Devotional

టొకెన్ లేకపోతే ఆధార్ ఉంటేనే తితిదే లడ్డూలు-NewsRoundup-Aug 29 2024

టొకెన్ లేకపోతే ఆధార్ ఉంటేనే తితిదే లడ్డూలు-NewsRoundup-Aug 29 2024

* ఎంపాక్స్‌ (మంకీపాక్స్‌) వ్యాధి నిర్ధారణకు ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ అభివృద్ధి చేసిన ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ ‘ఎర్బాఎండీఎక్స్‌’ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మెడ్‌టెక్‌ తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి దీన్ని తయారు చేసింది. ఈ విషయాన్ని సీఎం ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌.. ప్రపంచవేదికపై ‘మేక్‌ఇన్‌ ఏపీ’ ఖ్యాతిని ఘనంగా చాటుతోందన్నారు. ఈ కిట్‌ తయారీ బృందాన్ని సీఎం అభినందించారు. కిట్‌లోని లయోఫయలైజ్డ్‌ కాంపోనెంట్స్‌ రవాణాకు అనుకూలంగా ఉన్నాయని, అంటువ్యాధుల్ని సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ సన్నద్ధతను ఈ కిట్‌ చాటుతోందని పేర్కొన్నారు.

* బాలీవుడ్‌ ప్రముఖ నటి, భాజపా (BJP) ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) రైతుల నిరసనలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కంగనా తీరుపై ప్రతిపక్షాలు మండిపడడంతో పాటు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఆమెపై పంజాబ్‌ మాజీ ఎంపీ, శిరోమణి అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) నేత సిమ్రాన్‌జీత్‌సింగ్‌ మాన్‌ (Simranjit Singh Mann) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కంగనాపై ఈ సందర్భంగా మాన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిని పంజాబ్‌ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. మహిళను అవమానించినట్లేనని.. తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కంగనా బృందం స్పందిస్తూ.. అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైందని ఆవేదన వ్యక్తంచేసింది. కాగా.. కంగనా రైతుల నిరసనలపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన సొంత పార్టీ ఆమెను మందలించిన సంగతి తెలిసిందే. పార్టీ విధానంపై మాట్లాడే అధికారం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రకటనలు చేసేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని.. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయవొద్దని ఆదేశించింది.

* శ్రద్ధాకపూర్‌, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ హారర్‌ మూవీ ‘స్త్రీ 2’ (Stree 2). ఇందులో సర్కటగా కనిపించి ప్రేక్షకులను భయానికి గురి చేశాడు నటుడు సునీల్‌కుమార్‌ (Sunil Kumar). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న తాను అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టానని చెప్పారు. 7.7 అడుగుల ఎత్తు ఉండటం వల్లే తనకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయని అన్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కు డూప్‌గా వర్క్‌ చేశానని తెలిపారు. తనపై యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించారన్నారు.

* హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకొని డబ్బులు అడుగుతున్నట్లు తెలిసిందన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని, కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులపై కూడా ఫిర్యాదులు వచ్చాయని సీఎం చెప్పారు. అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులను సీఎం ఆదేశించారు.

* సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి ‘హైడ్రా’ అధికారులు నోటీసులు అంటించారు. మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఆయన నివాసముంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నోటీసులు అంటించారు. మరో వైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు.

* మలయాళ చిత్ర పరిశ్రమలోని (Mollywood) పలువురు వ్యక్తుల వల్ల తాను గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటి మిను ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆమె తనకు న్యాయం కావాలని కోరారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. ‘‘పని ప్రదేశాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలి. వారికి అన్ని విధాలా రక్షణ కల్పించాలి. కొన్ని విషయాల్లో మహిళలను ఒత్తిడికి గురి చేయకూడదు. స్త్రీలను ఎలా గౌరవించాలో వారు తెలుసుకోవాలి. ఇండస్ట్రీకి చెందిన మరికొంతమంది మహిళలు రానున్న రోజుల్లోనైనా ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైన సమస్యలు చెబుతారని అనుకుంటున్నా. ఇలాంటి ఘటనలకు పాల్పడిన నిందితులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా’’ అని మిను తెలిపారు. అనంతరం ఆమె ‘అమ్మ’కు మోహన్‌లాల్‌ రాజీనామా చేయడంపైనా స్పందించారు. ఆ బాధ్యతలు చేపట్టే సామర్థ్యం నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు ఉందని ఆమె తెలియజేశారు.

* హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్‌ కేసులకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్‌ కమిషనర్‌కు హైడ్రా సిఫారసు చేసింది. హెచ్‌ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం.

* జలవనరులశాఖ మెకానికల్‌ విభాగం సలహాదారుగా కన్నయ్య నాయుడుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్‌ గేట్లు, హ్యాండ్లింగ్‌ ఎక్విప్‌మెంట్‌ విషయాల్లో ఆయన సలహాదారుగా ఉంటారు. ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్టు గేట్‌ ఏర్పాటు ప్రక్రియలో కన్నయ్య నాయుడు కీలకపాత్ర పోషించారు. ఏపీలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల విషయమై ప్రభుత్వం ఆందోళనలో ఉంది. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు సహా గేట్ల నిర్వహణ విషయంలో కన్నయ్య సలహాలను ప్రభుత్వం స్వీకరించనుంది. తుంగభద్ర ప్రాజెక్టు గేట్ బిగింపునకు కన్నయ్య అందించిన సేవలను గుర్తించి ఇటీవలే సీఎం చంద్రబాబు సన్మానించారు.

* శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. అపోహలు, అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదం బ్లాక్‌ మార్కెట్‌, దళారులను అరికట్టేందుకు చిన్న మార్పు చేసినట్టు చెప్పారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్‌ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని తెలిపారు. దర్శన టికెట్‌, టోకెన్‌ కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూలు విక్రయిస్తామని వెల్లడించారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగా లడ్డూ విక్రయ విధానం కొనసాగుతుందన్నారు.

* జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన (Kolkata Doctor Rape and Murder) పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై విపక్షాలు, పలు సంఘాలు చేస్తోన్న నిరసనలతో మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. ఈ సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌కు పిలుపునిచ్చింది. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది.

* కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar)కు ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో విచారణను కొనసాగించే విషయంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 47వ వార్షిక సాధారణ సమావేశం (Reliance AGM 2024) గురువారం జరిగింది. ఇందులో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ (Nita Ambani) ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల తమ కుటుంబంలోకి వచ్చిన చిన్న కోడలు రాధికా మర్చెంట్‌ (Radhika Merchant) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమెను రిలయన్స్‌ కుటుంబంలోకి స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

* 90 రోజుల్లో సీఆర్‌డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలన్నారు. ఏఐ, అమరావతిని కలిపి ఆంగ్లంలో లోగో రూపొందించాలని సూచించారు.

* రాజ్యసభ సభ్యత్వానికి వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. దిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలు సమర్పించారు. వైకాపాకు కూడా రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. తెదేపాలో చేరుతున్నట్లు ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. బీద మస్తాన్‌రావు కూడా అదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

* సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలుగా భారత్‌ జోడో యాత్రను చేపట్టింది. అయితే ఈసారి రాహుల్.. డోజో యాత్ర గురించి వెల్లడించారు. త్వరలో డోజో యాత్ర(Bharat Dojo Yatra) అంటూ ఒక వీడియోను షేర్ చేశారు.

* అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam adani) భారత అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీని (Mukesh ambani) దాటేసి తొలి స్థానం దక్కించుకున్నారు. ఈమేరకు హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ను (Hurun India Rich List) వెలువరించింది.

* భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఎర్రవల్లిలోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్నారు. దిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో తిహాడ్‌ జైలు నుంచి విడుదలైన ఆమె.. గురువారం కేసీఆర్‌ వద్దకు వచ్చారు. ఇక్కడ ఆమెకు ఆత్మీయ ఆహ్వానం లభించింది. కుమార్తెను చూడగానే అక్కున చేర్చుకుని కేసీఆర్ (KCR) సంతోషం వ్యక్తం చేశారు. తండ్రి కేసీఆర్‌ పాదాలకు నమస్కరించి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z