* భారతీయ రైల్వే (Indian railways) కీలక నిర్ణయం తీసుకుంది. తన రిక్రూట్మెంట్ పోర్టల్‌ను డిజీలాకర్‌తో (DigiLocker) అనుసంధానం చేసింది. తద్వారా నియామక ప్రక్రియ సమయాన్ని తగ్గించాలని చూస్తోంది. ప్రస్తుతం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పడుతున్న ఈ సమయాన్ని ఆరు నెలలకు తగ్గించేందుకు వీలుపడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే ఎప్పుడు నియామకాలు చేపట్టినా లక్షలాది మంది దరఖాస్తు చేస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కొందరు నకిలీ సర్టిఫికెట్లను కూడా జత చేస్తుంటూ ఉంటారు. ఈ ఏరివేత కార్యక్రమం చేపట్టి నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి రైల్వే బోర్డుకు కొన్ని నెలల సమయం తీసుకుంటోంది.
* తమ అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వన్97 కమ్యూనికేషన్స్‌కు (పేటీఎం మాతృ సంస్థ) ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభించింది. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత భాగస్వాములకు మాత్రం పేమెంట్ అగ్రిగేషన్ సర్వీసులు అందించేందుకు అనుమతిచ్చింది. ఈ విషయాన్ని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వన్97 కమ్యూనికేషన్స్ పేర్కొంది.
* మీడియాలో అతిపెద్ద విలీనం విషయంలో మరో ముందడుగు పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ (Reliance-Disney India merger) మధ్య కుదిరిన మీడియా వ్యాపార విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోద ముద్ర వేసింది. విలీనానికి సంబంధించి ఆరు నెలల క్రితమే ఇరు సంస్థలు ప్రకటన చేయగా.. తాజాగా సీసీఐ ఆమోదం ముద్ర వేసింది. చిన్నపాటి మార్పులతో డీల్‌కు ఆమోదం తెలిపినట్లు సీసీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
* ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల డేటాను అందించడానికి ఏథర్ ఎనర్జీ..గూగుల్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఈ రోజు(బుధవారం) ప్రకటించింది. వినియోగదారులు గూగుల్ మ్యాప్స్ ద్వారా ‘ఏథర్ గ్రిడ్’ ఫాస్ట్ ఛార్జర్లను గుర్తించవచ్చు. ఈ సహకారం వల్ల లైట్ ఎలక్ట్రిక్ కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్ – LECCS(అధికారిక భారతీయ ఈవీ ఛార్జింగ్ కనెక్టర్ స్టాండర్డ్) ఉన్న ఈవీ వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాల కోసం ‘ఏథర్ గ్రిడ్’ ఫాస్ట్ ఛార్జర్లను గూగుల్‌లో పూర్తి లైవ్ స్టేటస్ అప్డేట్లతో కనుగొనడానికి అనుమతిస్తుంది. కొత్త ఛార్జర్‌ను ఇన్స్టాల్ చేసినప్పుడల్లా, అది గూగుల్ మ్యాప్స్‌లో కూడా లిస్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఏథర్ గ్రిడ్‌కు సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్..దేశీయంగా అభివృద్ధి చేసిన LECCSపై ఆధారపడి ఉంది. దీన్ని ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ దేశవ్యాప్తంగా ఆమోదించిందని ఏథర్ ఎనర్జీ తెలిపింది. 2024, మార్చి 30 నాటికి 1,973 ఫాస్ట్ ఛార్జర్లు ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని ఏథర్ ఎనర్జీ తెలిపింది.
* ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ ఉద్యోగులు చేసే ఆర్డర్ల కోసం జొమాటో ఫర్ ఎంటర్ప్రైజెస్ (ZFE) పేరిట కొత్త సేవలను ప్రారంభించింది. జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సదపాయం కంపెనీల ఆహార వ్యయ నిర్వహణను సులభతరం చేస్తుందని గోయల్ పేర్కొన్నారు. జొమాటోకు వచ్చే వాటిలో కార్పొరేట్ ఉద్యోగులు చేసే బిజినెస్ ఆర్డర్లే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయని గోయల్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్ల విషయంలో ముందుగా ఆహార ఖర్చును ఉద్యోగులు చెల్లిస్తే.. కంపెనీలు రీయింబర్స్ చేస్తుంటాయని చెప్పారు. దీనివల్ల కొంత గందరగోళం, కాలయాపన జరుగుతోందని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలకు తమ కొత్త సేవలతో చెక్ పెట్టొచ్చని గోయల్ తెలిపారు. ఇప్పటికే 100 టాప్ కంపెనీలు ఈ సేవలను వినియోగించుకున్నాయని, ఆయా సంస్థలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ సేవలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 25,129.60 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకిన నిఫ్టీ.. తర్వాత అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభాలకే పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లూ ఇంట్రాడేలో మోస్తరుగానే చలించాయి. సెన్సెక్స్ ఉదయం 81,779.84 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,711.76) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నా తర్వాత లాభాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 82,039.26 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 73.80 పాయింట్ల లాభపడి 81,785.56 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 34.60 పాయింట్లు లాభంతో 25,052.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.96గా ఉంది. సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడగా.. ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 78.71 డాలర్లు, బంగారం ఔన్సు 2,542 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z