Business

ఇక ఏ బ్యాంకు నుండైనా పింఛన్ తీసుకోవచ్చు-BusinessNews-Sep 04 2024

ఇక ఏ బ్యాంకు నుండైనా పింఛన్ తీసుకోవచ్చు-BusinessNews-Sep 04 2024

* ఆటో విడిభాగాల తయారీ కంపెనీ క్రాస్‌ లిమిటెడ్‌ (Kross) ఐపీఓ సెప్టెంబర్‌ 9- 11 మధ్య జరగనుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.228- 240గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లు ఒక రోజు ముందే బిడ్డింగ్‌ దాఖలు చేయొచ్చు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 62 (ఒక లాట్‌) షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.

* ఈపీఎస్‌ పింఛన్‌దారుల (EPS Pensioners)కు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశంలోని ఎక్కడి నుంచైనా ఏ బ్యాంక్‌ నుంచైనా పెన్షన్‌ (Pensions from any Bank) తీసుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ సిస్టమ్‌ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్‌ ట్రస్ట్‌బోర్డ్‌ ఛైర్మన్‌ మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. 2025 జనవరి 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని తెలిపారు. దీనివల్ల 78 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రయోజనం (Benefit to Pensioners) కలగనుందని చెప్పారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో ప్రారంభమైన మన సూచీలు.. తర్వాత కాస్త కోలుకుని భారీ నష్టాల నుంచి గట్టెక్కాయి. ఇప్పటికే సూచీలు గరిష్ఠ స్థాయిలకు చేరిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ షేర్లతో పాటు బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలపై పడింది. సెన్సెక్స్‌ ఉదయం 81,845.50 పాయింట్ల (క్రితం ముగింపు 82,555.44) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,833.69 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 202.80 పాయింట్ల నష్టంతో 82,352.64 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 81.15 పాయింట్ల నష్టంతో 25,198.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.98గా ఉంది.

* వాల్‌మార్ట్‌కు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. పండగల సీజన్‌ వేళ నిర్వహించే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ (The Big Billion Days 2024) సందర్భంగా లక్ష ఉద్యోగాల సృష్టించబోతున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. బిగ్ బిలియన్‌ డేస్ కోసం కొత్తగా 9 నగరాల్లో కొత్తగా 11 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు కూడా ప్రారంభించామని, దీంతో వీటి సంఖ్య 83కు చేరినట్లు పేర్కొంది. దేశ సామాజిక ఆర్థిక వృద్ధికి చేయూతలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా సప్లయ్‌ చైన్‌ విభాగంలో 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. దీనివల్ల ఈ పండగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడడంతో పాటు స్థానిక కమ్యూనిటీకి ఉపాధి లభిస్తాయని తెలిపింది.

* జాక్సన్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ జాక్సన్‌ ఇంజినీర్స్‌ తన సోలార్‌ తయారీ వ్యాపారాన్ని విస్తరించేందుకు రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ఈ రోజు తెలిపింది. ఈ పెట్టుబడితో 2,500 మెగావాట్ల సోలార్‌ సెల్‌ సౌకర్యాన్ని నెలకొల్పడంతో పాటు ప్రస్తుతం ఉన్న మాడ్యూల్‌ ప్లాంట్‌ను 2,000 మెగావాట్లకు విస్తరించనుంది. దీన్ని రెండు దశల్లో అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో ఉంది. సోలార్‌ సెల్‌ ప్లాంట్‌ మొదటి దశ వచ్చే 15 నెలల్లో ప్రారంభం కానుండగా, మాడ్యూల్‌ ప్లాంట్‌ విస్తరణ ఆరు నెలల్లో పూర్తి కానుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z