* అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పడ్డాడు. పగలు ఉద్యోగం చేస్తూ.. రాత్రిపూట మరో ఇద్దరితో కలిసి వాహనాల బ్యాటరీల చోరీకి పాల్పడేవాడు. ఈ ముఠా గుట్టును తలకొండపల్లి పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ హుస్సేన్ (26)ని అరెస్టు చేశారు. నిందితుడు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా గత నెలలో చుక్కాపుర్‌లో 8 ట్రాక్టర్లు, ఓ టిప్పర్ బ్యాటరీలను దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హుస్సేన్‌ను అరెస్టు చేసి.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
* చిక్కడపల్లి హరినగర్‌లో ఓయువతి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన షహానా బేగం(24) ఐదో అంతస్తు టెర్రస్‌పైకి చేరుకుంది. ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
* అనకాపల్లి జిల్లా అనంతగిరి మండలం సరియా జలపాతంలో ఇద్దరు పర్యాటకులు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది శనివారం సరియా జలపాతం అందాలు వీక్షించేందుకు వచ్చారు. ఒకరు గల్లంతవ్వడంతో, అతడిని రక్షించేందుకు ఇద్దరు నేవీ ఉద్యోగులు ప్రయత్నించగా.. వారిలో మరొకరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని, గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.
* నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు రాకేశ్(12) అనే బాలుడు మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీనిపై బాలుడి తండ్రి లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు బాల్కొండలోని ఖిల్లాగుట్ట ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించారు. రాకేశ్ ఈనెల 11న రాత్రి అదే గ్రామానికి చెందిన బండి నరేందర్ అనే యువకుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు నరేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z