* ముంబయికి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు రూ.15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించి సెల్ఫీలు దిగారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం.
* కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3 పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతం మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలు, మండలాలకు నెట్‌వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమన్నారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
* సినీనటి హేమపై (Actress hema) విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిర్ణయం తీసుకుంది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. గత కొన్ని రోజుల కిందట బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు. హేమను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి మీడియాకు ముందుకు వచ్చిన హేమ.. మీడియాలో వస్తున్న నిరాధారమైన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, తనని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నట్లు నివేదికలు సమర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘మా’ అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖతో పాటు, మెడికల్ సర్టిఫికెట్‌లను పంపారు. హేమ పంపిన ఆధారాలను పరిశీలించిన ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి, ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
* మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సస్ సర్వే చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. స్కిల్ సెన్సస్ సర్వేపై అధికారులతో ఉండవల్లిలోని నివాసంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘‘యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, స్కిల్ ప్రొఫైల్స్‌ను స్కిల్ సెన్సస్‌లో క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేయాలి. విద్య, నైపుణ్య అర్హతలు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలి. ప్రముఖ కంపెనీలు ఆ ప్రొఫైల్స్‌ని నేరుగా చూసేలా యాక్సెస్ ఇస్తాం. తద్వారా ఆయా కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి వస్తుంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన.. ఈ రెండు అంశాలే నైపుణ్య గణన అంతిమ లక్ష్యం. అర్థవంతంగా ఉండాలి.. అపోహలకు గురిచేసే ప్రశ్నలు అడగవద్దు’’ అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
* ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం అన్నివిధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. యుద్ధం కొనసాగుతోన్న వేళ ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అనేక విషయాలపై చర్చించినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు భాగస్వామ్య పక్షాల మధ్య వాస్తవిక సంప్రదింపులు అవసరమని పునరుద్ఘాటించినట్లు పేర్కొంది.
* టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్ల మ్యాచ్ కనీస ఫీజును పెంచడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లవైపు యువ క్రికెటర్లు మొగ్గుచూపుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని భోగట్టా. క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు బీసీసీఐ (BCCI) కార్యదర్శి జై షా, ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) మద్దతు కూడా ఉందని సమాచారం. ఈ ఫండ్‌తో మూడు సంపన్న క్రికెట్ దేశాలు.. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్ల జీతంలో ఎలాంటి మార్పూ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆయా దేశాలు తమ ఆటగాళ్లకు తగినంత జీతాలను అందిస్తున్నాయి. అయితే, ఐసీసీ నుంచి టెస్ట్ క్రికెట్ కోసం ఐసీసీ దగ్గర ఎంత డబ్బు అందుబాటులో ఉందనేది బ్రాడ్‌కాస్టర్ స్టార్‌తో ఉన్న వివాదంపై ఆధారపడి ఉంటుంది. 2022లో ఐసీసీతో చేసుకున్న ప్రసార ఒప్పందాన్ని పునః సమీక్ష చేయించాలని బ్రాడ్‌కాస్టర్ స్టార్ అనుకుంటోంది. ప్రస్తుతం ప్రసార హక్కుల మూడు బిలియన్ డాలర్లకు పైగా ఉండగా.. దాన్ని సగానికి తగ్గించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.
* అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఘటనపై వెంటనే స్పందించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలిచినప్పటికీ.. కూటమి ప్రభుత్వంపై వైకాపా నేతలు నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నా చేస్తానని జగన్ ప్రకటించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు? వైకాపా హయాంలో ప్రజలు పరిహారం కోసం రోడ్డెక్కి ధర్నా చేశారని గుర్తు చేశారు.
* విశాఖ సీఆర్‌జడ్ ప్రాంతంలో నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‌జడ్ -1 ప్రాంతంలో కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
* అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా కమలా హారీస్‌ను ఆయన ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన ట్రంప్ కంటే చిన్నవాడినని పేర్కొన్నారు.
* పల్నాడు జిల్లాలోని మాచర్ల మున్సిపాలిటీని తెదేపా కైవసం చేసుకుంది. వైకాపా నుంచి 16 మంది కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరారు. కొత్త కౌన్సిల్ ఏర్పాటుకు వీలుగా వారం క్రితం ఛైర్మన్ ఏసోబు రాజీనామా చేశారు. దీంతో వైస్ ఛైర్మన్‌గా ఉన్న పోలూరు నరసింహారావును నేడు కౌన్సిలర్లు ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. అనంతరం ఛైర్మన్‌గా నరసింహారావు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఆయన తెదేపాలో చేరారు.
* తమ సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రుణమాఫీపై చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరితే స్పందించలేదన్నారు. రుణమాఫీపై వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌తో పాటు పలువురు భారాస నాయకులు డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. గురువారం తిరుమలగిరిలో భారాస ధర్నా శిబిరంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. శిబిరాన్ని పోలీసులే తొలగించారని ఆరోపించారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిందని డీజీపీకి చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z