* అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రమాదం చోటుచేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
* రాత్రి వేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఆ మెసేజ్‌తో తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 1091, 78370 18555 నంబర్‌కు ఫోన్ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తుందనేది అందులోని సారాంశం. దీనిపై హైదరాబాద్ పోలీసులు వివరణ ఇచ్చారు. రాత్రి వేళల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరిట జరుగుతున్నది తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు.
* తిహాడ్ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కవిత వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దిల్లీ మద్యం కేసులో ఆమె తిహాడ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
* చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. చిరు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆయన త్రిశూలం చేత పట్టుకుని కన్పించారు. ‘‘చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు, ఒక అద్భుతమైన తార పోరాడటానికి ప్రకాశిస్తుంది’’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.
* ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. యుద్ధక్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు తాము మద్దతు తెలుపుతామన్నారు. పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భేటీ అయిన తర్వాత మీడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
* ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ఆచార్య కోదండరామ్.. తనకు కేటాయించిన సెక్యూరిటీని నిరాకరిచారు. తాను ప్రజల మనిషినని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు. సెక్యూరిటీ వల్ల ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా తనకు తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. భద్రతా సిబ్బంది ఉంటే ప్రజలు తన వద్దకు రాకుండా నిలువరించే ప్రమాదం లేకపోలేదన్నారు.
* తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలకు కొత్త షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ (TGPSC) గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ, డీఎస్సీ, గ్రూప్ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్‌కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించిన టీజీపీఎస్సీ.. తాజాగా పరీక్షల షెడ్యూల్‌ని విడుదల చేసింది. మొత్తం 783 గ్రూప్- 2 పోస్టులకు 5.51లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
* భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా ఆ దేశంలో 2021లో ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. దీనిని 2-2తో సమంగా పంచుకున్నాయి. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. ఇప్పుడీ సిరీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నాలుగో సైకిల్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌కూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. జూన్-జులై 2025 మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.
షెడ్యూల్ ఇదే..
తొలి టెస్ట్ – 2025 జూన్ 20 నుంచి 24, వేదిక: లీడ్స్
రెండో టెస్ట్ – 2025 జులై 2 నుంచి 6, వేదిక: బర్మింగ్‌హామ్
మూడో టెస్ట్ – 2025 జులై 10 నుంచి 14, వేదిక: లండన్
నాలుగో టెస్ట్ – 2025 జులై 23 నుంచి 27, వేదిక: మాంచెస్టర్
ఐదో టెస్ట్ – 2025 జులై 31 నుంచి ఆగస్ట్ 4, వేదిక: లండన్
* మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్‌పోర్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన ఈ దౌత్య పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలు వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉంటుంది.
* దళపతిగా సినీరంగంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ (Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam)’ పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించి జెండాను కూడా ఆవిష్కరించారు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ ఈ జెండాను ఎగురవేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ పువ్వును విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు.
* మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ (Hema Committee) నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ కమిటీని ఉద్దేశించి నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) తాజాగా మాట్లాడారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమాజంలో మహిళలకు సరైన చోటు లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకున్నారు. హేమ కమిటీ రిపోర్ట్ గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పిన ఆమె.. సమాజంలో మహిళలకు సమానత్వం ఉండాలని తెలిపారు. అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z