NRI-NRT

తెలుగు సినీ ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన ఆదర్శప్రాయుడు అక్కినేని – డల్లాస్‌లో శతజయంతి

తెలుగు సినీ ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన ఆదర్శప్రాయుడు అక్కినేని – డల్లాస్‌లో శతజయంతి

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటింది ఎన్‌టీఆర్ అయితే, తెలుగు సినిమా ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన ఆదర్శప్రాయుడు డా. అక్కినేని నాగేశ్వరరావు అని వక్తలు కొనియాడారు. శుక్రవారం నాడు డల్లాస్ పరిసర ప్రాంతమైన అలెన్‌లోని రాధాకృష్ణ ఆలయంలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో అక్కినేని శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మద్రాసు నుండి తెలుగు సినిమా తరలింపులో కీలకంగా వ్యవహరించిన అక్కినేని, తనతో సినిమా తీయాలనుకుంటే హైదరాబాద్ రావాలని చేసిన ప్రకటన తెలుగు సినిమా ఆత్మాభిమానాన్ని నిలబెట్టిందని, బడి అంటే తెలియని ఆయన “అక్కినేని ఆలోచనలు (అ ఆ)” పేరిట జీవిత పాఠాలను పుస్తకంగా వ్రాసి తెలుగువారికి ఆదర్శప్రాయుడయ్యారని కొనియాడారు. తనకు సినిమా రంగం పట్ల అవగాహన కల్పించారని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన్ను తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు సంస్థ అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్ తదితరులు సత్కరించారు.

ప్రముఖ అవధానులు మేడసాని మోహన్, పాలపర్తి శ్యామాలానందప్రసాద్‌లు అక్కినేనితో తమ అనుభవాలను గుర్తు చేసుకుని సభికులతో పంచుకున్నారు. జొన్నలగడ్డ సుబ్రమణ్యం సమన్వయంలో రూపొందించిన ప్రత్యేక సంచికను పాలపర్తి ఆవిష్కరించారు. బావర్చి హోటళ్ల నిర్వాహకుడు కంచర్ల కిషోర్ తాను గుడివాడ ANR కళాశాల పూర్వ విద్యార్థినని చెప్పుకునేందుకు గర్విస్తానని, అక్కినేని కారణంగానే తాను జీవితంలో ఉన్నతస్థితికి ఎదిగానని కొనియాడారు.

కార్యక్రమంలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవ్స్థాపక అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్, అధ్యక్షుడు మురళీ వెన్నం, సభ్యులు కల్వల రావు, చలపతి కొండ్రుకుంట, ఆకునూరి శారద, రవి కొండబోలు, శ్రీధామ భక్తవత్సలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అక్కినేని సినీ గీతాంజలి, నృత్యాంజలి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z