Food

నాంపల్లిలో హోటల్ నిర్వాకం…పచ్చడిలో బల్లి-CrimeNews-Aug 22 2024

నాంపల్లిలో హోటల్ నిర్వాకం…పచ్చడిలో బల్లి-CrimeNews-Aug 22 2024

* ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద చోరీ సొత్తుతో పరారవుతున్న లారీ క్లీనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.18.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నందిగామ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని ఏసీపీ రవికిరణ్‌ మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ఏసీపీ కేసు వివరాలను వెల్లడించారు. ‘‘తెలంగాణలోని మధిర నుంచి ఈనెల 17న లారీలో 300 బస్తాల మిర్చిని ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ తీసుకెళ్లారు. అక్కడ విక్రయించిన అనంతరం లారీ డ్రైవర్‌ షేక్‌ ఖయ్యూం ఆ డబ్బు తీసుకుని క్లీనర్‌ పల్లెపోగు కోటేశ్వరరావుతో కలిసి బయల్దేరాడు. అనంతరం క్లీనర్‌ రూ.18.52లక్షలతో పరారయ్యాడు. దీంతో నందిగామ పోలీసులకు లారీ డ్రైవర్‌ ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వాహనాల తనిఖీ చేపట్టారు. నందిగామ ఆటో స్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా ఉన్న క్లీనర్‌ కోటేశ్వరరావును పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్‌ చేశారు’’ అని ఏసీపీ తెలిపారు.

* విజయనగరం జిల్లాలో ఇద్దరు బంగారం వర్కర్లపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ముఖంపై కారం చల్లి రాడ్డుతో కొట్టారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో బంగారం వర్కర్ల చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై విజయనగరం నుంచి రాజాం వెళ్తుండగా గరివిడి మండలం అప్పనవలస సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులను చూడగానే చేతిలో ఉన్న 50 గ్రాముల బంగారాన్ని వర్కర్లు తుప్పల్లోపడేశారు. వారి వద్ద ఉన్న రెండు మొబైల్‌ ఫోన్లు, కొంత నగదుతో దుండగులు పరారయ్యారు. ఘటనాస్థలానికి రాజాం, గరివిడి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.

* ప్రియుడితో గొడవపడిన మహిళ బిల్డింగ్‌ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా మరణించింది. (Woman Jumps From Building) ఈ నేపథ్యంలో ఆ మహిళ బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల మహిళ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నది. ప్రయాగ్‌రాజ్‌లోని అల్లాపూర్‌ ప్రాంతంలో ఆమె నివసిస్తున్నది. ఈ నెల 20న ప్రియుడు సౌరభ్ సింగ్‌తో గొడవపడిన ఆమె కోచింగ్‌ సెంటర్‌ బిల్డింగ్‌ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

* తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్న భక్తులకు నగరంలో అపశృతి చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో బల్లిపడిన వంటకాన్ని తిని వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రకు చెందిన 30 మంది భక్తులు దైవదర్శనం కోసం ఇటీవల తిరుపతికి వెళ్లారు. దర్శనం అనంతరం రైలులో మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయాన్నే హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుండి పూర్ణా ప్యాసింజర్‌ రైలులో సొంతూరు వెళ్లాల్సి ఉంది. మంగళవారం రాత్రి నగరంలోనే బస చేయడంతో రైల్వే స్టేషన్‌కు చేరువలో ఉండే మహేష్‌ రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేశారు. 30 మంది ఒకేసారి భోజనాలు చేస్తుండగా ఊరగాయ(పికిల్‌)లో చనిపోయిన బల్లిని చూశారు. అన్నంలో ఊరగాయను వేసుకుని కలుపుతుండగా ఓ భక్తుడి చేతికి బల్లి తగిలింది. దీంతో అతడక్కడే వాంతులు చేసుకున్నారు. ఈ క్రమంలో మిగతా వారూ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా త్వరగానే కోలుకోవడంతో తిరిగి ఉదయాన్నే హైదరాబాదు రైల్వే స్టేషన్‌కు చేరుకుని పూర్ణా ప్యాసింజర్‌ రైలులో తిరుగుపయనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మహేష్‌ హోటల్‌ను రాత్రి మూసివేయించారు. హోటల్‌ సిబ్బందిని, యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

* మద్యం మత్తులో ఓ వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పార్వతీపురంనకు చెందిన బావిరి రాము (53)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్‌లో ఉంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. 15 రోజుల క్రితం కూడా రాము మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సోమవారం ఉదయం మద్యం మత్తులో స్థానిక ఎల్లమ్మ పోచమ్మ గుడి వద్ద ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి కిందికి దూకి మృతి చెందాడు. మృతుడి కుమారుడు జైకుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రాము వాటర్‌ ట్యాంక్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z