చెట్టుకు ఆయువుపట్టుగా ఉంటూ కనపడనప్పటికీ దాన్ని నిలబెట్టే వేరు లాగా ఎంతో మంది తన విజయం కోసం కృషి చేశారని, అందుకే ఆ విజయం తనది కాదని, ఇది అందరి విజయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం సాయంత్రం అర్వింగ్‌లో డాలస్ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఆయనను సత్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
కష్టపడే తత్త్వం, మంచి బుద్ధి, జ్ఞానం, సరిపడినంత ధనం, ధైర్యం కలిగిన తనలాంటి వాడు కూడా రాజకీయాల్లోకి వచ్చి అవసరమైన సాయం చేయకపోతే సమాజం బాగుపడదనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని పెమ్మసాని పేర్కొన్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఢిల్లీలో ఉంటూ, శని ఆదివారాల్లో గుంటూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాను శక్తిమేర ప్రయత్నిస్తున్నానని తెలిపారు. https://www.mygunturmp.in/ పేరిట తన కార్యాలయం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించిందని, ఎవరికీ ఏ సమస్య ఉన్నా అందులో అర్జీ సమర్పిస్తే తన కార్యాలయం దాన్ని పరిష్కరించేందుకు తోడ్పడుతుందని ఎంపీ పేర్కొన్నారు.
ఎన్నారైలకు ఉన్న సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని, పదవీ బాధ్యతలు చేపట్టిన 3నెలల్లో ప్రభుత్వ పనితీరుతో పాటు, అధికారుల పనితీరును ఆకళింపు చేసుకునే అవకాశం దొరికిందన్నారు. టెలీకమ్యూనికేషన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కూటమి ప్రభుత్వం ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతుందని చంద్రశేఖర్ అన్నారు.
పెమ్మసానితో తమ అనుభవాలను ఆయన మిత్రులు డా. పూదోట సునీత, డా. కోటి నడింపల్లి, చంద్ర నాగినేని, శ్రీధర్ పత్తిపాటిలు పంచుకున్నారు. ఘట్టమనేని సింధూజ శిష్య బృందం చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. దిలీప్ చండ్ర వ్యాఖ్యానంలో సాగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై తెదేపా శ్రేణులు కోమటి జయరాం, వేమన సతీష్, కేసీ చేకూరి, చలసాని కిషోర్, నవీన్ ఎర్రమనేని, సుధీర్ చింతమనేని, వెన్నం మురళీ, సత్య జాస్తి, నిఖిల్ సూరపనేని, పోలవరపు శ్రీకాంత్, ఉప్పు వినోద్, లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, సుగణ్ చాగర్లమూడి, విజయ్ బొర్రా, గొర్రిపాటి శ్రీనివాస్, నిర్మాత అనీల్ సుంకర తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z