Business

అమెరికా సంస్థను కొనుగోలు చేయనున్న OYO-BusinessNews-Sep 21 2024

అమెరికా సంస్థను కొనుగోలు చేయనున్న OYO-BusinessNews-Sep 21 2024

* తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ తెలిపింది. ఈ మేరకు తితిదే ఈవో జె.శ్యామలరావుకు లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పశుసంవర్థకశాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డెయిరీ ప్రసిద్ధి చెందింది. వినియోగదారులకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేసిన చరిత్ర ఉంది. విజయ డెయిరీ ఉత్పత్తుల్లో నాణ్యత నిర్ధరించడంతో పాటు లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతోంది. తితిదేకు అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి మా సంస్థ సన్నద్ధతలను తెలియజేస్తున్నాం. విజయ డెయిరీ ప్రభుత్వ సంస్థ అయినందున సరఫరాలో స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటుంది. దేవస్థానం, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.

* దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సంస్థ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ సీజన్‌లో భారీగా వర్షాలు కురవడం, నీటి లభ్యత పెరగడం కారణంగా భారీగా విద్యుత్ వినియోగం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు 9,862 మెగా వాట్లు అత్యధిక విద్యుత్‌ వాడకం జరగగా.. ఈ నెల 20న ఉదయం 10 గంటల 35 నిమిషాలకు 9,910 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి డిమాండ్ భారీగా పెరగడంతో ఈ వారంలో సరాసరి విద్యుత్ డిమాండ్ 9,317 మెగావాట్లు నమోదైంది. గతేడాది సరాసరి విద్యుత్ డిమాండ్ 9,138 మెగా వాట్లుగా నమోదైంది. ప్రస్తుతం సరాసరి విద్యుత్ వినియోగం 190.29 మిలియన్ యూనిట్లు కాగా, గతేడాది 182.11 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండటంతో వ్యవసాయ రంగంలో డిమాండ్ భారీగా పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌లో అత్యధికంగా విద్యుత్‌ డిమాండ్ 10,000 మెగావాట్లను కూడా దాటే అవకాశం ఉందని, డిమాండ్ ఎంతగా పెరిగినా దానికి తగ్గట్టు విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు.

* బెంగళూరులో ఆటో ఎక్కిన ఓ కస్టమర్‌ పేమెంట్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ చూపించాలని డ్రైవర్‌ని అడిగాడు. వెంటనే ఆ డ్రైవర్‌ తన చేతిలోని స్మార్ట్‌వాచ్‌లో ఉన్న కోడ్‌ని చూపించాడు. అది చూసిన కస్టమర్‌ ఆశ్చర్యపోయాడు. తనకు ఎదురైన అనుభవాన్ని ‘‘ఎక్స్‌’’ వేదికగా పంచుకున్నాడు. సంబంధిత ఫొటోనూ యాడ్‌ చేశాడు. అంతే ఆ పోస్ట్‌ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘ దేశం డిజిటల్‌ పథంలో దూసుకెళ్తోందని ఇప్పుడు నమ్ముతున్నా’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా.. ‘ఆధునిక సమస్యలను సరికొత్త పరిష్కారాలు, బిట్‌ కాయిన్లనూ యాక్సెప్ట్‌ చేస్తారా?’ అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

* ట్రాపిక్‌ నిబంధనలను ఉల్లంఘించి తప్పుడు మార్గాల్లో వాహనాలు ప్రయాణించడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు మహారాష్ట్రలోని థానే (Thane)పురపాలక సంఘం ఆలోచన చేసింది. రోడ్లపై టైర్‌ కిల్లర్స్‌ (Tyre killers)ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చర్య వాహనాల రద్దీతో పాటు ట్రాఫిక్‌ నిబంధనల పరిరక్షణకు సహకరిస్తుందని స్థానిక అధికారులు వెల్లడించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు లేదా రాంగ్‌ రూట్‌లో వాహనాలు నడుస్తున్న చోట్ల రోడ్లపై వీటిని బిగించనుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే ధమని ఘోడ్‌బందర్ రోడ్‌లో వీటిని ఏర్పాటు చేయనుంది. టైర్‌ కిల్లర్లు ఉన్నట్లు 100 మీటర్ల నుంచి 200 మీటర్లు ముందుగానే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఏ ఏ ప్రాంతాల్లో బిగించారనే సమాచారం పౌరులకు అందుబాటులో ఉంచుతారు. రాంగ్‌ రూట్‌లో వస్తున్న వాహనాల టైర్స్‌ను కిల్‌ చేయడం వల్ల ప్రమాదాలను కొంతవరకైన తగ్గించొచ్చనే ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

* భారతదేశ జీడీపీ 2032 నాటికి 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి సిద్ధపడుతుందని ఐడీబీఐ క్యాపిటల్‌ తన నివేదికలో తెలిపింది. ఈ నివేదిక ప్రకారం దేశ జీడీపీ ప్రతి 18 నెలలకు ఒక ట్రిలియన్‌ డాలర్లు జోడించడానికి సిద్ధంగా ఉందని, ఇదే ఊపుతో 2032 నాటికి 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి అవకాశముంటుందని పేర్కొంది. మేక్‌ ఇన్‌ ఇండియా వంటి కీలక కార్యక్రమాలు దేశానికి సంబంధించిన తయారీ సామర్థ్యాలను పెంపోదించడమే కాకుండా భారత్‌ను ‘గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌’గా ఉంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయని నివేదిక పేర్కొంది. పారిశ్రామికోత్పత్తి సూచీ(IIP)లో అమెరికా, చైనా, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్‌ వంటి దేశాలను అధిగమించి తయారీ రంగంలో అగ్రగామిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను భారత్‌ అధిగమిస్తుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం 2030 నాటికి జీడీపీలో 25% ఎగుమతులు 2 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేసింది.

* ప్రముఖ హస్పిటాలిటీ చైన్‌, దేశీయ యూనికార్న్‌ సంస్థ ఓయో (OYO).. అమెరికాలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ప్రముఖ లాడ్జింగ్‌ ఫ్రాంఛైజీ, మోటల్‌ 6, స్టూడియో 6 బ్రాండ్లను నడుపుతున్న జీ6 హాస్పిటాలిటీ సంస్థను కొనుగోలు చేయనుంది. బ్లాక్‌ స్టోన్‌ రియల్ ఎస్టేట్‌ కంపెనీ నుంచి 525 మిలియన్‌ డాలర్లకు దీన్ని కొనుగోలు చేయనున్నట్లు ఓయో మాతృ సంస్థ ఓర్వల్‌ స్టేస్‌ శనివారం ప్రకటించింది. పూర్తి నగదు రూపంలో ఈ లావాదేవీ జరగనుంది. భారత్‌లోని ప్రధాన నగరాల్లో సేవలందిస్తున్న ఓయో.. అమెరికాలో 2019లో అడుగుపెట్టింది. ప్రస్తుతం 35 రాష్ట్రాల్లో 320కి పైగా హోటళ్లను నిర్వహిస్తోంది. గతేడాది 100 హోటళ్లను చేర్చుకుంది. ఈ ఏడాది మరో 250 హోటళ్లను తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మోటల్‌ 6, స్టూడియో 6 బ్రాండ్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓయో ప్రకటించడం గమనార్హం. 2024 నాలుగో త్రైమాసికానికి కొనుగోలు పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు ఓయో తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z