Editorials

బెజవాడ ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలి-NewsRoundup-Sep 04 2024

బెజవాడ ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలి-NewsRoundup-Sep 04 2024

* విపత్తు సమయంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (pawan Kalyan) తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుడమేరులోని 90 శాతం ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని పవన్‌ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ వయసులోనూ జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు. ఆయన్ను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదని వైకాపా నేతలను ఉద్దేశించి హితవు పలికారు. వైకాపా నేతలు ముందు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని.. ఆ తర్వాతే ఆరోపణలు చేయాలన్నారు.

* అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఆయన కొత్త పుస్తకం ‘సేవ్‌ అమెరికా’(Save America) కూడా హవా చూపిస్తోంది. విడుదలైన కొద్దిగంటల్లోనే అమెజాన్ బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. 92.06 డాలర్ల భారీ ధర ఉన్నప్పటికీ.. అమెజాన్‌లో ‘ప్రెసిడెంట్స్‌ అండ్‌ హెడ్స్‌ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీస్‌’ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. మొత్తంగా 13వ స్థానంలో ఉంది.

* విజయవాడ ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. గురువారం సింగ్‌నగర్‌ ప్రాంతంలో పర్యటించిన ఆమె.. వరద బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరారు. వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం మంచి విషయమన్నారు. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో హైడ్రా మాదిరి.. బుడమేరు ఆక్రమణలు తొలగించాలని సూచించారు.

* తాను సంగీత దర్శకుడిగా వర్క్‌ చేస్తున్న ఒక చిత్రాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సంగీత దర్శకుడు తమన్‌ (Thaman). ఈ నెలలో అప్‌డేట్‌ తప్పక ఉంటుందని.. అది తప్పకుండా బ్లాస్ట్‌ క్రియేట్‌ చేస్తుందని ఆయన చెప్పారు. ఇదే నేపథ్యంలో నెగటివ్‌ కామెంట్స్ చేసేవారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, నెగటివ్‌ ట్రెండ్స్‌ వల్ల ఉపయోగం ఏంటి. ఇలాంటి వాటివల్ల ఒక సినిమా, దాని గొప్పతనం దెబ్బతింటుంది. మా టెక్నికల్ టీమ్ గత రెండు సంవత్సరాల నుండి మంచి కంటెంట్‌ను అద్భుతమైన రీతిలో మీకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభిమానులందరికీ నా విన్నపం ఒక్కటే. దయచేసి మాకు కాస్త పాజిటివ్‌ ఎనర్జీ అందించండి. మేకింగ్‌, చిత్రీకరణ దశలో ఎలాంటి అద్భుతమైన అనుభూతిని పొందామో మీకు కూడా అదే విధమైన ఆనందాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నిర్మాతలు, నటీనటులు, టెక్నిషియన్స్‌ అందరూ..తమ డబ్బు, సమయం దీని కోసం వెచ్చించారు. మీ కామెంట్స్‌ మమ్మల్ని, సినిమాకు ఉన్న ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. మేము మరింత స్ట్రాంగ్‌గా వస్తాం. మా తదుపరి అప్‌డేట్‌తో మేము తప్పక బ్లాస్ట్‌ క్రియేట్‌ చేస్తాం. ఈ నెలలోనే ఆ అప్‌డేట్‌ ఉండవచ్చు’’ అని తమన్‌ తాజాగా పోస్ట్‌ పెట్టారు.

* నగరంలోని రాజరాజేశ్వరిపేటలో బుధవారం సాయంత్రం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకొచ్చారని బాధితులు బొత్సను నిలదీశారు. సాయం అందకుండా అడ్డుపడుతున్నారంటూ వైకాపా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఏం సాయం చేశారని మహిళలు ప్రశ్నించారు. అధికారంలో లేనోళ్లం ఏటి సేత్తాం అంటూ.. మహిళలకు సమాధానం చెప్పలేక బొత్స వెనుదిరిగారు.

* వాల్‌మార్ట్‌కు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. పండగల సీజన్‌ వేళ నిర్వహించే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ (The Big Billion Days 2024) సందర్భంగా లక్ష ఉద్యోగాల సృష్టించబోతున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. బిగ్ బిలియన్‌ డేస్ కోసం కొత్తగా 9 నగరాల్లో కొత్తగా 11 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు కూడా ప్రారంభించామని, దీంతో వీటి సంఖ్య 83కు చేరినట్లు పేర్కొంది. దేశ సామాజిక ఆర్థిక వృద్ధికి చేయూతలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా సప్లయ్‌ చైన్‌ విభాగంలో 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. దీనివల్ల ఈ పండగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడడంతో పాటు స్థానిక కమ్యూనిటీకి ఉపాధి లభిస్తాయని తెలిపింది.

* నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాలుగో రోజు పర్యటించారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో జేసీబీలో ప్రయాణిస్తూ వరద బాధితులను పరామర్శించారు. ఆహారం, తాగునీరు అందుతుందా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా ఇస్తూ పర్యటన కొనసాగించారు. మరోవైపు వరద తగ్గడంతో బురద తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఫైరింజన్లు, పొక్లెయినర్లు, టిప్పర్ల సాయంతో వ్యర్థాలను తొలగిస్తున్నారు.

* ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్‌ నెల జీతంలో ఒక రోజు బేసిక్‌ పే ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. పెన్షనర్లు కూడా ఈ విరాళంలో భాగమైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని జేఏసీ నేతలు కేవి శివారెడ్డి, విద్యాసాగర్‌ తదితరులు బుధవారం సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. వరద సహాయం నిమిత్తం మొత్తం 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు విరాళం అందించారు.

* మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా)లో అక్రమాల వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శివమొగ్గలో మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప(Yediyurappa) మాట్లాడారు. హైకోర్టు తీర్పు వెల్లడికాక ముందే సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) గౌరవంగా తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ వ్యవహారంపై సీఎంను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ అనుమతించడంపై కోర్టు తీర్పు తర్వాత సిద్ధరామయ్య రాజీనామా చేసే పరిస్థితి వస్తుందని తెలిపారు.

* బుడమేరుకు గండి పడిన నేపథ్యంలో అక్కడ పరిస్థితిని పరిశీలించేందుకు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. బుడమేరుకు గండి పడిన ప్రదేశంలో మంత్రి నిమ్మలతో కలిసి ఆయన పర్యటించారు. గండి పూడ్చే పనులను స్వయంగా పరిశీలించారు. బుడమేరుకు మళ్లీ క్రమంగా వరద పెరుగుతోంది. మంగళవారం సుమారు వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ బుధవారం ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో మరో అడుగు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు. మిగతా 2 గండ్లు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి. పెరుగుతున్న వరద ప్రవాహంతో పనులకు ఆటకం కలుగుతోంది. మంత్రులు నారా లోకేశ్‌, నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ ప్రవాహం పెరుగుతుందని స్థానికులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మిగిలిన గండ్లు పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలని నిమ్మల రామానాయుడిని లోకేశ్‌ కోరారు. క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షించాలన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z