌న్‌లో కోల్‌క‌తా అత‌డిపై భారీ ఆశ‌లే పెట్టుకుంది. అయితే.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ ఆ ఫ్రాంచైజీకి హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు. ఒక‌వేళ త‌న‌ను కోల్‌క‌తా వ‌దిలేస్తే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Bengaluru)కు ఆడుతాన‌ని రింకూ చెప్పాడు. ప‌ద‌హారో సీజ‌న్‌లో శివాలెత్తిపోయిన రింకూ సింగ్‌కు 17వ సీజ‌న్‌లో చాన్స్‌లే రాలేదు. నాలుగైదు ఇన్నింగ్స్‌లు ఆడినా మ‌న‌ప‌టిలా చెల‌రేగ‌క‌పోయాడు. దాంతో, ఈసారి కోల్‌క‌తా అత‌డిని వ‌దిలేస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో, రింకూ కూడా కొత్త జ‌ట్టుకు మారేందుకు ఉత్సాహంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

* ఒలింపిక్స్ ప‌త‌కం చేజార్చుకున్న‌ భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫొగొట్ (Vinesh Phogat)కు స్వ‌దేశంలో ఊహించ‌నిరీతిలో స్వాగ‌తం ల‌భించింది. ఇక సొంత ఊరు బ‌లాలిలో పెద్ద‌లంతా క‌లిసి ఓ బంగారు ప‌త‌కాన్ని వినేశ్‌కు బ‌హుమ‌తిగా ఇచ్చారు. అదొక్క‌టే కాకుండా భారీ మొత్తంలో ఆమెకు కానుక‌లు అందాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు, కొన్ని కంపెనీలు, సంస్థ‌ల నుంచి ఆమెకు 16.35 కోట్లు బ‌హుమ‌తిగా అందాయ‌నే వ‌దంతులు వైర‌ల్ అవుతున్నాయి. అయితే.. ఆమె భ‌ర్త సోమ్‌వీర్ ర‌థీ (Somvir Rathee) ఎక్స్ వేదిక‌గా స్పందిస్తూ అదొక చీప్ ప‌బ్లిసిటీ అని అన్నాడు. ‘వినేశ్ ఫొగాట్‌వై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అబ‌ద్ద‌మే. చెప్పాలంటే అదొక చీప్ ప‌బ్లిసిటీ. వాటితో మాకు న‌ష్టం వాటిల్ల‌డ‌మే కాకుండా స‌మాజిక విలువ‌ల‌కు కూడా న‌ష్ట‌మే. మా శ్రేయోభిలాషులకు ఓ విజ్ఞ‌ప్తి. ద‌య‌చేసి అలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌కండి’ అని సోమ్‌వీర్ తెలిపాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z