* ఛత్రపతి’ చిత్రీకరణలోనూ ప్రభాస్ శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైన అప్పలనాయుడు (కోట శ్రీనివాసరావు)కు వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తానని చెబుతాడు. అయితే, అప్పుడు సెట్‌లో ప్రభాస్ డైలాగ్‌లే చెప్పలేదట. కేవలం పెదవులు మాత్రమే కదిపారట. ‘‘ఇంటర్వెల్ షాట్‌లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఒకపక్క వర్షం. పైగా చలి. రాజమౌళి దగ్గరకు వెళ్లి ‘డార్లింగ్ డైలాగ్ గట్టిగా చెప్పలేను. సైలెంట్‌గా చెబుతాను’ అని అనడంతో జక్కన్న కూడా ఓకే అన్నారు. ఆ షాట్‌లో కేవలం పెదాలు కదిపానంతే. అక్కడున్న వాళ్లకు నేను ఏ చేస్తున్నానో అర్థం కాలేదు. షాట్ ఓకే అయిపోయింది. జనం ఉంటే ఎందుకో సైలెంట్ అయిపోతా. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చేస్తున్నప్పుడు కూడా విశ్వనాథ్‌గారు సెట్‌లో ఉండగా ఇలాగే సైలెంట్‌గా డైలాగ్‌లు చెప్పేవాడిని. ఆయన పిలిచి ‘ఇలా అయితే ఎలా? ఓపెన్‌గా డైలాగ్ చెప్పాలి. మరీ అంత సిగ్గుపడితే ఎలా?’ అన్నారు. నాతో పనిచేసిన దర్శకులు అందరూ రాజమౌళిని తిట్టుకుంటారు. ‘ఆయన వల్లే నువ్వు ఇలా చెబుతున్నావు’(నవ్వులు) అని అనేవారు’’ అంటూ ప్రభాస్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
* శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి వచ్చిన జాన్వీకపూర్ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకున్నారు. అయితే ఈ అమ్మడు టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం వెనక ఓ స్టార్ దర్శకనిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఎంతో మంది నటీనటులు వారి కెరీర్ గురించి కరణ్ జోహర్ సలహాలు తీసుకుంటూ ఉంటారని టాక్. అలానే జాన్వీకు (Janhvi Kapoor) కూడా కరణ్ ఓ సూచన చేశారట. బీటౌన్‌లో తొలి అవకాశం అందుకున్న తర్వాత జాన్వీకు తమిళ, తెలుగులో ఛాన్స్‌లు వచ్చాయని దీంతో ఆమె కోలీవుడ్.. టాలీవుడ్‌లలో దేన్ని ఎంచుకోవాలో కరణ్‌ను సలహా కోరినట్లు సమాచారం. ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తే తెలుగులో మంచి ఛాన్స్‌లు వస్తాయని కరణ్ ఆమెతో చెప్పారట. దీంతో జాన్వీ వెంటనే ‘దేవర’ను ఓకే చేసేశారు (Janhvi Kapoor Tollywood Entry). కరణ్ సలహా ఈ భామకు కలిసొచ్చినట్లే ఇక్కడ స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఎన్టీఆర్‌తో సినిమా చేస్తుండగానే మెగా హీరో రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేశారు. నానితో కూడా ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తల వస్తున్నాయి.
* హైదరాబాద్‌లో ట్రాఫిక్ స్ట్రీమ్‌లైన్ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్‌పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రాఫిక్ స్ట్రీమ్‌లైన్ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్స్‌గా ఉపయోగించుకోవాలని సూచించారు. హోమ్‌గార్డ్స్ తరహాలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలన్నారు. ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
* పర్యావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఊహించని వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి వాటిని ముందస్తుగానే గుర్తించి, కచ్చితమైన అంచనాలను విడుదల చేయడానికి భారత్ సిద్ధమవుతోంది. ఇందుకోసం కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాధనాలను ఉపయోగించేందుకు నడుం బిగించింది. ‘మిషన్ మౌసం (Mission Mausam)’ పేరుతో రానున్న ఐదేళ్లలో రూ.2వేల కోట్లతో కార్యాచరణ అమలుకు రంగం సిద్ధం చేసింది. భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ప్రకారం.. వాతావరణ ప్రక్రియల్లో సంక్లిష్టత, ప్రస్తుత అబ్జర్వేషన్, మోడలింగ్ ప్రక్రియల్లో పరిమితుల కారణంగా ఉష్ణమండల వాతావరణం ముందస్తుగా అంచనా వేయడం సవాలుగా మారింది. ముఖ్యంగా పరిశీలనాత్మక సమాచారం విస్తృతంగా లేకపోవడం, న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ (NWP) పరిధి 12కి.మీ మాత్రమే ఉండటంతో స్వల్పకాలిక వాతావరణ మార్పులను అంచనా వేయడం సవాలుగా మారింది. భారీ వర్షాలతో వరదలు, కరవు, మేఘాల విస్ఫోటాలు (Cloudbursts), ఉరుములు, పిడుగుపాట్లు, కుంభవృష్టి వంటి ఘటనలను అంచనా వేయడం అసాధ్యంగా మారుతోంది.
* ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. దిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం విడుదలకు అవసరమైన ప్రక్రియ పూర్తి కావడంతో బెయిలు మంజూరైన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఆప్ శ్రేణులు, కేజ్రీవాల్ అభిమానులు జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. వర్షం కురుస్తుండగా.. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారందరికీ కేజ్రీవాల్ అభివాదం చేస్తూ కనిపించారు.
* మూడు డివిజన్ల పరిధిలోని 10 వీధుల్లో ఇంకా వరద నీరు ఉందని మంత్రి నారాయణ తెలిపారు. వరదల వల్ల 33 వేల ఇళ్లు, 36 వేల ద్విచక్రవాహనాలు పాడయ్యాయని చెప్పారు. వరద బాధితుల సహాయం కోసం బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు, మంత్రులు భేటీ అయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పాడైన ఇళ్లు, వాహనాలకు సంబంధించి శనివారం ఉదయానికి డేటా సేకరణ పూర్తవతుందున్నారు. డేటా పూర్తిగా వచ్చాక దేనికెంత ఇవ్వాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. వాణిజ్య దుకాణాలకు జరిగిన నష్టంపై శనివారం సాయంత్రానికి వివరాలు అందుతాయన్నారు.
* ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో హత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ముందుకు సాగకపోవడంతో జూనియర్ వైద్యుల నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూనియర్ వైద్యులు- రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతోన్న ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని జూనియర్ వైద్యులు కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ తరఫున రాసిన నాలుగు పేజీల లేఖను ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు సైతం పంపారు.
* భారత విదేశాంగమంత్రి ఎస్.జై శంకర్(Jaishankar) షాకింగ్ విషయం ఒకటి వెల్లడించారు. 1984లో హైజాక్(1984 Hijack) అయిన విమానంలో తన తండ్రి ఉన్నారని వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి..‘ది కాంధార్ హైజాక్’ సిరీస్ గురించి మాట్లాడుతూ ఈ ఆశ్చర్యకర విషయం తెలియజేశారు. ‘‘ఈ సిరీస్ నేను చూడలేదు. కాబట్టి దానిపై నేను మాట్లాడలేను. 1984లో కూడా ఒక హైజాక్ జరిగింది. అప్పుడు నేను ఉద్యోగంలో చేరి కొంతకాలమే అవుతోంది. ఆ హైజాక్ ఘటనను డీల్ చేసే బృందంలో నేను కూడా ఉన్నాను. దాంతో ఇంటికి రావడం కుదరదని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆ విమానంలో మా నాన్న ఉన్నారని. అదృష్టవశాత్తూ విమానంలో ఉన్నవారికి ఏమీ కాలేదు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒకవైపు హైజాక్‌కు సంబంధించిన వ్యవహారాన్ని చూస్తోన్న బృందంలో పనిచేస్తూ.. హైజాక్‌పై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కుటుంబ సభ్యుల్లోనూ నేను ఉన్నాను’’ అంటూ ఇంతకాలం ఎవరికీ పెద్దగా తెలియని విషయాన్ని చెప్పి మంత్రి ఆశ్చర్యపర్చారు.
* అండమాన్ నికోబార్ (Andaman and Nicobar) దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ (Port Blair) పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇకపై దానిని ‘శ్రీ విజయపురం (Sri Vijaya Puram)’ గా వ్యవహరించాలని నిర్ణయించింది. వలసవాద ఆనవాళ్ల నుంచి బయటపడేందుకు ఈ పేరును మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘‘వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలన్న ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్‌బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించాం. మునుపటి పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోంది. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక. నాటి పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకం’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z