Business

ఒక డాలరుకు ₹83.70-BusinessNews-Sep 27 2024

ఒక డాలరుకు ₹83.70-BusinessNews-Sep 27 2024

* ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు.. హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. నేటి(సెప్టెంబర్ 27) నుంచి హైదరాబాద్-కాన్పూర్, హైదరాబాద్‌-అయోధ్య మధ్య వారానికి 4 రోజుల సర్వీసును, రేపటి(సెప్టెంబర్ 28) నుంచి హైదరాబాద్-ప్రయాగరాజ్, హైదరాబాద్-ఆగ్రా మధ్య వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరం నుంచి ఇలా ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసులను ప్రారంభించడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

* ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెన్సీ ‘మేక్‌మైట్రిప్‌’ విమానయాన బిజినెస్‌ క్లాస్‌ ఛార్జీలపై తగ్గింపును అందించడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మలేషియా ఎయిర్‌లైన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఒమన్‌ ఎయిర్‌, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌, వర్జిన్‌ అట్లాంటిక్‌, విస్తారా వంటి 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిపి బిజినెస్‌-క్లాస్‌ ఛార్జీలపై 20 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు వినియోగదారులు సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 2 వరకు జరిగే బిజినెస్‌ క్లాస్‌ ఫెస్ట్‌లో అదనంగా రూ.10 వేల తగ్గింపును పొందొచ్చు. ప్రీమియం ప్రయాణ అనుభవాలను మరింత మెరుగుపర్చడమే ఈ ఆఫర్‌ లక్ష్యమని మేక్‌మైట్రిప్‌ తెలిపింది. మేక్‌మైట్రిప్‌ ఇటీవల అంతర్జాతీయ విమానాల కోసం ప్రత్యేకమైన బిజినెస్‌ క్లాస్‌ ఫన్నెల్‌ను ప్రారంభించింది.

* రిలయన్స్‌ జియో – బీపీ పల్స్‌ 500వ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ ముంబయిలో ప్రారంభమైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ, ఆ సంస్థ భాగస్వామి బీపీ సీఈవో ముర్రే అచిన్‌క్లస్‌ కలిసి ముంబయి బీకేసీలో జియో వరల్డ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 500వ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌, 5000వ ఛార్జింగ్‌ పాయింట్‌ను ఆవిష్కరించారు. జియో-బీపీ అనేది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అంతర్జాతీయ ఇంధన దిగ్గజం బీపీల సంయుక్త సంస్థ. జియో-బీపీ తన ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను వేగంగా పెంచుతోంది. ఈ నెట్‌ వర్క్‌లో 95శాతం వరకు వేగవంతమైన ఛార్జింగ్‌ స్టేషన్లనే నిర్మిస్తున్నారు.

* గ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో (SAIL) విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం విశాఖ స్టీల్‌ ప్లాంట్ ఆర్థికంగా, నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు సెయిల్‌ విలీన అంశాన్ని ఒక ప్రత్యామ్నాయంగా కేంద్రం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన భూములను ఎన్‌ఎండీసీకి విక్రయం, బ్యాంకు రుణాలు వంటి ప్రత్యామ్నాయ అంశాలనూ కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కేంద్ర ఉన్నతాధికారులు ఈ మేరకు భేటీ అయ్యారు. ‘‘వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెయిల్‌ను విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ప్లాంట్‌కు రుణాలు అందించడం, పెల్లెట్ ప్లాంట్ కోసం NMDCకి 1,500-2,000 ఎకరాల భూమిని విక్రయించే యోచన కూడా ఉంది’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

* వరుస లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. ఫెడ్‌ రేట్ల కోత, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు, విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో ఇటీవల ఆల్‌టైమ్‌ రికార్డులకు దూసుకెళ్లిన సూచీలు.. గరిష్ఠాల వద్ద మదుపర్ల లాభాల స్వీకరణతో ఈ వారంలో చివరి ట్రేడింగ్‌ సెషన్‌ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 250కి పైగా పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 26,200 దిగువకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 85,893.84 (క్రితం ముగింపు 85,836.12) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం కాసేపు లాభాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 85,978.25 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాలను తాకిన తర్వాత సూచీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 264.27 పాయింట్ల నష్టంతో 85,571.85 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37.10 పాయింట్ల నష్టంతో 26,178.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.70గా ఉంది. సెన్సెక్స్‌లో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగియగా.. సన్‌ఫార్మా, రిలయన్స్‌, టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాజీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 71.63 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2,684 వద్ద ట్రేడవుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z