* ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన కీలక నేతలు ముగ్గురు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యకు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. నేతల వెంట వందలాదిగా కార్యకర్తలు జనసేన కార్యాలయానికి తరలివచ్చారు.
* అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్నాళ్లక్రితం వెలుగు చూసిన అత్యాచార కేసులో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో లైంగిక దాడుల వ్యవహారం 2022లో వెలుగు చూసింది. తన 12 ఏళ్ల కవల కుమార్తెలను హాస్టల్ వార్డెన్ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ తండ్రి ఫిర్యాదు చేశారు. మరికొందరు బాధితులు కూడా ఇటువంటి ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దాంతో వార్డెన్ అరాచకాలు బయటపడ్డాయి. 2014-22 మధ్యకాలంలో 21 మంది మైనర్లపై అతడు లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. బాధితుల్లో ఆరుగురు బాలురు (ఆరేళ్ల నుంచి 14ఏళ్ల వయసున్న) కూడా ఉన్నట్లు తేలింది.
* మనుషులను పోలిన మనుషులు ఉండడం గురించి చూసే ఉంటాం. కొందరు సహజంగానే ప్రముఖులను పోలి ఉంటారు. మరికొందరు తమకు ఇష్టమైన నటుడు, నేతపై ఉన్న అభిమానంతో వారిని అనుకరించేందుకు ఆహార్యాన్ని ప్రయత్నిస్తుంటారు. ఆ మధ్య ఇలానే రజనీకాంత్‌ను పోలిన వ్యక్తి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. చాలా మంది అయనే రజనీకాంత్ అంటే నమ్మేశారు కూడా. తీరా ఆరా తీస్తే ఆ వ్యక్తిది కేరళ అని, టీ దుకాణం నడుపుతుంటాడని తేలింది. తాజాగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విషయంలోనూ అదే జరిగింది. అచ్చం హేమంత్ సోరెన్‌ను పోలిన వ్యక్తి ఆయనతోనే భేటీ కావడం, ముఖ్యమంత్రే స్వయంగా ఆ ఫొటోలను పంచుకోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
* ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కార్యాలయంలో సీఐడీ సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు కొనసాగిన తనిఖీల్లో సీఐడీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మద్యం కంపెనీలకే అధికంగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్టు గుర్తించారు. గత ప్రభుత్వంలో మద్యం బాటిల్ బేసిక్ ధరను పెంచి కొందరు పెద్దలు అనుచిత లబ్ధి పొందారని దర్యాప్తులో తేలింది. మద్యం లావాదేవీలకు సంబంధించిన పత్రాలను ఫైనాన్షియల్ ఆడిటింగ్‌కు పంపి విశ్లేషించే యోచనలో సీఐడీ అధికారులు ఉన్నారు. బినామీ మద్యం కంపెనీలపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసింది.
* ముడా (మైసూరు నగరాభివృద్ధి సంస్థ)స్కామ్ (MUDA Scam) కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ తరుణంలో సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసులు విచారించేందుకు సీబీఐకు అనుమతి ఉపసంహరించుకుంది. ఈ కుంభకోణంలో వాస్తవాలు వెలుగుతీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తో దర్యాప్తు చేయించాలని డిమాండ్లు వస్తోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ‘‘రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిని ఉపసంహరించుకుంటున్నాం. ఆ దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తారని ఆందోళన చెందుతున్నాం. వారిది పక్షపాత వైఖరి. ముడా స్కామ్‌తో దీనికి ఎలాంటి సంబంధం లేదు. మేం సీబీఐకి రెఫర్ చేసిన అన్ని కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయలేదు. ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మేం రెఫర్ చేసిన కేసుల్ని వారు తిరస్కరించిన సందర్భాలు అనేకం. వారు(సీబీఐని ఉద్దేశించి) తప్పుడు మార్గంలో పడకుండా నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాతో మాట్లాడారు. అలాగే తన అనుమతి లేకుండా గవర్నర్ అడిగిన ఎలాంటి సమాచారం అందించకూడదని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి కర్ణాటక కేబినెట్ ఆదేశాలు ఇచ్చింది.
* ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తప్పు చేసిన ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసులో కొంత మంది పోలీసులను విచారిస్తున్నామని తెలిపారు. విచారణలో బాధ్యులని తేలితే చర్యలుంటాయని చెప్పారు. కేసును సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారని అనిత పేర్కొన్నారు.
* మాజీ సీఎం జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో అందరూ చూశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని హితవు పలికారు. రెడ్‌బుక్ పని ప్రారంభమైందని, తప్పుచేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.
* సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, భాజపా ఎంపీ రఘునందన్‌రావు, భారాస ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రితో పాటు శ్రీనివాస్‌రెడ్డి వేదికపైకి వెళ్లారు. ఆయన వేదికపై ఉండొద్దని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
* భారాస హయాంలో నేతలన్నను కాపాడుకున్నామని, ఇప్పుడు మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల నేతన్నల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని.. తమ పోరాటానికి నేతన్నలు కూడా సహకరించాలని కోరారు.
* కేంద్రంలో భాజపా (BJP) సర్కార్‌పై కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిందంబరం (P Chidambaram) తీవ్ర ఆరోపణలు చేశారు. రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు కాషాయ పార్టీ వెనకాడదంటూ వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
* మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని, ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal). కొన్నిరోజుల క్రితం సీఎం పీఠాన్ని వదులుకున్న ఆయన తాజాగా భాజపాపై విమర్శలు చేశారు. ఆ పార్టీ నేత ఒకరు చెప్పిన మాటలు తనను షాక్ గురిచేశాయని అన్నారు.
* ఐరాస భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మరింత మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో ఫ్రాన్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. మారుతున్న కాలానికనుగుణంగా భద్రతా మండలి మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని.. భారత్ వంటి దేశాలకు కచ్చితంగా స్థానం కల్పించాలని సూచించింది.
* కొద్ది నెలల్లో జరగబోయే ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం (JMM) సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిష్క్రమించడం ఖాయమని.. భూమిపై ఉన్న ఏ శక్తీ దాన్ని ఆపలేదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. 2027 నాటికి అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రపంచ ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. ధన్‌బాద్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలపై జైలుకెళ్లిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గొప్ప వీరుడిలా నటిస్తున్నారని విమర్శించారు.
* #జస్ట్ ఆస్కింగ్.. అంటూ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) వివిధ అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. తాజాగా తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ ఘటనపైనా ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్టు వైరల్ అయింది. అక్కడి నుంచి ప్రకాశ్‌రాజ్ వరుసగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్…’ అని నిన్న పోస్ట్ చేయగా, ‘గెలిచే ముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? #జస్ట్ ఆస్కింగ్!’’ అని తెలుగులో మరో పోస్ట్ పెట్టారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారు? ఎందుకు పెట్టారు? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
* తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రష్యా భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూ వరుసలో శివనామస్మరణలతో శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. ఆలయంలోని శిల్పకళను, అందాలను వీక్షించారు. రష్యన్లతో ఫొటోలు దిగేందుకు మిగిలిన భక్తులు పోటీపడ్డారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z