* ఏడాది కాలంగా విజయనగరం నుంచి దిల్లీకి గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్ విల్లాలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌తోపాటు దిల్లీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సంవత్సర కాలంగా దిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. మేరఠ్‌కు చెందిన మహ్మద్ వసీం అరకులోయలోని విశ్వనాథం నుంచి గంజాయి కొనుగోలు చేసి.. అలాం ఖుర్షీద్ ద్వారా దిల్లీకి రవాణా చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు కబీర్.. దిల్లీ నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో మరో ఐదుగురి పాత్ర ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరిని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ముగ్గురు నిందితులూ ఎవరికీ అనుమానం రాకుండా విజయనగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకొని.. గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు వకుల్ తెలిపారు. వారి నుంచి 22 కిలోల గంజాయితోపాటు.. రవాణాకు వినియోగిస్తున్న వస్తువులు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
* మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు తీవ్రమయ్యాయి. కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన మరువక ముందే పలు లైంగిక దాడుల ఉదంతాలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలోని థానే స్కూల్‌లో మూడేండ్ల వయసు కలిగిన ఇద్దరు బాలికలపై స్కూల్ క్లీనింగ్ సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆగస్ట్ 12-13 తేదీల్లో చిన్నారులు స్కూల్ వాష్‌రూంకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరగ్గా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. థానే జిల్లా బద్లాపూర్‌లో ఈ ఉదంతం వెలుగుచూసింది. నిందితుడు అక్షయ్ షిండేను కోర్టు మూడు రోజుల పోలీస్ రిమాండ్‌కు తరలించింది. బాలికల తల్లితండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
* కోల్‌కతా ప్రభుత్వ దవాఖానలో డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి, హత్యపై నిరసనలు వెల్లువెత్తుతుంటే ముంబైలోనూ ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మీద దాడి చేసిన ఘటనపై ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ దవాఖాన క్యాజువాలిటీ వార్డులో ఆదివారం తెల్లవారుజామున ఒక రోగి చెవి నుంచి వస్తున్న రక్తాన్ని ఆమె క్లీన్ చేస్తున్నప్పుడు వీరు దాడి చేశారు. మహిళా వైద్యురాలితో వారు వాగ్వాదానికి దిగారని సియాన్ పోలీసు స్టేషన్ అధికారి చెప్పారు. రోగితోపాటు వచ్చిన ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆ వైద్యురాలిపై దాడికి ప్రయత్నించారని దవాఖాన సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరారన్నారు.
* కులాలు వేరైనా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది. కూలీ పనులు చేసుకుంటూ సాఫీగా సంసార జీవితం సాగిస్తున్న ఆ దంపతులను విద్యుత్ షాక్ పగబట్టినట్లు కాటేసింది. నిమిషాల వ్యవధిలో ఇద్దరిని బలిగొంది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్వాపురం గ్రామానికి చెందిన బానోతు శ్రీను(42), షమీన(40)లు దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కుమార్తె ప్రియాంక జన్మించింది. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఉదయం బట్టలు ఉతికిన షమీన ఇంటి ముందున్న ఇనుప తీగ(దండెం)పై ఆరేస్తుండగా.. ఆ తీగకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌తో అక్కడికక్కడే పడిపోయింది. అదే సమయంలో వారి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి షమీన కిందపడి ఉండటాన్ని గమనించి ఇంట్లో ఉన్న ఆమె భర్త శ్రీనుకు చెప్పాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షమీన అప్పుడప్పుడు స్పృహతప్పి పడిపోతూ ఉండేది. అలాగే పడిపోయిందనుకున్న శ్రీను తన భార్యను లేపేందుకు యత్నించాడు. దీంతో అతడికి కూడా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన శ్రీను స్నేహితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ దంపతులను వెంటనే ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రాఖీ పౌర్ణమి రోజు భార్యభర్తలిద్దరూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుమార్తె ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై రాజారాం తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z