* హరియాణా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly Elections) వేళ అక్కడ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. భాజపాను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్-ఆప్ (Cong-AAP) కలిసి పోటీ చేసేందుకు పలుమార్లు చర్చలు జరగ్గా.. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో నెలకొన్న ప్రతిష్టంభన ఆ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆప్ కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. దీంతో హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తుపై నీలినీడలు కమ్ముకొన్నాయి.
* శంకర్-విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు’ ఏస్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమా రీమేక్‌పై తాజాగా దీనిపై విక్రమ్ (Vikram) స్పందించారు. అలాగే దీని హిందీ వెర్షన్ రీమేక్‌లో రణ్‌వీర్‌సింగ్ నటించడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘తంగలాన్’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఇంటర్వ్యూలో విక్రమ్ దీనిపై మాట్లాడారు. ‘‘అపరిచితుడు రీమేక్ గురించి శంకర్‌కు మాత్రమే తెలుసు. రీమేక్ నాతో ఎందుకు తీయడం లేదని ఆయన్నే అడగండి (నవ్వుతూ). ఇది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం. రణ్‌వీర్ ఈ సినిమాలో అద్భుతంగా చేస్తాడని నాకు నమ్మకముంది. ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన నటుల్లో రణ్‌వీర్ ఒకరు. ఆయన్ని అపరిచితుడు పాత్రలో చూడటం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. వీలైనంత త్వరగా ఈ సినిమా రీమేక్ చూడాలని ఉంది’’ అని అన్నారు.
* ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దర్యాప్తు అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారన్నారు. బ్యారేజీని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన 3 బోట్లు ఉన్నాయని చెప్పారు. లంగర్ వేయకుండా 3 బోట్లను ప్లాస్టిక్ తాడుతో కట్టారన్నారు. బోటు యజమాని వైకాపా నేత కావడం కుట్ర కోణాన్ని బలపరుస్తోందని చెప్పారు. 45, 50 టన్నుల బరువు ఉన్న పడవలు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయన్నారు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడం, గేట్లకు ఇబ్బంది లేదన్నారు.
* నాంపల్లిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని(ఐఐహెచ్‌టీ) వర్చువల్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ పదవులను తృణప్రాయంగా వదులుకున్నారని చెప్పారు. కానీ కొంత మంది రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు, ఉపఎన్నికలు తెచ్చారన్నారు. ఆ ఎన్నికల్లో సెలక్షన్లు, కలెక్షన్లు చేసి త్యాగమని చెప్పుకొంటున్నారని విమర్శించారు.
* బుడమేరుకు వస్తున్న వరద ఉద్ధృతిపై మంత్రి నారా లోకేశ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతమయ్యేలా లోకేశ్ చర్యలు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గండ్లు పడిన చోట సీపేజ్ లీకేజీ 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు వరద నీరు తగ్గిందన్నారు.
* వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం పూరీకి వాయవ్య దిశగా పయనిస్తోందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
* రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉంటుందని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.
* కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. వారు చేసిన ఆరోపణలను దీదీ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వంపై అపనిందలు వేసే ప్రయత్నమంటూ మండిపడ్డారు.
* దేశంలో తొలిసారి మంకీపాక్స్ (mpox) అనుమానితుడిని గుర్తించడంతో కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జారీ చేసిన హెల్త్ అడ్వైజరీ ప్రకారం భారత్‌లో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నిర్ధరణ కాలేదు. కానీ, దీని విషయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచించిన వ్యూహాలను అమలు చేయాలని పేర్కొంది. దేశంలో మంకీపాక్స్ క్లస్టర్లను గుర్తించడానికి నేషనల్ ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టుల్లో మంకీపాక్స్ స్క్రీనింగ్ మరింత వేగవంతం చేసినట్లు వెల్లడించింది. అనుమానిత కేసులను పరీక్షించేందుకు వీలుగా ఐసీఎంఆర్ ఆధీనంలోని పరిశోధనాశాలల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. రాష్ట్రాలు చర్మ, ఎస్‌టీడీ వ్యాధులకు చికిత్స చేసే క్లీనిక్స్‌పై దృష్టిపెట్టాలని సూచించింది. వ్యాధి లక్షణాలు కనిపించిన పేషెంట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ వ్యాధి, దాని వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజల్లో అనవసర భయాలు పొగేట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ తన అడ్వైజరీలో పేర్కొంది. ఈ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది. ముఖ్యంగా ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. అయితే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. తొలిసారి 2022లో భారీస్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది. దీంతో ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి. మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్), క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్)గా వర్గీకరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్-1 ఐబీ వేరియంట్ వేగంగా వ్యాపించడమే ఆందోళనకు కారణం. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది.
* ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తనతో సహా మంత్రులు, అధికారులు బురదలోనే తిరుగుతున్నారని చెప్పారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం చంద్రబాబు పర్యటించారు. కబేళా సెంటర్‌లో వరద బాధితులతో మాట్లాడారు. తొమ్మిది రోజులుగా ప్రజలు పడిన బాధలు వర్ణనాతీతమన్నారు. బుడమేరుకు గండ్లు పడినా గత పాలకులు పట్టించుకోలేదని, బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని విమర్శించారు.
* భారత్‌తో తమ దేశం సత్సంబంధాలను కోరుకుంటోందని బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. ఇవి సమాన హోదాతో పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ బీఎస్‌ఎస్ వెల్లడించింది. ఇటీవల ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర వర్గాలతో మహమ్మద్ యూనస్ భేటీ అయ్యారు. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆయన సహాయకుడు మహఫుజ్ ఆలం స్పందిస్తూ.. ‘‘మేం భారత్‌తో మంచి సంబంధాలు నెరపాలని భావిస్తున్నాం. ఇవి కచ్చితంగా సమానత్వం, పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని యూనస్ చెప్పారు’’ అని వెల్లడించారు. పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో బంగ్లాదేశ్ పరస్పర గౌరవం ఇస్తుందని పేర్కొన్నారు. సార్క్(సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోపరేషన్)ను పునరుద్ధరించాలని యూనస్ నొక్కి చెప్పినట్లు ఆలం తెలిపారు.
* నటుడు జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేడు అదే విషయాన్ని ఖరారు చేస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు రవి (Jayam Ravi) తెలిపారు.
* అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ (Congress) ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi).. డాలస్‌లోని ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్న ఆయన.. భాషలు, సంప్రదాయాల పేరుతో ఎవర్నీ వేరు చేసి చూడొద్దని అన్నారు. ఈసందర్భంగా తెలుగు భాష (Telugu Language) గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ‘‘భారత జాతీయగీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుంది. సమానంగా చూపిస్తుంది. అంతేగానీ.. ఒక రాష్టం బెస్ట్.. మరో రాష్ట్రం సెకండ్ బెస్ట్ అని అందులో ఎక్కడా ఉండదు. ఈ గీతం మన దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా చెబుతుంది. అప్పుడు ఒక రాష్ట్రం కంటే ఇంకో రాష్ట్రం ఎక్కువా కాదు.. తక్కువా కాదు. అలాగే భాష, సంప్రదాయాలు కూడా. తమిళం మాట్లాడేవారు మాకు నచ్చరు అని.. హిందీ మాట్లాడేవారే ఇష్టమని మనం చెప్పడం సరికాదు’’ అని రాహుల్ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z